150 Indian Freedom Fighters On Egg: మైక్రో ఆర్టిస్టులు చేసే అద్భుతాలు మామూలుగా ఉండవు. బియ్యం గింజ మీద పేర్లు, పెన్సిల్ కొనల మీద కళాకండాలు, చాక్ పీస్ ల మీద ప్రముఖుల బొమ్మలు రూపొందిస్తూ అలరిస్తారు. తాజాగా ఏపీలోని ఓ కళాకారుడు కూడా మూడు గంటల్లో 150 మంది స్వాతంత్య్ర సమరయోధుల ఫోటోలు వేసి అందరినీ అలరించాడు. అదీ కోడిగుడ్డు మీద చిత్రించి వారెవ్వా అనిపించాడు. ఇంతకీ ఆ మైక్రో పెయింటర్ ఎవరంటే..
అరుదైన ఘనత సాధించిన చింతలపల్లె కోటేష్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ కోడి గుడ్డుపై ఏకంగా 150 మంది స్వాతంత్య్ర సమరయోధుల సూక్ష్మ చిత్రాలను వేశాడు. వాటర్ కలర్, మైక్రో బ్రష్ ఉపయోగించి కేవలం 3 గంటల సమయంలో వీరి ఫోటోలను చిత్రీకరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఫోటోలను చూసి అందరూ శభాష్ అంటూ మెచ్చుకున్నారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరులకు సంతాపంగా ఈ ఫోటోలు వేశానని చెప్పాడు వెంకటేష్. వారికి ఘన నివాళి అర్పిస్తున్నట్లు వెల్లడించారు.
కోటేష్ ఎవరి చిత్రాలు వేశాడంటే..
కోటేష్ చిత్రీకరించిన ఫోటోల్లో గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రవీంద్ర నాథ్ ఠాగూర్, రాజా రామ్ మోహన్ రాయ్, చంద్ర శేఖర్ ఆజాద్, బాల గంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మి భాయ్, సరోజినీ నాయుడు, వీర సావర్కర్, తాంతియా తోపే, సర్వేపల్లి రాధా కృషన్ సహా బోలెడు మంది ప్రముఖ ఫోటోలను అచ్చుగుద్దినట్లు దింపేశాడు. చాలా మందికి తెలియని, వెలుగులోకి రాని స్వాతంత్య్ర సమరయోధుల ఫోటోలను కూడా ఆయన చిత్రీకరించి ప్రపంచానికి తెలిసేలా చేశాడు.
Read Also: దేశంలో వింతైన రైల్వే స్టేషన్లు, రైల్వే మార్గాలు.. వీటి గురించి తెలిస్తే ఔరా అనాల్సిందే!
వారి ఫోటోలు చిత్రీకరించే అవకాశం రావడం అదృష్టం
అటు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 150 మంది స్వాతంత్య్ర సమరయోధుల పోట్రేయిట్ చిత్రాలను వేసే అవకాశం రావడం నిజంగా తన అదృష్టం అన్నాడు కోటేష్. ఎంతో మంది త్యాగమూర్తుల పోరాటం ఫలితంగా 1947 ఆగస్టు 15న బ్రిటిషర్ల పాలన నుంచి భరతమాత విముక్తిపొందినట్లు వెల్లడించారు. ఎంతో మంది దేశం కోసం ప్రాణ త్యాగం చేస్తే, ఈ రోజు మనమంతా సంతోషంగా జీవిస్తున్నట్లు తెలిపారు. ప్రతి భారతీయుడు నిత్యం స్వాతంత్య్ర సమరయోధులను తలచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటి మహనీయులను పోట్రేయిట్ సూక్ష్మ చిత్రాల ద్వారా గుర్తు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. వారిందరికీ ఘన నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు కోటేష్.
Read Also: డిమార్ట్ సిబ్బంది చెప్పిన సీక్రెట్ టిప్స్.. ఇలా చేస్తే మరింత చౌకగా వస్తువులు కొనేయొచ్చు!