Secunderabad Railway Station Works: కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను అద్భుతంగా తీర్చిదిద్దుతోంది. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా వందలాది రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తోంది. ఈ పథకంలో భాగంగా తెలంగాణలోని పలు స్టేషన్లను ఇప్పటికే అద్భుతంగా నిర్మించబడ్డాయి. ఇక సౌత్ ఇండియాలోనే ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఈ పథకంలో భాగంగా పునర్నిర్మాణం జరుపుకుంటుంది. ఏకంగా రూ. 700 కోట్లకు పైగా అంచనా వ్యయంతో ఎయిర్ పోర్టును తలదన్నేలా ఈ రైల్వే స్టేషన్ ను నిర్మిస్తున్నారు. కొత్త స్టేషన్ భవనం, ఆధునిక డిజైన్ తో దీనిని తీర్చిదిద్దుతున్నారు. తాజాగా ఈ రైల్వే స్టేషన్ పనులకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారా? అని ఆశ్చర్యపోవడం పక్కా!
రూ. 715 కోట్లతో రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి
హైదరాబాద్ లో రోజు రోజుకు పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 715 కోట్లు కేటాయించింది. కొద్ది నెలల క్రితమే పాత స్టేషన్ ను పూర్తిగా కూల్చి వేసిన అధికారులు, దాని స్థానంలో అత్యాధునిక రైల్వే స్టేషన్ ను నిర్మిస్తున్నారు.
ఎయిర్ పోర్టును తలదన్నేలా నిర్మాణం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ఎయిర్ పోర్టు తరహా సౌకర్యాలతో అద్భుతంగా నిర్మిస్తున్నారు. ప్రయాణీకుల రద్దీకి తగినట్లుగా మల్లీ లెవల్ టెర్మినల్ బిల్డింగ్ ను నిర్మిస్తున్నారు. ఏసీ వెయిటింగ్ లాంజ్ లు, ఫుడ్ కోర్డులు, టికెటింగ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. క్రౌడ్ కంట్రోల్ కోసం ప్రత్యేకంగా ఎంట్రీ, ఎగ్జిట్ టెర్మినల్స్ ను నిర్మిస్తున్నారు. ప్రయాణీకులు ఈజీగా తమ తమ ప్లాట్ ఫారమ్స్ దగ్గరికి వెళ్లేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్లు, మెట్ల మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా రైళ్లకు సంబంధించిన రాకపోకల వివరాలను తెలుసుకునేందుకు డిజిటల్ ఇన్ఫర్మేషన్ బోర్డులను అమర్చబోతున్నారు.
ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి..
ఇక స్టేషన్ అససరాలకు సరిపడ విద్యుత్ తయారు చేసుకునేందుకు సోలార్ ప్యానల్స్ అమర్చబోతున్నారు. స్టేషన్ కు ప్రయాణీకులు ఈజీగా రాకపోకలు కొనసాగించేలా.. కొత్త రోడ్లు, మెట్రో కనెక్టివిటీని తీసుకురాబోతున్నారు. సికింద్రాబాద్ తూర్పు మెట్రో స్టేషన్ తో అనుసంధానం కానుంది. ఉచిత మెట్రో ఫీడర్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. వాహనాలను పార్క్ చేసేందుకు మల్టీలెవలర్ కార్ పార్మింగ్ తో పాటు ఇతర వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పనులు పూర్తికాగానే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలతో సేవలు అందించనుంది. ప్రస్తుతం స్టేషన్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నందున కొన్ని ప్లాట్ ఫారమ్‌లు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. ఇక్కడి నుంచి నడిచే రైళ్లను ఇతర స్టేషన్ల నుంచి నడిపిస్తున్నారు.