CM Chandrababu: శాంతిభద్రతలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలపై సీఎం సీరియస్ అయ్యారు. ఉన్నతాధికారులో సమీక్షలు నిర్వహించారు. వీటితో పాటు క్వాంటమ్ మిషన్, వ్యవసాయానికి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు జరిగాయి. అవేంటో చూద్దాం.
09-06-2025 ( సోమవారం ) ( కేంద్రమంత్రికి అభినందనలు )
పీ4 జీరో పావర్టీ కార్యక్రమం కింద 10 కుటుంబాలను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును సీఎం చంద్రబాబు అభినందించారు. మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా ఇదే విధంగా కుటుంబాలను దత్తత తీసుకుని.. జీరో పావర్టీ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
09-06-2025 ( సోమవారం ) క్వాంటమ్ మిషన్‌పై రివ్యూ
ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్‌పై రివ్యూ నిర్వహించారు సీఎం చంద్రబాబు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో ఏర్పాటు చేయబోతున్న క్వాంటమ్ వ్యాలీ ఒక ప్రత్యేక గుర్తింపు పొందాలన్నారు. క్వాంటమ్ మిషన్ పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. సీఎం నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. ఐటీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐటీ, ఆర్థికశాఖల కార్యదర్శులు, మిషన్ డైరెక్టర్, పలువురు నిపుణులు కమిటీలో ఉండనున్నారు. ఈ నెల 30న క్వాంటమ్ మిషన్‌పై వర్క్‌షాప్ నిర్వహించనున్నారు.
09-06-2025 ( సోమవారం ) ( విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్)
స్వర్ణాంధ్ర 2047 విజన్‌ను సాకారం చేసే పనిలో ఏపీ ప్రభుత్వం అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలోని 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రతి కార్యాలయ నిర్వహణకు రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
09-06-2025 ( సోమవారం ) ( విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్)
నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ యూనిట్‌కు ఎమ్మెల్యే అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ కార్యనిర్వహణ ఉపాధ్యక్షులుగా ఉంటారు. యూనిట్ కార్యాలయాల్లో ఎమ్మెల్యేతో బాటు జిల్లా నోడల్ ఆఫీసర్, అకడెమిషియన్, యువ ప్రొఫెషనల్, విజన్ స్టాఫ్ ఐదుగురు… ఇలా 9 మందితో ఒక బృందం పనిచేస్తుందన్నారు సీఎం.
09-06-2025 ( సోమవారం ) 10 ప్రధాన సూత్రాలతో విజన్ ప్లాన్
మొత్తం 10 సూత్రాలతో విజన్ ప్లాన్ ఉండనుంది. పేదరికం లేని సమాజం, ఉద్యోగ కల్పన, నైపుణ్యం-మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయ సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు-బ్రాండింగ్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్ ఇలా 10 ప్రధాన సూత్రాలతో విజన్ ప్లాన్ ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు.
09-06-2025 ( సోమవారం ) రహదారుల అభివృద్ధిపై సమీక్ష
రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. పీపీపీ విధానంలో చేపట్టే రహదారుల నిర్మాణం, రాష్ట్రంలో జాతీయ రహదారుల పురోగతి తదితర అంశాలపై చంద్రబాబు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నిర్ణీత కాలవ్యవధికి మించి ