CORAS Commandos on Vande Bharat: జమ్మూ-శ్రీనగర్ మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి భారతీయ రైల్వే ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. సున్నితమైన మార్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన కమాండోస్ ఫర్ రైల్వే సెక్యూరిటీ(CORAS) బలగాలను రైలులో మోహరించింది. ప్రస్తుతం ఈ కమాండోలు రైలులో గస్తీ కాస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
జమ్మూ-శ్రీనగర్ రైల్వే మార్గం భద్రతా పరంగా అత్యంత కీలకమైన ప్రాంతాల్లో ఒకటిగా రైల్వే భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మార్గాన్ని ప్రత్యేకంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారి ప్రయాణం పూర్తిగా సురక్షితంగా ఉండేలా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే ఆధునిక ఆయుధాలతో సిద్ధంగా ఉండే CORAS కమాండోలను రైల్వే విధుల్లోకి తీసుకొచ్చింది.
ఈ కమాండోలు సాధారణ భద్రతా సిబ్బందితో పోలిస్తే ప్రత్యేక శిక్షణ పొందారు. ఉగ్రవాద నిరోధక చర్యలు, అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడం, ప్రయాణికులను రక్షించడం లాంటి విషయాల్లో వీరికి ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది. అందుకే, ఎక్కువ భద్రత అవసరమైన రైలు మార్గాల్లో వీరిని వినియోగిస్తున్నారు.
వాస్తవానికి వందేభారత్ ఎక్స్ ప్రెస్ దేశంలోని అత్యాధునిక రైళ్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. వేగవంతమైన ప్రయాణంతో పాటు అత్యాధునిక సౌకర్యాలను అందించే ఈ రైలు ప్రారంభమైనప్పటి నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా జమ్మూ-శ్రీనగర్ మార్గంలో ప్రారంభమైన తర్వాత వేలాది మంది ప్రయాణికులు ఈ సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భద్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
ప్రస్తుతం రైలులో కమాండోలు ఆయుధాలతో గస్తీ నిర్వహిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను చూసిన పలువురు ప్రయాణికులు రైల్వే శాఖ తీసుకున్న చర్యలను ప్రశంసిస్తున్నారు. ఇలాంటి భద్రతా ఏర్పాట్ల వల్ల ప్రయాణికుల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
అటు రైల్వేశాఖ సైతం భద్రతా పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ అవసరానికి అనుగుణంగా అదనపు చర్యలు కూడా చేపడుతున్నారు. రైలులో మాత్రమే కాకుండా స్టేషన్లు, బ్రిడ్జిలు, టన్నెల్స్ లాంటి కీలక ప్రాంతాల్లో కూడా నిఘాను పెంచారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రత్యేక భద్రతా బలగాల సహకారంతో ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. జమ్మూ-శ్రీనగర్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో CORAS కమాండోలను మోహరించడం ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేసే చర్యగా నిపుణులు భావిస్తున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో నడిచే రైళ్లలో ఇలాంటి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు భవిష్యత్తులో కూడా కొనసాగించే అవకాశం ఉందని రైల్వే వెల్లడించింది.
Read Also: ఏంటీ.. విమానంలో టర్కీ కోడి డిన్నరా? 1949లో లగ్జరీ ఏ స్థాయిలో ఉండేదో తెలుసా?