E-Paper
Advertisement

గులాబీ నేతలకు ఏమైంది?.. పట్నం వదలట్లేరు, పల్లెకు రావట్లేరు!

గులాబీ నేతలకు ఏమైంది?.. పట్నం వదలట్లేరు, పల్లెకు రావట్లేరు!
Advertisement

BRS Leaders: స్వేచ్ఛ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి బీఆర్‌ఎస్ ఇంకా తేరుకోలేకపోతోంది. ఓటమి ఎదురై రెండున్నరేళ్లు గడుస్తున్నా… గులాబీ ప్రజాప్రతినిధులు, మాజీ శాసనసభ్యుల్లో ఆశించిన స్థాయిలో మార్పు రావడం లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి మెజారిటీ నాయకులు సొంత నియోజకవర్గాలను వదిలి రాజధాని హైదరాబాద్‌లోనే మకాం వేశారు. నేతలు పట్నం వీడకపోవడంతో క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. నాయకుల గైర్హాజరీతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య వస్తే ఎవరికి విన్నవించుకోవాలో అర్ధంకాక సతమతమవుతున్నారు.

వెలవెలబోతున్న క్యాంపు కార్యాలయాలు..

Advertisement

అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో నిత్యం ప్రజలు, కార్యకర్తల రాకపోకలతో, అధికారిక సమీక్షలతో సందడిగా ఉండే మాజీ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, నివాసాలు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. నాయకులెవరూ స్థానికంగా ఉండకపోవడంతో నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలు దాదాపు స్తంభించిపోయాయి. పండుగలు, ఇతర ప్రధాన కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే చుట్టపుచూపుగా వచ్చి, కొద్ది గంటల్లోనే తిరిగి హైదరాబాద్‌ బాట పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో ఒకరిద్దరు అదీనూ గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రమే నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మిగతావారు మాజీ ఎమ్మెల్యేలు, మాజీఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, చివరకు కార్పొరేషన్ మాజీ చైర్మన్లు సైతం హైదరాబాద్ కే పరిమితం అయ్యారని పార్టీకేడరే ఆరోపిస్తుంది.

అండగా నిలిచేవారేరీ?

Advertisement

స్థానికంగా కాంగ్రెస్, బీజేపీల నుంచి రాజకీయ ఒత్తిళ్లు పెరగడం, అనేక ప్రాంతాల్లో కార్యకర్తలపై కేసులు నమోదు కావడం వంటి పరిణామాలు గులాబీ కేడర్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పార్టీ కోసం రక్తం ధారపోశాం..ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో, తమకు అండగా ఎవరు నిలుస్తారో అర్థంకాక కార్యకర్తలు సతమతమవుతున్నారు. “నాయకులను కలవాలంటే హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. అక్కడ కూడా ముందస్తు సమయం దొరకడం లేదు. స్థానికంగా ధైర్యం చెప్పే పెద్ద దిక్కు లేక ఒంటరిపోరాటం చేయాల్సి వస్తోంది” అని పలువురు ద్వితీయ శ్రేణి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ కలిసినా పూర్తిస్థాయిలో భరోసా లభించడం లేదని, కేవలం నామ్ కే వాస్తేగా అన్నట్లు స్పందిస్తున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అధిష్టానం పిలుపులకే పరిమితం!

నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడాలని, కేడర్‌కు అందుబాటులో ఉండాలని పార్టీ అధిష్టానం పలుమార్లు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ ఆచరణలో మాత్రంమార్పు కనిపించడం లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చే పిలుపు మేరకు నిర్వహించే నిరసన కార్యక్రమాలు, ధర్నాల రోజు మాత్రమే మీడియా ముందు మెరిసి,ఫోటోలకు ఫోజులిచ్చి ఆ తర్వాత మళ్లీ పట్నం బాట పడుతున్నారని పార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. కనీసం నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ ఆఫీసులను తెరిచే పరిస్థితి కూడా కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నిత్యం అందుబాటులో ఉండాలని, ప్రజల్లో ఉన్న నాయకులకే పార్టీ పదవులు అని అధిష్టానం స్పష్టంగా పేర్కొనప్పటికీ నేతలు మాత్రం ఖాతర్ చేయడం లేదనేది ప్రస్తుత తీరు చూస్తేనే అర్ధమవుతోంది.

