TDP vs JANASENA: ఏపీలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు పొసగనుందా.. ఛోటా మోటా నాయకులతో రెండు పార్టీల అధిష్టానాలకు తలనొప్పి మొదలైందా.. అంటే అవుననే సమాధానం రాజకీయ విశ్లేషకుల నోట వినిపిస్తోంది. తాజాగా ఏలూరు జిల్లా దెందులూరు టిడిపి, జనసేన మధ్య భగ్గుమన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా ఇరుపార్టీల మధ్య వైరాన్ని పెంచాయని ప్రచారం సాగుతోంది. పింఛన్ పంపిణీ సంధర్భంగా జరిగిన ఘర్షణ అయినప్పటికీ.. సాక్షాత్తు జనసేన సర్పంచ్ కు టీడీపీ అడ్డు తగిలినట్లు తెలుస్తోంది.
ఏపీలో ఎన్నికల సమయంలో జత కలిసిన టీడీపీ, జనసేన పార్టీలు తమ మైత్రి బంధాన్ని అలాగే కొనసాగిస్తున్నాయి. చంద్రబాబు అంటే పవన్ కు గౌరవం, పవన్ అన్నా కూడా బాబు అదే గౌరవం ఇస్తారు. కానీ రోజులు గడిచేకొద్దీ క్షేత్రస్థాయిలో ఈ రెండు పార్టీల మధ్య వైరం మాత్రం బయటపడుతోంది. మొన్న పిఠాపురంలో సొసైటీ ఎన్నికల సంధర్భంగా ఇరు పార్టీ నాయకుల మధ్య విభేధాలతో.. అక్కడ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇలా ఉన్న దశలో అక్టోబర్ 1న పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంది. అయితే పింఛన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన నాయకులు సైతం పాల్గొన్నారు.
అలాగే ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని కొల్లేరు లంక పరిధిలో జనసేన సర్పంచ్ ముంగర తిమోతి పంపిణీ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వచ్చారు. అయితే గ్రామ సర్పంచ్ పింఛన్ పంచవద్దంటూ.. స్థానిక టీడీపీ నేతలు అడ్డు తగిలారు. వీరంతా స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు కావడం విశేషం. అయితే సర్పంచ్ పంపిణీ చేయాల్సిందే అంటూ పట్టుబట్టడంతో.. అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడి, రెండు పార్టీల నాయకుల మధ్య ఘర్షణ సాగింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని సద్దుమణిగించారు. తమ గ్రామంలో తాము చెప్పిందే జరగాలంటూ.. అక్కడి టీడీపీ నాయకులు పట్టుబట్టి వివాదానికి కారకులు కావడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. పొత్తులో ఉంటూనే జనసేన నాయకుడిపై దాడి జరగడంతో.. స్థానిక జిల్లా జనసేన సైతం అసలేం జరిగింది అనే విషయాలను ఆరా తీస్తున్నారట.
ఓ వైపు సీఎం చంద్రబాబు, మరో వైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు మైత్రి బంధాన్ని కొనసాగిస్తూ.. పరిపాలనపై దృష్టి సారిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వచ్చే లుకలుకలను పట్టించుకోకుంటే ప్రమాదం తప్పదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొన్న పిఠాపురం, నేడు దెందులూరు, రేపు ఎక్కడో అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ సాగుతోంది. ఇప్పటికైనా.. అధిష్టానాలు జోక్యం చేసుకొని నాయకుల, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయకుంటే.. మున్ముందు భాయ్.. భాయ్.. అనే బదులు బాయ్.. బాయ్ చెప్పుకొనే స్థితి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.