Bajau Community: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ ఎన్నో సంచార జాతులు ఆధుని నాగరికతకు దూరంగా జీవిస్తున్నాయి. అలాంటి ఓ ప్రత్యేకమైన తెగ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…ఈ తెగలు ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ తీరప్రాంతాలలో నివసిస్తాయి. ఆ తెగ పేరు బజావు తెగ. వారి జీవితం అంతా సముద్రం చుట్టూనే తిరుగుతుంది. అరుదుగా భూమ్మీదికి వస్తారు.
30 మీటర్ల లోతులో.. పావుగంట శ్వాస తీసుకోకుండా..
బజావు తెగ ప్రజలు అసాధారణ డైవింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వాళ్లు 20నుంచి 30 మీటర్ల లోతుకు డైవ్ చేయగలరు. ఐదు నుంచి 13 నిమిషాల పాటు శ్వాస పీల్చుకోకుండా ఉండగలరు. బజావులకు సాధారణ ప్రజల కంటే సగటున 50% పెద్ద ప్లీహాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అందుకే వాళ్లు సముద్రం లోపల అంతసేపు ఉంటారని వెల్లడించారు. బజావు పిల్లలు చిన్నప్పటి నుండే ఈత కొట్టడం, డైవ్ చేయడం నేర్చుకుంటారు. ఎందుకంటే సముద్రం వారికి కేవలం జీవనోపాధికి సంబంధించిన విషయం కాదు, వారి జీవితమే సముద్రం. వాళ్లు సాంప్రదాయ చెక్క కళ్లజోడు, చేతితో తయారు చేసిన ఈటెలను ఉపయోగించి చేపలు, ఆక్టోపస్, సముద్ర దోసకాయలను వేటాడతారు. బజావులు లెపా-లెపా అని పిలిచే చెక్క పడవలలో నివసిస్తారు. ఇవి వారికి ఇళ్ళు గానూ, ప్రయాణ సాధనాలుగా పనిచేస్తాయి. కాలానుగుణ మార్పుల తరువాత, వారు ఆహారం, ఆదాయం, రోజువారీ అవసరాల కోసం సముద్రంపై పూర్తిగా ఆధారపడుతారు. చేపలు పట్టడం వారి వృత్తిగా కొనసాగుతోంది.
ప్రకృతి నుంచి ఎన్నో సవాళ్లు!
కొన్ని బజావు సమాజాలు తీరం వెంబడి ఉన్న స్టిల్ట్ ఇళ్లలో స్థిరపడే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఇప్పటికీ వారు సముద్రంలోనే ఎక్కువగా గడపాలని భావిస్తున్నారు. అయితే, వారి జీవన విధానానికి ప్రస్తుతం ముప్పు ఏర్పడుతోంది. పర్యాటక రంగం విస్తరించడం, సాంప్రదాయ ఫిషింగ్ మార్గాలను దెబ్బతీసింది. కొంతమంది వ్యక్తులు డైనమైట్ ఫిషింగ్ లాంటి హానికరమైన పద్ధతుల వైపు మొగ్గు చూపారు. ఇది సముద్ర పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తోంది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, బజావులు తమ సంస్కృతిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తెగల నాయకులు వారి హక్కుల గురించి అవగాహన పెంచడానికి కృషి చేస్తున్నారు. యువతరం సాంప్రదాయ జ్ఞానం, అవసరమైన ఆధునిక అనుసరణలను స్వీకరించాలని ప్రోత్సహిస్తున్నారు. అయితే, వీరికంటూ ఇప్పటికీ ఓ గుర్తింపు లేదు. ఓ ప్రాంతం లేదు. విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి చర్యలు లేవు. అయినప్పటికీ, తమ జాతిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఇక బజావు సమాజాల్లో ఆధ్యాత్మికత కూడా ఉంది. వారి నమ్మకాలు ఇస్లాం, ఆనిమిస్టిక్ సంప్రదాయాల మిశ్రమంగా ఉంటుంది. వాళ్లు ఉంబో తుహాన్ (సముద్ర దేవుడు), దయాంగ్ దయాంగ్ మంగిలై (అడవి దేవత)లను పూజిస్తారు. ఇది వారికి భూమి, నీటితో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. మొత్తంగా ఈ తెగ జీవితం అంతా సముద్రంలోనే గడిచిపోతుంది. ఈ తెగను అంతరించిపోకుండా కాపాడాల్సిన అవసరం ఉందంటున్నారు పరిశోధకులు.
Read Also: ఈ తాబేలుకు ఎప్పుడూ అదే పని.. 800 పిల్లలకు తండ్రి, దానికో కారణం ఉందట!