Visakhapatnam Arrest: అమరావతి అంశంపై తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చలకు కేంద్రబిందువైన జర్నలిస్టు కృష్ణంరాజు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో అమరావతి వేశ్యల రాజధాని అనే అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన తుళ్ళూరు పోలీస్ స్టేషన్, ఇతర పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఫిర్యాదుల నేపథ్యంలో కృష్ణంరాజును అరెస్ట్ చేయాలని పోలీసులు కసరత్తు ప్రారంభించారు.
విశాఖపట్నం జిల్లాలోని తగరపువలస వద్ద గోస్తని నది సమీపంలో కృష్ణంరాజును తాజాగా ఒక స్పెషల్ టీం అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ అనంతరం అతడిని నేరుగా విజయవాడకు తరలించినట్లు సమాచారం. విశేషమేంటంటే, ఈ మొత్తం అరెస్టు ప్రక్రియను పోలీసులు చాలా గోప్యంగా నిర్వహించారు. సమాచారం లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
విజయవాడకు చేరుకున్న తర్వాత కృష్ణంరాజును అక్కడి పోలీసుల పరిరక్షణలో ఉంచినట్లు సమాచారం. రేపు అతడిని కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలను తక్కువచేసేలా మాట్లాడిన కృష్ణంరాజుపై మగధీరులు, మహిళా సంఘాలు తీవ్రంగా స్పందించాయి.
Also Read: Hyderabad Temples: హైదరాబాద్ లో ఉన్నారా? మనశ్శాంతి కరువైందా.. ఇక్కడికి వెళ్లండి!
ఇక అరెస్టు నేపథ్యంలో కృష్ణంరాజు మద్దతుదారులు, పాత్రికేయ వర్గాలు ఆయనపట్ల పోలీసుల వైఖరిపై స్పందించే అవకాశం ఉంది. మరోవైపు కేసు విచారణలో పోలీసుల ఆలోచనల దిశ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ అరెస్టు తరువాత ఆ ఛానెల్ చర్చల ఫార్మాట్, వ్యాఖ్యాతల సమచార నైతికతపై కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి మహిళా సంఘాలు. ఓ జర్నలిస్టుగా తన మాటలకు బాధ్యత ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లోనూ చర్చకు తావిస్తోంది. ఇక అధికార పార్టీ నుంచి లేదా ప్రతిపక్షాల నుంచి ఎలాంటి అధికారిక ప్రతిస్పందన వస్తుందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. కాగా ఇప్పటికే ఇదే కేసులో కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఏ1 గా గల కృష్ణంరాజు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం అందుతుండగా, నెక్స్ట్ అరెస్ట్ ఎవరన్నది ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది.