Visakhapatnam Trains: విశాఖపట్నం నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు సెటిల్ రైల్వే సర్వీసులు నడిపించాలని రైల్వే వినియోగదారులు, నాయకులు రైల్వే అధికారులను డిమాండ్ చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అధికారులను వైజాగ్ నుంచి వివిధ గమ్యస్థానాలకు మరిన్ని రైలు సేవలను ప్రవేశపెట్టాలని కోరారు.
భువనేశ్వర్ లో 11వ ZRUCC మీటింగ్
తాజాగా భువనేశ్వర్‌లో జరిగిన 11వ జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (ZRUCC) సమావేశంలో ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కమిటీ ప్రతినిధి కె. ఈశ్వర్, దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కె. విజయ్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొని ప్రయాణీకులకు డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ రీటా రాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్థానిక రైల్వే సేవలకు సంబంధించిన అనేక కీలక అంశాలను ప్రస్తావించారు.
షటిల్ సర్వీసులు నడిపించాలని డిమాండ్
రైల్వే అధికారులు స్థానిక రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు శ్రీకాకుళం నుంచి రాజమండ్రి, కాకినాడ నుంచి విశాఖపట్నం మీదుగా అనుసంధానించే షటిల్ సర్వీసులు ప్రారంభించాలని కమిటీ సభ్యులు కోరారు. దువ్వాడ స్టేషన్ లోని ప్లాట్ ఫామ్ నంబర్ నాలుగు దగ్గర రిజర్వేషన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అదనంగా, విశాఖపట్నం నుంచి పూరి, సంబల్ పూర్, నర్సాపూర్, అరకుకు కొత్త రైలు మార్గాలను ఏర్పాటు చేయాలన్నారు. గుంటూరు-అరకు మధ్య రైలు సర్వీసు నడపాలని సభ్యులు కోరారు. దువ్వాడ స్టేషన్ లో వందే భారత్ రైలును ఆపాలని కోరుతూ ఒక పిటిషన్ ను సమర్పించడానికి ఈ సభ్యులు విజయనగరం ఎంపీ, ZRUCC సభ్యుడు కె. అప్పలనాయుడును కూడా కలిశారు.
Read Also: ప్రయాణీకులకు షాక్.. సికింద్రాబాద్, కాచిగూడ నుంచి వెళ్లే పలు రైళ్లు రద్దు!
పార్కింగ్ ఫీజులు తగ్గించాలని డిమాండ్
దువ్వాడ రైల్వే స్టేషన్ పార్కింగ్ ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయని వాదించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీలైనంత త్వరగా పార్కింగ్ ఫీజులను తగ్గించి, రైల్వే ప్రయాణీకులకు ఉపశమనం కలిగించాలని కోరారు. రైల్వే వినియోగదారుల ప్రతినిధులు ఈశ్వర్, విజయ్ కుమార్ డిమాండ్లను ZRUCC అధికారులు నోట్ చేసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
Read Also: మూత్రం ఆపుకోలేక.. బాటిళ్లలో టాయిలెట్ పోసిన విమాన ప్రయాణీకులు.. మరి ఇంత ఘోరమా!