Also Read: సైబరాబాద్‌లో ట్రాఫిక్ తగ్గించేందుకు అధికారుల బిగ్ ప్లాన్!

ఖర్చుకు వెనుకంజ?

నియోజక వర్గంలో ఒకరోజూ పర్యటించాలంటే సుమారు లక్ష నుంచి2 లక్షలవరకు ఖర్చు అవుతుందని సమాచారం. పార్టీ అధికారంలో లేకపోవడంతో ఆ ఖర్చును భరించడం సాధ్యం కాదనే నేతలు నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతుంది. అధికారంలో లేనప్పుడే ప్రజలకు అందుబాటులో ఉండి కష్టసుఖాల్లో భాగస్వాములు కావల్సిన అవసరం ఉంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజాక్షేత్రంలో లేకపోవడంతో పార్టీకి ప్రజలు , కేడర్ దగ్గర కావడం లేదని పార్టీలోని ఓ కీలక నేత అభిప్రాయపడ్డారు.

భవిష్యత్తుపై ఆందోళన

నాయకులు అందుబాటులో లేకపోవడం, స్థానికంగా పార్టీ ఆఫీసులు కూడా తెరుచుకోకపోవడంతో క్షేత్రస్థాయి కార్యకర్తలలో నిరాశ నిండిపోతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని అధికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీలు కూడా ద్వితీయ శ్రేణి నేతలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న కొద్ది ఈ రెండు జాతీయ పార్టీలు స్పీడ్ పెంచబోతున్నట్లు విశ్వాసనీయ సమాచారం. కేడర్‌ను కాపాడుకోకపోతే గులాబీకి తీవ్ర నష్టం జరుగుతుందని, అధిష్టానం తక్షణమే జోక్యం చేసుకుని నేతలు నియోజకవర్గాల్లోనే ఉండేలా కఠిన మార్గదర్శకాలు జారీ చేయాలని పార్టీ వర్గాలు కోరుతున్నాయి.

పునర్వైభవంపై ప్రశ్నార్థకం?

ప్రజాప్రతినిధులు ప్రజలకు, స్థానిక శ్రేణులకు దూరంగా ఉండటం పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రెండుసార్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నేతలు యాక్టీవ్ గా ఉన్నారు. పార్టీ ఏ పిలుపు ఇచ్చిన విజయవంతం అయ్యేది. పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే మకాం వేసేవారు. ఇప్పుడు అధికారం లేకపోవడంతో అది రివర్స్ గా మరింది. పార్టీ నేతల తీరు మారకపోతే పార్టీకి గడ్డుకాలమే. అధిష్టానం తక్షణమే జోక్యం చేసుకుని, నేతలను నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండేలా ఆదేశాలు ఇవ్వాల్సి అవసరం ఉంది. ఆ దిశగా చర్యలు చేపడుతుందా? లేదా? అనేది చూడాలి.

Also Read: పోలీస్ శాఖలో ‘ఆ నలుగురు’ కథ క్లోజ్?.. డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు!

Tags

Related News

‘ఆమె’ కోసమే పాత నోటిఫికేషన్ రద్దు చేశారా..? తెలంగాణ వికలాంగుల శాఖలో సంచలనం!

హౌసింగ్ స్కీం అట్ట‌ర్ ఫ్లాప్‌.. డబుల్ బెడ్ రూం ఇండ్ల‌పై ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మేలు!

సైబరాబాద్‌లో ట్రాఫిక్ తగ్గించేందుకు అధికారుల బిగ్ ప్లాన్!

మార్పుల్లేవ్.. రాంచందర్‌తోనే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ?

హైదరాబాద్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇక ఫ్లైఓవర్ల కిందే పార్కింగ్!

మతం మారితే కులం మారుతుందా?.. దళిత క్రిస్టియన్లకు SC హోదా ఇవ్వాల్సిందే: R.S. ప్రవీణ్ కుమార్

సిటీ ఓటర్లకు బిగ్ షాక్! సగానికి పడిపోయిన వోటింగ్ కౌంట్.. కారణం ఇదే!

Big Stories

Advertisement
×