ఈ రోజుల్లో చాలా మంది బిజీ లైఫ్ కారణంగా ఇంట్లో వంట చేయడమే మానేస్తున్నారు. ఆన్ లైన్ లో ఆర్టర్ పెట్టామా? పార్శిల్ రాగానే తీసి తినేశామా? సింపుల్ గా మూతి తుడుచుకున్నామా? అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని సంస్థలు ఫుడ్ విషయంలో క్వాలిటీ మెయింటెయిన్ చేస్తున్నప్పటికీ, మరికొన్ని రెస్టారెంట్లు, ఫుడ్ పాయింట్లు సుచి శుభ్రత ఏమాత్రం పాటించడం లేదు. తరచుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధిస్తున్నప్పటికీ, చాలా సంస్థలు తీరు మార్చుకోవడం లేదు. తాజాగా ముంబైలోని ధారావిలో క్విక్-కామర్స్ యునికార్న్ జెప్టో ఫుడ్ బిజినెస్ లైసెన్స్‌ను ఆహార భద్రతా ప్రమాణాలను పాటించనందుకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారులు సస్పెండ్ చేశారు.
అధికారుల తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెల్లడి!
తాజాగా జెప్టో ఫుడ్ బిజినెస్ సంస్థపై FDA అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఆహార పదార్థాను పరిశీలించి షాక్ అయ్యారు. సదరు సంస్థ తీరు పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైందని అభిప్రాయపడ్డారు. కొన్ని డ్రింక్స్ గడువు తీరినప్పటికీ అమ్ముతున్నట్లు తేల్చారు. మరికొన్ని ఆహార పదార్థాలపై శిలీంధ్రాలు పెరుగుతున్నట్లు గుర్తించారు. కోల్డ్ స్టోరేజ్ లో ఉష్ణోగ్రతలను సరిగ్గా నిర్వహించకపోవడం, గడువు ముగిసిన పదార్థాలను వేరు చేయకపోవడం, నేల మీద నేరుగా నిల్వ చేసిన ఫుడ్స్, తడి, మురికితో వాసన రావడం గుర్తించారు.
లైసెన్స్ క్యాన్సిల్ చేసిన FDA అధికారులు
జెప్టో నిర్వహిస్తున్న సంస్థ కిరాణాకార్ట్ టెక్నాలజీస్ సంస్థ ఆహార భద్రత, ప్రమాణాల చట్టం నిబంధనలకు అనుగుణంగా లేదని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో లైసెన్స్ క్యాన్సిల్ చేస్తున్నట్లు వెల్లడించారు. సదరు సంస్థ అన్ని ప్రమాణాలను పాటించేంత వరకు లైసెన్స్ సస్పెండ్ లో ఉంటుందని FDA అధికారులు వెల్లడించారు.
Read Also: ప్రపంచంలో అత్యంత రోత పుట్టించే ఫుడ్స్, చూస్తే యాక్ అనాల్సిందే!
జెప్టో వివరణ ఎలా ఉందంటే?
లైసెన్స్ సస్పెన్షన్ తర్వాత జెప్టో ఒక ప్రకటన విడుదల చేసింది. “జెప్టోలో ఆహార సేఫ్టీ, నీట్ నెస్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయినప్పటికీ కొన్ని లోటుపాట్లు ఉన్నట్లు తేలింది. లైసెన్స్ క్యాన్సిల్ పై ఇప్పటికే అంతర్గత సమీక్షను ప్రారంభించాము. మా సంస్థలో జరిగిన పొరపాట్లను గుర్తించి వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. గుర్తించిన లోపాలను సరిదిద్దడానికి, మా వినియోగదారులకు సురక్షితమైన నాణ్యత గల ఉత్పత్తులను అందించడానికి కృషి చేస్తున్నాం. త్వరలోనే మళ్లీ లైసెన్స్ ను తిరిగి పొంది యథావిధిగా సేవలను కొనసాగిస్తాం. మమ్మల్ని ఆదరిస్తున్న వినియోగదారులకు ధన్యవాదాలు. మళ్లీ వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రయత్నం చేస్తాం” అని జెప్టో ప్రతినిధి తెలిపారు. జెప్టో అనేది ప్రస్తుతం ఫుడ్ డెలివరీలో దేశంలోనే అగ్రశ్రేణి సంస్థగా కొనసాగుతోంది. స్విగ్గీ, జొమాటోతో పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో సదరు సంస్థకు చెందిన లైసెన్స్ రద్దు చేయడం పట్ల వినియోగదారులు షాక్ అవుతున్నారు.
Read Also: వామ్మో.. నది నిండా అనకొండలు.. గుండె ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి!