AP New Ration Cards: ఆ ఒక్క కార్డు మన జీవితాన్ని మార్చేస్తుంది. ఆ కార్డు లేనిదే నెలవారీ రేషన్ అందదు.. ప్రభుత్వ పథకాలతో లబ్ది కుదరదు. ఇప్పటికే ఎందరో అర్హత ఉండి, ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురు చూపుల్లో ఉన్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అతి త్వరలో నూతన కార్డులను అందించేందుకు సిద్దమైంది. ఇంతలా ప్రాధాన్యత సంతరించుకున్న ఆ కార్డు ఏదో ఇప్పటికే అర్థమైందిగా.. అదే రేషన్ కార్డు.
సామాన్య కుటుంబాలకు రేషన్ కార్డు ఓ వరం. ఈ కార్డుతోనే నెలవారి రేషన్ సరుకులను పొందే అవకాశం ఉంటుంది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాల లబ్ది పొందాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి. సామాన్య కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉచితంగా ఉన్నత విద్యను పొందే అవకాశం కూడా రేషన్ కార్డుతోనే దక్కుతుంది. అందుకే కాబోలు ప్రతి కుటుంబం రేషన్ కార్డు కలిగి ఉండాలని భావిస్తుంది. ఇప్పటికే ఎందరో అర్హత ఉండి, కార్డు ద్వారా లబ్ది పొందని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కుటుంబాలకు ఆసరాగా నిలవాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీపం 2.0 పథకాన్ని ప్రవేశపెట్టింది. త్వరలో జరగబోయే ఏపీ బడ్జెట్ సమావేశాలలో సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు ప్రత్యేక నిధులను కేటాయించనున్నట్లు సమాచారం. అందుకే అర్హత గల ప్రతి లబ్దిదారునికి పథకాల ద్వారా లబ్ది చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. పథకాలతో లబ్ది పొందాలంటే రేషన్ కార్డు అవసరం. ఈ కార్డు లేని పక్షంలో అర్హత ఉండి కూడా ఏ పథకం వర్తించదు. అందుకే కాబోలు ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను అందించేందుకు సిద్దమైంది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన ఇచ్చారు.
మార్చి నెలలో కొత్త రేషన్ కార్డులను జారీ చేయడం జరుగుతుందని మనోహర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో డిజిటల్ విధానం ద్వారా క్యూ ఆర్ కోడ్ తో కూడిన కార్డులను అందించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అంతేకాకుండా రేషన్ కార్డు ఉండి, కార్డులో తప్పొప్పుల సవరణ, సభ్యుల చేరిక వంటి వాటికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించనుందని సమాచారం. అర్హత ఒక్కటే ప్రామాణికంగా నూతన రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు, సూపర్ సిక్స్ పథకాలకు ముందుగా కార్డులను అందించేలా ప్రభుత్వం సిద్దమవుతోంది.
Also Read: జగన్.. అదే ఫిక్స్ అయిపో.. పవన్ వార్నింగ్
ఇప్పటికే రేషన్ కార్డుల జారీ ప్రకటన ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూపుల్లో ఉన్న ప్రజలకు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అలాగే డిజిటల్ విధానంలో కార్డుల జారీ చేయడం ద్వారా, ఎక్కడైనా రేషన్ ను పొందే అవకాశంను ప్రభుత్వం కల్పించనుంది. మొత్తం మీద రేషన్ కార్డుల జారీకి సంబంధించి అధికారులు తగిన ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా నూతన కార్డుల జారీ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మరి మార్చి నెల రానే వస్తోంది. ఆలస్యం చేయకుండా ప్రభుత్వ అధికారిక ప్రకటన తర్వాత, వెంటనే దరఖాస్తు చేసేయండి!