Wolf Dog Expensive| ఒక కుక్క ధర రూ.50 కోట్లు. అవును, ఈ ధర విన్న సామాన్యులు నోరు తెరవడం కష్టమే. కానీ బెంగళూరుకు చెందిన ఎస్. సతీశ్ అనే ప్రముఖ డాగ్ బ్రీడర్ మాత్రం “జస్ట్ రూ.50 కోట్లేనా?” అనుకున్నారు. వెంటనే డబ్బు చెల్లించి ఆ కుక్కను కొనుగోలు చేశారు.
ఇంతకీ ఈ స్పెషల్ కుక్క పేరు చెప్పలేదు కదా? దాని పేరు కాడాబాంబ్ ఒకామి. ఒకామి అనే పేరు వినడానికి జపాన్ లేదా చైనా పేరులా అనిపిస్తుంది. కానీ ఇది పుట్టింది మాత్రం అమెరికాలో. ఇది కాకేషన్ షెపర్డ్ జాతి కుక్క, మరొక తోడేలుకి క్రాస్ బ్రీడ్ చేయడంతో పుట్టింది. ఇలాంటి క్రాస్ బ్రీడింగ్ చేయడం ఇదే మొదటిసారి. అందుకే ఇంత ధర అని చెబుతున్నారు. ఏదైతేనేం.. ఇప్పుడు ఈ అసాధారణ కుక్క ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కుక్కగా రికార్డ్ నెలకొల్పింది.
Also Read: ఫ్రిజ్ లో కుక్కతల.. బాబోయ్.. అక్కడ మోమోస్ తిన్నారో మీ పని అంతే!
ఒకామి ప్రత్యేకతలు
దీని వయసు కేవలం 8 నెలలు మాత్రమే. కానీ బరువు ఇప్పటికే 75 కిలోలు ఉంది. అంటే ఈ ఒకామి మనిషి మీద పడితే, అతని కాళ్ళు లేదా చేతులు విరగడం ఖాయం. దీనికి రోజువారీ ఆహార ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. తోడేలు ఎంత క్రూరమైనదో మనకు తెలిసిందే. ఇక కాకేషన్ షెపర్డ్ జాతి కుక్కల గురించి చెప్పాలంటే, చలి తీవ్రంగా ఉండి మంచు కురిసే దేశాల్లో కాకేషన్ షెపర్డ్ కుక్కలను ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. ఈ కుక్కలు చాలా బలంగా ఉంటాయి. పశువులు, గొర్రెల మందలను తోడేళ్ల బారి నుంచి కాపాడటానికి వీటిని ఉపయోగిస్తారు. అయితే ఈ లెక్కన, ఈ తోడేలు, కాకేషన్ షెపర్డ్ కుక్కలు.. రెండింటినీ కలిపి తీసినట్లు ఉండే ఒకామి ఇంకెంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఊహించండి. ఇది ఒక రోజుకు కనీసం 3 కిలోల చికెన్ తో పాటు ఇతర ఆహారం కూడా భారీగా లాగించేస్తుందట.
ఇంత ధర పెట్టి కొనడం అవసరమా?
1990 సంవత్సరం నుంచీ సతీశ్ డాగ్ బ్రీడింగ్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన దగ్గర 150 రకాల జాతుల ప్రత్యేక కుక్కలు ఉన్నాయి. ఇవి చాలా పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నాయి. అందుకే సతీశ్ కు కుక్కలంటే మక్కువ. అయితే గత పదేళ్లుగా సతీశ్ కుక్కల బ్రీడింగ్ ఆపేశారు. ఎందుకంటే అలా చేయడం కంటే.. ఇలాంటి అరుదైన కుక్కలను కొని, వాటిని షోలలో ప్రదర్శించడం ద్వారా ఆయనకు భారీగా సంపాదన వస్తోంది. ఒక షోలో కేవలం 30 నిమిషాల పాటు తన కుక్కను ప్రదర్శించడానికి ఆయన రూ.2.5 లక్షలు చార్జ్ చేస్తారు. గత ఏడాది కూడా ఆయన పాండాలా కనిపించే చౌచౌ జాతి కుక్కను ఒక షోలో ప్రదర్శించి ఇది “జస్ట్ రూ.29 కోట్లే” అని చెప్పి అందరికీ షాకిచ్చారు.
“వీటిని చూడటానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. టికెట్లు కొని వస్తారు. సెల్ఫీలు తీసుకుంటారు. నేను, నా స్పెషల్ డాగ్స్ సినిమా యాక్టర్లలాగా బాగా పాపులర్ అయ్యాము” అని సతీశ్ సంతోషం వ్యక్తం చేశారు. సతీశ్ తన వద్ద ఉన్న ఖరీదైన కుక్కలను పెంచడానికి 7 ఎకరాల ఫామ్ హౌస్ కొన్నార. ఖరీదైనవి కావడంతో ఎవరూ వాటిని దొంగలించకుండా సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా పెట్టారు. కుక్కల సంరక్షణ బాధ్యతలను చూసుకోవడానికి ఆయన వద్ద ఆరుగురు సిబ్బంది ఉంటారు. కనకపు సింహాసనం వేయలేదు కానీ, ఈ కుక్కలకు దాదాపు అలాంటి సదుపాయాలే ఉంటాయి.