CM Chandrababu: టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఈ పోస్టులో.. 43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ.. మన తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు అన్నారు.
అన్న నందమూరి తారక రామారావు గారిచే స్థాపించబడిన.. ఆంధ్రుల ఆత్మగౌరవ పతాక.. తెలుగుజాతి కీర్తిని ప్రపంచానికి చాటిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా.. తెలుగు ప్రజలకు, తెలుగుదేశం పార్టీనీ నాలుగు దశాబ్దాలుగా తమ భుజస్కంధాల మీద మోస్తున్న కార్యకర్తలకు, నాయకులకు, కుటుంబ సభ్యులకు టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఇన్నేళ్లు దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే.. అందుకు కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగగుణం, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుక ఉండే కార్యకర్తలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం చంద్రబాబు అన్నారు.
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం.. అభివృద్ధి పథాన నడిపించిన జెండా తెలుగు దేశం పార్టీ జెండా అన్నారు. ఆడపడుచులకు అండగా.. రైతన్నల కన్నీరు తుడిచి, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాజకీయానికి అర్థం మార్చి, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం తెచ్చిన జెండా టీడీపీ జెండా అని తెలిపారు. భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే పాలసీలు తెచ్చిన జెండా… మన పసుపు జెండా అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
దేశంలో మరే రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం స్థాయిలో ప్రజల జీవితాలను ప్రభావితం చేయలేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు.. ఆ తరువాత అని ప్రతి ఒక్కరు గుర్తించే పరిస్థితి ఉంది. ప్రజల జీవితాల్లో ఆ స్థాయి మార్పులు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగు దేశం పార్టీ అని తెలిపారు. కోటికి పైగా సభ్యత్వాలతో అసాధారణ రికార్డును సృష్టించి.. తెలుగువాడి పౌరుషంలా రెపరెపలాడుతున్న మన తెలుగు దేశం జెండాను మోస్తున్న కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్ చేస్తూ ట్వీట్ చేశారు. ప్రజా సేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తు.. జై తెలుగుదేశం.. జోహార్ ఎన్టీఆర్ అంటూ.. పార్టీ ఆవిర్బావ రోజున ట్వీట్ చేయగా.. కొద్ది నిమిషాల్లో లక్షల్లో వ్యూస్‌ను ఆ ట్వీట్ సాధించందంటే అతిశయోక్తి కాదు.
Also Read: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కార్యకర్తలకు హ్యాట్సాఫ్ చెప్పిన జగన్
కాగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం ముగించుకుని.. చెన్నైలో IIT కాంక్లేవ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కాంక్లేవ్‌లో తెలుగు విద్యార్థులను చూసి ఉప్పొంగిపోయారు. తనదైన స్టైల్‌లో తెలుగులో మాట్లాడి విద్యార్థులను ఉత్సాహ పరిచారు. చెన్నైలో ఏ యూనివర్సిటీకి వెళ్లినా తెలుగువారి సంఖ్య ఘనంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు వ్యక్తిగా, భారతీయుడిగా తాను గర్వపడుతున్నానని తెలిపారు. సంపద సృష్టిలో భారతీయులదే ప్రముఖ స్థానమని సీఎం కామెంట్స్ చేశారు. ఒకప్పుడు ITఅని చెప్పుకుంటే.. ఇప్పుడు AI అని చెప్పుకుంటున్నారని తెలిపారు.
నాడు హైదరాబాద్‌లో హైటెక్ సిటీని నిర్మించానని.. ప్రస్తుతం ఏపీలో క్వాంటమ్ వ్యాలీని డెవలప్‌మెంట్ చేయబోతున్నామని పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీకి పోటీగా క్వాంటమ్ వ్యాలీని తీర్చిదిద్దుతామని తెలిపారు. తెలుగు విద్యార్థులపై తనకు విశ్వాసం, ఆశలు ఉన్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏపీ ప్రజల తలసరి ఆదాయం రూ. 55 లక్షలు అవుతుందన్నారు. వేరే రాష్ట్రం, దేశాల్లో ఉండే ఏపీ విద్యార్థులు, ప్రజలు బాగా సంపాదించి ఆ డబ్బులతో ఏపీకి వచ్చి అభివృద్ధి చేసే పరిస్థితి రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.