Visakhapatnam News: అయోధ్య రాముడిని ఇక విశాఖ బీచ్ రోడ్ లోనే దర్శించండని చెప్పి భక్తులను ఆకర్షించే ప్రకటనలు చేశారు. కానీ ఈ ప్రచారం వెనుక దాగినది మాత్రం నిజమైన భక్తి కాదు డబ్బుల దోపిడీ అంటూ కొందరు భక్తులు విమర్శిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే..
విశాఖలోని బీచ్‌రోడ్ లోని పార్క్ హోటల్ సమీపంలో అయోధ్య రామ మందిరం పేరుతో నమూనా ఏర్పాటు చేశారు కొందరు నిర్వాహకులు. మొదట ఈ సెటప్ చూసిన భక్తులు సంబరపడిపోయారు. రాముడిని ఈ స్థాయిలో ఇక్కడే చూడొచ్చని భావించారు. కానీ అది దేవాలయం కాదు ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా మారిందన్నది ఇప్పుడు భక్తుల వాదన.
అయితే ప్రత్యేక దర్శనం టికెట్‌కు రూ.50 వసూలు చేస్తున్నారు. చెప్పులు దాచడానికీ రూ.5 తీసుకుంటున్నారు. ఇంత వరకు ఓకే గానీ, ఆ తర్వాత జరిగిందే ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నిర్వాహకులు రామ కళ్యాణోత్సవం పేరుతో మరో అడుగు ముందుకేసి, ఒక్కో టికెట్‌కు రూ.2,999 వసూలు చేసినట్లు భక్తులు ఆరోపిస్తున్నార. పైగా, భద్రాచలం ఆలయం నుంచి పండితులు వచ్చి రామ కళ్యాణం నిర్వహిస్తారని ప్రచారం చేసి ప్రజల విశ్వాసాన్ని మోసం చేశారని ఫిర్యాదుల పరంపర సాగుతోంది.
Also Read: NTR district tragedy viral: ఏపీలో చనిపోయి బ్రతికిన యువతి? అసలేం జరిగిందంటే?
ఈ వ్యవహారంపై స్థానిక హిందూ సంఘాల నేతలు, స్వామీజీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలంలోని ఆస్థాన పండితులు ఏ ఒక్కరూ కూడా అక్కడికి రాలేదని తేలింది. అయినా వారి పేర్లను వాడుతూ ఈ కళ్యాణోత్సవ కార్యక్రమానికి డబ్బులు వసూలు చేయడం ఘోరమైన మోసం అని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై విశాఖ జిల్లా కలెక్టర్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బుల దోపిడీ జరుపుతున్న నిర్వాహకులపై విచారణ చేపట్టాలని, మోసం చేసిన నిర్వాహకులపై చీటింగ్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నారు.
ఈ నెల 23న ఉదయం 11 గంటలకు హిందూ సంఘాలు, స్వామీజీలు కలిసి ఈ నమూనా వద్దకు వెళ్లి పరిశీలించనున్నారు. నిర్వాహకులు సరైన సమాధానం ఇవ్వకపోతే, అక్కడే ధర్నా చేపడతామని తురగా శ్రీరామ్ అనే హిందూ సంఘాల నాయకుడు ప్రకటించారు. భక్తి పేరుతో డబ్బులు గుంజుకుంటే అది పాపమే. రాముడి పేరు చెప్పి అబద్ధాలు చెప్పడమేనంటే ఇంక ఎంత దారుణం? ప్రస్తుతం ఇది విశాఖలో హాట్ టాపిక్‌గా మారింది.
కొందరు నిర్వాహకుల కారణంగా నిజమైన భక్తులకు చెడ్డపేరు వస్తోందని విశాఖవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు, కలెక్టరేట్ అధికారులు ఎంత త్వరగా స్పందిస్తారో చూడాలి. ప్రజల విశ్వాసాన్ని నమ్మి డబ్బులు వసూలు చేయడం అనేది చట్టపరంగా ఎంతగానో శిక్షార్హమైన విషయమన్న విషయం ఈ కేసుతో మరోసారి వెలుగులోకి వచ్చింది.