Roopkund Lake Mystery: హిమాలయాల్లో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటే.. మరికొన్ని అంతుచిక్కని రహస్యాలతో అందరి దృష్టిని ఆకర్షించాయి. ఉత్తరాఖండ్ లోని రూప్‌కుండ్ సరస్సు అలాంటి ప్రదేశాల్లో ఒకటి. సముద్ర మట్టానికి సుమారు 5,020 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ చిన్న మంచు సరస్సును ప్రపంచ వ్యాప్తంగా స్కెలిటన్ లేక్ లేదంటే మిస్టరీ లేక్ అని పిలుస్తారు. కారణం.. మంచు కరిగినప్పుడు సరస్సు చుట్టూ బయటపడే వందలాది మానవ అస్థిపంజరాలు.
రూప్‌కుండ్ సరస్సు ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో, త్రిశూల్, నందా ఘుంటి పర్వత శిఖరాల మధ్య ఉంది. దాదాపు 40 మీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ సరస్సు ఏడాదిలో ఎక్కువ కాలం మంచుతో కప్పి ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగి మంచు కాస్త కరిగినప్పుడు సరస్సు ఒడ్డున, నీటిలో మానవ ఎముకలు కనిపిస్తాయి. 1942లో నందాదేవి గేమ్ రిజర్వ్ ప్రాంతంలో పనిచేస్తున్న అటవీ అధికారి హరికిషన్ మధ్వల్ వీటిని గుర్తించారు. అప్పటి నుంచి ఈ సరస్సు వెనుక ఉన్న మిస్టరీ తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది.
రూప్‌కుండ్‌లోని అస్థిపంజరాల గురించి స్థానికంగా ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. కన్నౌజ్ రాజు తన గర్భవతి రాణి, సేవకులు, నృత్యకారులతో కలిసి నందాదేవి యాత్రకు వెళ్లాడని చెబుతారు. ఆ సమయంలో దేవత ఆగ్రహానికి గురై భారీ వడగండ్ల వాన కురవడంతో వారంతా ప్రాణాలు కోల్పోయారని స్థానికులు నమ్ముతారు. ఈ కథ చాలా కాలంగా ప్రచారంలో ఉన్నప్పటికీ.. అస్థిపంజరాలపై శాస్త్రీయ పరిశోధనలు మొదలైన తర్వాత అసలు విషయం మరింత ఆసక్తికరంగా మారింది.
రూప్‌కుండ్‌లో లభించిన ఎముకలపై నిర్వహించిన జెనెటిక్, డీఎన్‌ఏ పరిశోధనలు సంచలన విషయాలను బయటపెట్టాయి. అక్కడ లభించిన అస్థిపంజరాలు ఒకే ప్రాంతానికి, ఒకే కాలానికి చెందినవి కాదని తేలడంతో అంతా ఆశ్చర్యపోయారు. పరిశోధనల్లో కొందరు దక్షిణాసియా మూలాలకు చెందినవారని, మరికొందరి జన్యు లక్షణాలు తూర్పు మధ్యధరా ప్రాంత ప్రజలతో పోలికలు కలిగి ఉన్నాయని తేలింది. దక్షిణాసియా మూలాలకు చెందిన ఓ సమూహం సుమారు క్రీ.శ. 800 ప్రాంతంలో మరణించినట్లు, మధ్యధరా ప్రాంతంతో జన్యు సంబంధం ఉన్నవారు దాదాపు వెయ్యి సంవత్సరాల తర్వాత, క్రీ.శ. 1800 ప్రాంతంలో అక్కడికి చేరుకున్నట్లు పరిశోధనలు సూచించాయి. దీంతో రూప్‌కుండ్ చరిత్రపై మరిన్ని ప్రశ్నలు తలెత్తాయి.
అస్థిపంజరాల పుర్రెలపై కనిపించిన గాయాలు కూడా పరిశోధకుల దృష్టిని ఆకర్షించాయి. కొన్ని ఆధారాల ప్రకారం పెద్ద పరిమాణంలో వడగండ్లు అకస్మాత్తుగా కురవడం వల్లే కొంతమంది ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని భావిస్తున్నారు. హిమాలయాల్లో వాతావరణం ఒక్కసారిగా మారడం సాధారణమే. అయితే, ఇంతటి భారీ వడగండ్ల వానలో చిక్కుకోవడం ప్రాణాంతకంగా మారి ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. అయినప్పటికీ రూప్‌కుండ్‌లోని ప్రతి అస్థిపంజరానికి ఒకే మరణ కారణం ఉందని చెప్పడం మాత్రం సులభం కాదు. ప్రకృతి అందాల మధ్య దాగి ఉన్న వందల ఏళ్ల నాటి మానవ అవశేషాలు రూప్‌కుండ్ సరస్సును మిగతా పర్యాటక ప్రాంతాల కంటే ప్రత్యేకంగా నిలబెట్టాయి.
Read Also: సాధువు శాపం.. తాంత్రికుడి మరణం.. రత్నావతి ప్రేమకథలో ఇంత భయంకరమైన ట్విస్ట్ ఉందా?