Skoda Electric Cars India: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్కోడా కూడా తన EV వ్యూహాన్ని వేగవంతం చేస్తోంది. వచ్చే ఏడాది తన గ్లోబల్ లైనప్‌లోని కొన్ని ఎలక్ట్రిక్ కార్లను భారత్‌కు తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో ఎపిక్, పీక్, ఎల్రోక్ మోడళ్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే, భారత్ లో ఏ మోడళ్లను విడుదల చేస్తారనే విషయాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి త్వరగా అడుగుపెట్టేందుకు స్కోడా మొదట ఇంపోర్టెడ్ మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. స్కోడా ఇండియా డైరెక్టర్ ఆశిష్ గుప్తా కూడా వచ్చే ఏడాది లో కొన్ని గ్లోబల్ EVలను భారత్‌కు తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. స్కోడా అంతర్జాతీయ మార్కెట్లలో తన EV లైనప్‌ను వేగంగా విస్తరిస్తోంది. అందులో ఎల్రోక్ ఇప్పటికే యూరప్‌లో కీలక మోడల్‌గా ఉంది. భారత్ కోసం పరిశీలిస్తున్న కార్లలో ఇది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎపిక్ చిన్న ఎలక్ట్రిక్ SUVగా రానుండగా, పీక్ స్కోడా EV ఫ్యామిలీలో మరింత ప్రీమియం స్థాయిలో ఉండే SUVగా నిలువనుంది. ఈ మూడు మోడళ్లలో ఏది భారత్‌కు వస్తుందనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. అదే సమయంలో ధర, బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, ఇండియా స్పెసిఫిక్ ఫీచర్లు, లాంచ్ డేట్ లాంటి వివరాలను స్కోడా వెల్లడించాల్సి ఉంది.
ఈ కార్లను మొదట్లో ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉండటంతో వాటి ధరలు ఎక్కువగా ఉండనున్నాయి. ప్రస్తుత దిగుమతి సుంకాలు, పన్నుల కారణంగా పూర్తిగా విదేశాల్లో తయారైన EVలకు భారత్ లో ధర ఎక్కువగా ఉంటుంది. అందుకే స్కోడా మొదటి దశలో భారీ అమ్మకాల కంటే తన EV టెక్నాలజీని మార్కెట్లో చూపించడం, బ్రాండ్‌కు ఎలక్ట్రిక్ గుర్తింపును తీసుకురావడంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. దిగుమతి చేసిన EVలతో ప్రారంభించినప్పటికీ, భారత్‌లో స్థానికంగా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలని స్కోడా ఆలోచిస్తోంది.
స్థానిక ఉత్పత్తి వల్ల తయారీ ఖర్చులు తగ్గడంతో పాటు, కార్ల ధరలను మరింత తక్కువగా నిర్ణయించే అవకాశం ఉంటుంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారుల ఆసక్తి గత కొంతకాలంగా పెరుగుతోంది. ఇంధన ధరలు, పెరుగుతున్నపొల్యూషన్ నిబంధనలు కూడా EVల వైపు కంపెనీలను నడిపిస్తున్నాయి. స్కోడా కూడా భవిష్యత్ ఉద్గార ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ దిశగా అడుగులు వేస్తోంది. గతంలో హైబ్రిడ్ కార్లకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భావించినప్పటికీ, EVలకు పెరుగుతున్న డిమాండ్ తో కంపెనీ ఆలోచనలో మార్పు కనిపిస్తోంది.
స్కోడా హైబ్రిడ్ టెక్నాలజీని కూడా పూర్తిగా పక్కన పెట్టలేదు. భారత్ లో హైబ్రిడ్ కార్లకు ఉన్న అవకాశాలను కంపెనీ పరిశీలిస్తోంది. అయితే, స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్ల వృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోవడం, EVలపై పెరుగుతున్న ఆసక్తి కారణంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: నీళ్లు లేకుండా కారు వాష్.. ఈ ఐడియా ఏదో భలే ఉందే!