వర్షాకాలం ప్రారంభం కావడంతో తెలంగాణలో ప్రకృతి కొత్త అందాలను సంతరించుకుంటుంది. వాగులు, వంకలు, చెరువులు, నదులు నిండుగా ప్రవహిస్తూ పచ్చని వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఈ సమయంలో రాష్ట్రంలోని జలపాతాలు పాలధారల్లా ప్రవహిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తాయి.
హైదరాబాద్‌కు సమీపంలోనే మంచి అందమైన జలపాతాలు ఉండటంతో వీకెండ్ విహారయాత్రలకు ఇవి మంచి ఆప్షన్.
నాగార్జునసాగర్ సమీపంలో ఉన్న ఎత్తిపోతల జలపాతం హైదరాబాద్‌కు సుమారు 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుమారు 70 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు జాలువారుతుంది. నక్కవాగు, తుమ్మలవాగు, చంద్రవంక ప్రవాహాలు కలిసి ఈ జలపాతం ఏర్పడుతుంది. సమీపంలో ఉన్న మొసళ్ల సంరక్షణ కేంద్రాన్ని కూడా చూసేందుకు వీలుంది.
ఆదిలాబాద్ జిల్లాలో కడెం నదిపై ఉన్న కుంతల జలపాతం తెలంగాణలోని ఎత్తైన జలపాతాల్లో ఒకటి. సుమారు 200 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు పడుతుంది. చుట్టూ ఉన్న దట్టమైన అడవులు ఈ ప్రాంతానికి మరింత అందాన్ని తీసుకొస్తాయి. హైదరాబాద్ నుంచి ఇది సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో ఉన్న బొగత జలపాతాన్ని “తెలంగాణ నయాగరా” అని కూడా అంటారు. ఇది హైదరాబాద్ నుంచి సుమారు 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. వర్షాకాలంలో ఈ జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ అద్భుతమైన దృశ్యంగా కనిపిస్తుంది. నీళ్ల శబ్దం, చుట్టూ ఉన్న ప్రకృతి పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
నాగర్‌కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో మల్లెల తీర్థం ఉంది. శ్రీశైలం మార్గంలో ఉన్న ఈ జలపాతం హైదరాబాద్‌కు సుమారు 185 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ జలపాతాన్ని చూడాలంటే దాదాపు 400 మెట్లు దిగాలి. పచ్చని అడవుల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
మహబూబాబాద్ జిల్లాలో ఉన్న భీముని పాదం జలపాతం సుమారు 70 అడుగుల ఎత్తు నుంచి ప్రవహిస్తుంది. ఇది హైదరాబాద్‌కు సుమారు 195 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జలపాతం వేసవిలో కూడా ప్రవహించడం దీని ప్రత్యేకత. దీని నీటి మూలం ఇప్పటికీ రహస్యంగానే ఉందని స్థానికులు చెబుతుంటారు.
Also Read: ఏడాదిలో కేవలం 2 నెలలు మాత్రమే కనిపించే అందమైన నగరం.. పర్యాటకుల ఫేవరెట్ స్పాట్
నిర్మల్ సమీపంలోని కడెం నదిపై పోచెర జలపాతం ఉంది. సుమారు 40 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు జాలువారుతుంది.
పచ్చని అడవులు, పక్షుల చేసే కిల కిల శబ్దాలతో ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.
వర్షాకాలంలో తెలంగాణలోని ఈ జలపాతాలు ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి అద్భుతమైన గమ్యస్థానాలు. అయితే వర్షాల సమయంలో రాళ్లు జారే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణం చేయడం మంచిది.