నవమాసాలు మోసి కన్న బిడ్డన తల్లులు ఎంతో అపురూపంగా చూసుకుంటారు. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అప్పుడే పుట్టిన బిడ్డ పట్ల మరింత కేర్ తీసుకుంటారు. కానీ, ఓ తల్లి తన శిశువును ఏకంగా ఫ్రీజర్ లో పెట్టి నిద్రపోవడం చూసి ఇంట్లో వాళ్లు షాకయ్యారు. వెంటనే చిన్నారిని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటుంది. యూపీలో మొరాదాబాద్ లో ఈ దిగ్భ్రాంతికర సంఘటన జరిగింది. ఇంతకీ ఆ తల్లి అలా ఎందుకు చేసింది? కారణాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లాలో ఎవరూ ఊహించని ఘటన జరిగింది. 15 రోజుల చిన్నారని ఫ్రీజర్ లో పెట్టి ఓ తల్లి హాయిగా నిద్రపోయింది. చల్లదనం కారణంగా శిశువు గట్టిగా ఏడ్వడం ప్రారంభించింది. చిన్నారి ఏడ్పు వినిపించడంతో కుంటుంబ సభ్యులు వచ్చారు. ఏడ్పు ఫ్రిజ్ నుంచి రావడంతో ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే డోర్ ఓపెన్ చేసి శిశువును బయటకు తీశారు. వెంటనే, చిన్నారిని తీసుకుని డాక్టర్ దగ్గరికి పరిగెత్తారు. వైద్యుడు తగిన చికిత్స అందించడంతో శిశువు ఆరోగ్య పరిస్థితి అదుపులోకి వచ్చింది. శిశువు ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.
తల్లి శిశువును ఫ్రీజర్ లో పెట్టడానికి కారణం ఆమె మానసిక పరిస్థితి బాగా లేకపోవడం అని వైద్యులు గుర్తించారు. ఆమె ప్రసవానంతర మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు. దీనిని వైద్య పరిభాషలో సైకోసిస్ అని పిలుస్తారని డాక్టర్లు తెలిపారు. ఈ సమస్య చాలా అరుదుగా వస్తుందని, అలాంటి వారిలో ఈ శిశువు తల్లికూడా ఒకరని తెలిపారు. ప్రసవం తర్వాత కొంతమంది మహిళలను ఈ సమస్య ప్రభావితం చేస్తుందన్నారు. దీని వల్ల వారు వాస్తవికతతో సంబంధం కోల్పోతారని వెల్లడించారు.
ప్రసవం తర్వాత హార్మోన్ల మార్పులు, మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ కారణాతో తల్లి తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. బిడ్డకు ఆమె హాని కలిగించడానికి కూడా వెనుకాడని పరిస్థితికి చేరుకుంటుంది. ఈ సమస్యను కంట్రోల్ చేయడానికి ముందస్తు గుర్తింపు, చికిత్స చాలా అవసరం అని వైద్యులు తెలిపారు. అటు ఈ ఘటనతో సదరు మహిళను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమెకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. త్వరలోనే ఆమె కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి కూడా నార్మల్ కు చేరుకున్నట్లు వైద్యులు వెల్లడించారు. తల్లి, బిడ్డకు ఎలాంటి హాని కలగకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఈ ఘటన గురించి తెలుసుకుని పరిసర ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు.
Read Also: ఒకప్పుడు తిండి లేక పస్తులు.. ఇప్పుడు చేతినిండా డబ్బు, పెద్ద ఇల్లు.. ఈమె ఎవరో తెలుసా?