hyderabad Ganesh Pandals: హైదరాబాద్ లో దశాబ్దాలుగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి వీధిలో ఓ గణనాయకుడు కొలువుదీరుతాడు. 9 రోజుల పాటు ఘనమైన పూజలు అందుకుంటాడు. అయితే, హైదరాబాద్ లో తప్పక సందర్శించాల్సిన గణేష్ మండపాలు కొన్ని ఉన్నాయి. ఎత్తైన, పౌరాణిక ఇతివృత్తాలకు ప్రసిద్ధి చెందిన ఐకానిక్ ఖైరతాబాద్ గణేష్, చారిత్రక లాల్ దర్వాజా గణేష్, రద్దీగా ఉండే పాత బేగంబజార్ గణేష్, లడ్డూ వేలానికి ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేష్, రాంనగర్ సిద్దిక్ గణేష్, గౌలిపురా గణేష్ లాంటి ఎన్నో గణనాథులు భక్తులను ఆకట్టుకుంటాయి.
హైదరాబాద్ లో తప్పక సందర్శించాల్సి 7 గణనాథులు
⦿ ఖైరతాబాద్ గణేష్: తెలంగాణలోనే కాదు, యావత్ భారతదేశంలో ఖైరతాబాద్ వినాయకుడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎత్తైన విగ్రహం, దాని భారీ పరిమాణం, ప్రతి సంవత్సరం మారుతున్న పౌరాణిక ఇతివృత్తాలతో ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ గణనాథుడిని దర్శించుకోవడంతో పాటు నిమజ్జనం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
⦿ బాలాపూర్ గణేష్: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రతి ఏటా ఇక్కడ వేలం ధర పెరుగుతూ వస్తోంది. తెలంగాణ ప్రజలంతా ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ ధర ఎంత పలుకుతుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
⦿ లాల్ దర్వాజా గణేష్: 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన గణపతి ఇక్కడ కొలువుదీరుతుంది. ఈ వినాయకుడిని చూసేందుకు నగరంలోని అనేక మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు.
⦿ బేగం బజార్ గణేష్: హైదరాబాద్ లో అత్యంత పురాతనమైన, ఎక్కువ రద్దీగా ఉండే గణపతి మండపాల్లో ఇదీ ఒకటి. నిత్యం ఇక్కడి వినాయకులను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.
⦿ గౌలిపుర గణేష్: ఈ వినాయకుడి మండసానికి కూడా దశాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడ గణపతి నవరాత్రి ఉత్సాలు కన్నుల పండువగా జరుగుతాయి.
⦿ రాంనగర్ సిద్ధిక్ గణేష్: రామ్ నగర్ ప్రాంతంలో ఇదో ప్రసిద్ధ గణపతి మండపం. హైదరాబాద్ లో తప్పకుండా సందర్శించాల్సిన గణపతి మండపాల్లో ఇది ఒకటి. ఇక్కడికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
⦿ లిబర్టీ చా రాజా: హిమాయత్ నగర్ లో ఉండే ఈ గణపతి మండపం బాగా పాపులర్. వినాయక భక్తులకు ఎంతో ఇష్టమైన గణేష్ మండపాలలో ఇదీ ఒకటి.
గణపతులను సందర్శించడానికి చిట్కాలు
⦿ జనసమూహం: హైదరాబాద్ లోని ఖైరతాబాద్, బేగంబజార్ గణపతి మండపాల దగ్గర పెద్ద సంఖ్యలో భక్తులు ఉండే అవకాశం ఉంది.
⦿ ట్రాఫిక్: గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి. ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ఉండటానికి మెట్రో రవాణాను ఉపయోగించడం మంచిది.
⦿ భద్రత: రద్దీగా ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రాంతాల్లో జేబు దొంగలు, ఈవ్ టీజర్లు ఉండే అవకాశం ఉంది. ఎందుకైనా కాస్త జాగ్రత్తగా ఉండాలి.
Read Also: ప్రపంచంలోనే రిచ్చెస్ట్ విలేజ్, మన దేశంలోనే ఉందనే విషయం మీకు తెలుసా?