Viral Video: సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే తపనతో ఇటీవల యువత ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. లైకులు, ఫాలోవర్లు, వ్యూస్ కోసం ప్రమాదకర స్టంట్లు, రిస్కీ వీడియోలు చేస్తూ ఇబ్బందుల్లో పడుతున్నారు. వ్యూస్ కోసం ఎత్తైన భవనాలపై ఎక్కడం, రైళ్ల ముందు డ్యాన్సులు, ట్రైన్ కింద పడుకోవడం, ప్రమాదకర ప్రదేశాల్లో ఫోటోలు తీయడం లాంటి స్టంట్స్ చేస్తున్నారు. వీటి వల్ల యువత ప్రాణాలే పోతున్నాయి. ఎన్ని జరిగినా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఎదురైనా మళ్లీ ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నారు. ప్రాణాలను పోగుట్టుకుంటున్నారు. కొంత మంది యువత చేసే ప్రమాదకరమైన స్టంట్స్ వల్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.
కార్లతో హంగామా చేస్తూ..!
తాజాగా.. ఈ రోజు హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లో కొంత మంది యువత కార్లతో హంగామా చేస్తూ, సోషల్ మీడియా కోసం రీల్స్ చేస్తూ హల్‌చల్ సృష్టించారు. ఈ సంఘటన వాహనదారుల్లో ఆందోళన కలిగించింది. రద్దీగా ఉండే ఎల్‌బీ నగర్ జంక్షన్ వద్ద ఈ యువకులు తమ వాహనాలతో స్టంట్లు చేశారు రోడ్డు మధ్యలో కార్లను ఆపి, రీల్స్ చేస్తూ వాహనదారులను ఇబ్బందికి గురిచేశారు. ఈ సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. దీని వల్ల వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రయాణికులు, చుట్టు పక్కల స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
డేంజర్ స్టంట్స్.. గంటల తరబడి ట్రాఫిక్ సమస్య
ఈ యువకులు లగ్జరీ కార్లను ఉపయోగించి రోడ్డుపై వేగంగా డ్రైవ్ చేస్తూ డేంజర్ స్టంట్స్ చేశారు. వీటిని వీడియోలుగా రికార్డ్ చేసి, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేయడం ద్వారా ఫేమస్ కావాలని కలలు కంటున్నారు. అయితే వీరు రోడ్డుపై రీల్స్ చేస్తున్న సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఘటన వల్ల ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవాల్సి వచ్చింది. స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే రంగంలోకి దిగారు. యువకులను అదుపులోకి తీసుకుని, వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ యువకులు తమ ఉద్దేశం కేవలం సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే తప్ప.. ఎవరికీ ఎలాంటి హాని కలిగించే ఉద్దేశం లేదని చెబుతున్నట్టు తెలుస్తోంది.
కఠిన చర్యలు తీసుకోవాలి..
అయితే.. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు. యువకులు చేసిన హంగామాపై మండిపడుతున్నారు. సోషల్ మీడియా రీల్స్ కోసం బాధ్యతారహితంగా వ్యవహరించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ నియమాలను గౌరవించాలని, ప్రజల భద్రతను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు ఇలాంటి సంఘటనలను నివారించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇదిగో వీడియో..
నడిరోడ్డుపై కార్లలో నుంచి వేలాడుతూ యువకుల రీల్స్
ఎల్బీనగర్-సాగర్ రింగ్ రోడ్డు నుంచి ఉప్పల్ వెళ్లే మార్గంలో కార్లతో హంగామా
ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా ఎమర్జెన్సీ సైరన్ వేసుకుంటూ కార్లపై ఎక్కుతూ రీల్స్ చేసిన యువకులు pic.twitter.com/JNhMHl3X22
— BIG TV Breaking News (@bigtvtelugu) July 25, 2025