Ultimate Train Travel Experience: ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన రైలు ప్రయాణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని జీవితాంతం మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి. వాటిలో ఒకటి పోర్చుగల్- సింగపూర్ ట్రైన్ జర్నీ. ఈ ప్రయాణం మొత్తం 13 దేశాల మీదుగా సాగుతుంది. కేవలం గమ్యస్థానానికి చేరుకోవడం మాత్రమే కాదు.. ప్రపంచంలోని విభిన్న సంస్కృతులు, ప్రకృతి అందాలు, లైఫ్ స్టైల్ ను దగ్గరగా చూసే అరుదైన అవకాశం కల్పిస్తుంది కూడా.
ఈ రూట్ పోర్చుగల్ లో ప్రారంభమై స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, బెలారస్, రష్యా, మంగోలియా, చైనా, లావోస్, థాయిలాండ్, మలేషియా మీదుగా చివరకు సింగపూర్ కు చేరుకుంటుంది. మొత్తం 18,755 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి సుమారు 21 రోజుల సమయం పడుతుంది. ఈ ప్రయాణంలో పలు రైల్వే నెట్ వర్క్ లను ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే, దీనిని సాధారణ రైలు ప్రయాణం కంటే అతిపెద్ద ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎక్స్ పీరియెన్స్ గా చెప్పుకోవచ్చు.
టికెట్ ఖర్చు క్లాస్, సీజన్, బుకింగ్ సమయాన్ని బట్టి మారుతుంది. సాధారణంగా ఈ మొత్తం ప్రయాణానికి సుమారు రూ.1.02 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే, ప్రయాణంలో వసతి, ఆహారం, ఇతర ఖర్చులు అదనంగా ఉంటాయి. ఈ ప్రయాణంలో ప్రతి దేశం తన ప్రత్యేకతతో ఆకట్టుకుంటుంది. యూరప్ లోని ఆధునిక నగరాలు, రష్యాలోని విస్తారమైన మైదానాలు, మంగోలియాలోని ప్రకృతి అందాలు, చైనాలోని ఆధునిక రైల్వే వ్యవస్థ, ఆగ్నేయాసియా దేశాల సంస్కృతి ప్రతి ప్రాంతం కొత్త అనుభూతిని ఇస్తుంది.
అంతేకాదు, ఒకే ప్రయాణంలో అనేక భాషలు, వంటకాలు, సంప్రదాయాలు, వాతావరణ మార్పులు, టైమ్ జోన్లను ఎక్స్ పీరియెన్స్ చేసే అవకాశం లభిస్తుంది. అందుకే ప్రపం చవ్యాప్తంగా ట్రావెల్ ప్రేమికులు ఈ రూట్ ను తమ డ్రీమ్ జర్నీగా భావిస్తుంటారు.
ఈ మార్గంలో ప్రయాణించాలనుకునేవారు ముందుగానే రైలు టికెట్లు, వీసాలు, ప్రయాణ అనుమతులు కావాల్సి ఉంటుంది. అందుకే, ఈ ప్రయాణాన్ని కొద్ది నెలల ముందే చేసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రతి దేశానికి వేర్వేరు ఎంట్రీ నిబంధనలు ఉంటాయి. పోర్చుగల్ నుంచి సింగపూర్ వరకు సాగే ఈ 13 దేశాల రైలు ప్రయాణం ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన ప్రయాణాల్లో ఒకటిగా కొనసాగుతోంది. కొత్త దేశాలు చూడాలనుకునే వారికి, విభిన్న సంస్కృతులను అనుభవించాలనుకునే వారికి ఇదో అద్భుతమైన రైలు ప్రయాణంగా చెప్పుకోవచ్చు.
Read Also: వందేభారత్ రైల్లో స్పెషల్ కమాండోలు.. కారణం ఏంటంటే?