Big Tv Live Originals: చైనా వేల ఏండ్ల సాంస్కృతి, సంప్రదాయ చరిత్రను కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి. ముఖ్యంగా విదేశీ పర్యాటకులను ఆశ్చర్య పరిచే ఆచారం ఒకటి ఉంది. చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాల్లో ప్రజలు విగ్రహాలను చితకబాదుతారు. తెలియని వాళ్లు చూస్తే సదరు విగ్రహాల మీద ప్రజలు దాడి చేస్తున్నట్లుగా ఉంటుంది. కానీ, అక్కడ ఉండే ఓ వింతైన ఆచారంగా చెప్పుకోవచ్చు.
వందల ఏండ్లుగా కొనసాగుతన్నసంప్రదాయం
కొన్ని దేవాలయాలు, వారసత్వ ప్రదేశాలలో సందర్శకులు విగ్రహాల మీద తమ కోపాన్ని అంతటినీ వెళ్లగక్కుతారు. వాటిని ధ్వంసం చేయాలనేది వారి ఉద్దేశం కాదు. కానీ, ఆచారంలో భాగంగా విగ్రహాలను కొడుతుంటారు. ఈ విగ్రహాల్లో ఇక్కడి ప్రజలు దేశ ద్రోహులుగా పరిగణించబడే వ్యక్తులను చూస్తారు. ఆ విగ్రహాలను కొట్టడం ద్వారా ప్రజలు తమ కోపాన్ని ఆ వ్యక్తుల మీద చూపించినట్లుగా భావిస్తారు.
ముఖ్యంగా హాంగ్ జౌలో యు ఫీ ఆలయం ఉంది. ఇక్కడ, సందర్శకులు క్విన్ హుయ్, అతని భార్య విగ్రహాలను కొడతారు. క్విన్ హుయ్ సాంగ్ రాజవంశం నుంచి వచ్చిన ప్రభుత్వ అధికారి. అతడు దేశం కోసం కొట్లాడిన యు ఫీని ఉరి తీయిస్తాడు. ఈ నేపథ్యంలోనే అతడి విగ్రహాలను కొడుతూ తమ కోపాన్ని వెళ్లగక్కుతారు.
విగ్రహాలను కొట్టడం వెనుక ఉద్దేశం
1.ద్రోహంపై ఆగ్రహం
క్విన్ హుయ్ లాంటి చారిత్రక విలన్ల విగ్రహాలను కొడుతూ, వారు చేసిన ద్రోహాన్ని గుర్తు చేసుకుంటారు. భవిష్యత్ తరాలకు విధేయత, గౌరవం గురించి చెప్పేందుకే ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
2.దుష్ట శక్తులను తరిమికొట్టడం
కొన్ని ఆలయాల్లో ప్రతికూల శక్తులు, దుష్టశక్తులను వదిలించుకోవడానికి ప్రజలు విగ్రహాలను కొడుతుంటారు.
3.చరిత్రలో ఒక పాఠం
విగ్రహాలను కొట్టడం అనే ఆచారం కేవలం కోపం గురించి మాత్రమే కాదు. ప్రజల శారీరక, భావోద్వేగపరంగా చరిత్రతో కనెక్ట్ అయ్యే మార్గంగా భావిస్తారు. తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలకు చరిత్రలో జరిగిన తప్పుల గురించి ప్రతక్ష్యంగా వివరించేందుకు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారు.
విగ్రహాలతో సంభాషించడం
విగ్రహాలను కొట్టడం ద్రోహ పూరిత వ్యక్తులను తిరస్కరించడానికి మార్గం అయితే. అదృష్టాన్ని ఆకర్షించడానికి విగ్రహాలను తాకడం, రుద్దం లేదా మాట్లాడ్డం చేస్తుంటారు. లాఫింగ్ బుద్ధను తాకడం వల్ల ఆనందం, శ్రేయస్సును పొందే అవకాశం ఉందని భావిస్తారు. ఆలయ ప్రవేశ ద్వారాల దగ్గర కనిపించే సింహాలు రక్షణకు చిహ్నాలు. కొంతమంది సందర్శకులు వాటిని తాకుతారు. అలా చేయడం వల్ల అదృష్టం కలుగుతుందని భావిస్తారు.
చైనీస్ సంప్రదాయాలతో పరిచయం లేని వారికి, విగ్రహాలను కొట్టడం అనే ఆలోచన వింతగా అనిపించవచ్చు. కానీ, ఇది దేశ వారసత్వంలో ఒక భాగంగా భావిస్తారు. చరిత్ర, నైతిక పాఠాలు, మూఢనమ్మకాలను తెలియజేస్తుంది. విధ్వంసం చేసే చర్యకు బదులుగా, చరిత్రను సజీవంగా ఉంచడానికి, గత తప్పులను మరచిపోకుండా చూసుకోవడానికి ఒక మార్గంగా ఉపయోగపడుతుంది.
Read Also: విడాకుల కోసం కోర్టుకెక్కిన భార్య.. పాటపాడి మనసు కరిగించిన భర్త!