TTD : త్వరలోనే SVBC ఛైర్మన్, JEO, CVSO, BIRRD డైరెక్టర్‌లను నియమిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. అనుభవజ్ఞుల పేరుతో అవసరం లేకపోయినా పాతవారిని కొనసాగించ వద్దన్నారు. ప్రక్షాళన జరగాల్సిందేనని.. ఏ స్ధాయిలోనూ మినహాయింపులు లేవని తేల్చి చెప్పారు. టీటీడీ సేవలు, సౌకర్యాల్లో 100 శాతం మార్పు కనిపించాలని.. అభివృద్ది పనుల పేరుతో డబ్బులు ఇష్టారీతిన ఖర్చు పెట్టొద్దని సూచించారు. తిరుమలలో సేవలు బాగుంటే ప్రభుత్వానికీ మంచి పేరు వస్తుందన్నారు. వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలన్నారు. సచివాలయంలో తిరుమల తిరుపతి దేవస్ధానం – టీటీడీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
ఖర్చులు.. సౌకర్యాలు.. సేవలు..
వందల కోట్ల నిధులను అనేక కార్యక్రమలకు టీటీడీ ఖర్చు చేస్తోందని.. దీనిపై ఇంటర్నల్ ఆడిటింగ్‌తో పాటు.. కాగ్ ద్వారా ఆడిట్ జరిపితే మంచిదని సూచించారు. గడిచిన 9 నెలల్లో భక్తులకు అందించే సౌకర్యాలు మెరుగుపరిచేందుకు టీటీడీ తీసుకున్న చర్యలపై అధికారులు సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు. భవిష్యత్తులో చేపట్టే చర్యలపై సీఎం సమీక్షించారు. దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైనా సమావేశంలో చర్చించారు.
Also Read : లారీ, బస్సు మధ్యలో పాస్టర్ ప్రవీణ్.. సీసీఫుటేజ్
సరికొత్త ప్రాజెక్టులు.. ఆలయాల అభివృద్ధి పనులు
శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదంలో తీసుకువచ్చిన మార్పులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. గ్యాలరీల్లో సౌకర్యాల పెంపు, అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం, శ్రీ పద్మావతీ అమ్మవారి దేవాలయం అభివృద్ది ప్రణాళిక, అమరావతిలోని శ్రీవారి దేవాలయం అభివృద్ది పనులు వంటి అంశాలపై చర్చించారు. భక్తుల మనోభావాలకు, ఆలయ పవిత్రతకు పెద్దపీట వేసేలా ప్రతీ కార్యక్రమం, నిర్ణయం ఉండాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.
టీటీడీ నుంచి వాట్సాప్ సేవలు
టీటీడీ నుంచి 15 రకాల సేవలు వాట్సాప్‌లో అందిస్తామని అధికారులు చెప్పగా.. వెంటనే వాట్సాప్ సేవలు ప్రారంభం కావాలని సీఎం సూచించారు. ప్రతి సేవకు ఆధార్, సెల్ ఫోన్ నెంబర్‌ను లింక్ చేయడం ద్వారా ఎక్కడా అక్రమాలు జరగకుండా ఉండటానికి అవకాశం ఉంటుందని సీఎం చెప్పారు. పారిశుధ్య నిర్వహణపైనా దృష్టి పెట్టాలని చంద్రబాబు అన్నారు.
60 అనుంబంధ ఆలయాల అభివృద్దికి ప్రణాళిక
60 అనుబంధ దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్టు ముఖ్యమంత్రికి వివరించారు టీటీడీ అధికారులు. అమరావతి రాజధానిలోని వెంకటపాలెంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేయనున్నారు. చుట్టూ ప్రాకారం నిర్మాణంతో పాటు ఒక రాజగోపురం, మూడు గోపురాలు నిర్మించనున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలుస్తారు. అలాగే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని విస్తరణ పనులతో పాటు సుందరంగా తీర్చిదిద్దనున్నారు. కరీంనగర్, కొడంగల్, నవీ ముంబై, బాంద్రా, ఉలుందుర్పేట, కొయంబత్తూరులో చేపట్టిన శ్రీవారి ఆలయాల నిర్మాణం-అభివృద్ధి కార్యక్రమాలపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. సీఎం చంద్రబాబు చేసిన టీటీడీ సమీక్షలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, చీఫ్ విజిలెన్స్ అధికారి, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు, టీటీడీ అధికారులు హాజరయ్యారు.