AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న మహిళలకు ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. సూపర్ సిక్స్ స్కీమ్స్ ను ఒక్కొకటిగా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, ఇప్పుడు ఫ్రీ బస్ పథకం వార్తల్లో నిలిచింది. అయితే ఈ స్కీమ్ ఎప్పటి నుండి అమలవుతుందనే విషయాన్ని తెలుసుకుందాం.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు సూపర్ సిక్స్ పథకాలు దోహదపడ్డాయి. అలాగే పింఛన్ పెంపు గురించి ఇచ్చిన హామీ కూడా ఎన్నికలపై ప్రభావం చూపింది. అందుకే కూటమి కూడా ఏకంగా 164 సీట్లలో విజయాన్ని అందుకుంది. ఈ విజయం దేశ చరిత్రను కూడా తిరగరాసిందని చెప్పవచ్చు. అందుకే ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతోంది. పింఛన్ పెంపుతో వృద్దులు, వికలాంగులకు చేయూతను అందించిన ప్రభుత్వం.. సూపర్ సిక్స్ లో భాగమైన ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందించే పథకాన్ని కూడా అమలు చేస్తోంది.
అంతేకాదు రైతులకు ఏడాదికి పెట్టుబడి సాయం కింద రూ. 20 వేలు ఇచ్చేందుకు తగిన కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. అయితే ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్ అమలు ఎప్పుడనేది ముందు నుండి ఎన్నో ఊహాగానాలను రేకెత్తిస్తోంది. ప్రభుత్వం ఏర్పడ్డాక ముందు మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేస్తారన్నది టాక్. కానీ డీఎస్సీ నోటిఫికేషన్, ధాన్యం అమ్మకాలు, రహదారుల అభివృద్ది తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఇటువంటి తరుణంలో ఫ్రీ బస్ స్కీమ్ మరోమారు వార్తల్లోకి వచ్చింది. ఏపీలో సంక్రాంతి కానుకగా ఫ్రీ బస్ స్కీమ్ అమలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో అమలవుతున్న ఫ్రీ బస్ స్కీమ్ గురించి ప్రభుత్వం కూడా ఒక అధ్యయనం చేసింది. పల్లె వెలుగుల వరకు ఫ్రీ బస్ అమలు చేయాలా.. లేక ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల్లో కూడా ఈ స్కీమ్ అమలు చేయాలా అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Venu Swamy prediction: జైలుకు వెళ్తే చాలు.. సీఎం అవుతారట.. మీరూ ట్రై చేస్తున్నారా!
ఏదిఏమైనా సంక్రాంతికి ఫ్రీ బస్ స్కీమ్ గురించి ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ఫ్రీ బస్ గురించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు సాగిస్తుండగా, జమ్మలమడుగు ఎమ్మేల్యే ఆదినారాయణ రెడ్డి నాలుగు నెలల్లో సూపర్ సిక్స్ అమలు ఖాయామంటూ తేల్చి చెప్పారు. అంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఇప్పటికే ఫ్రీ బస్ స్కీమ్ అమలుపై దృష్టి సారించారని చెప్పవచ్చు. మహిళలూ.. మీ ఫ్రీ బస్ కల త్వరలోనే నెరవేరుతుందన్న మాట.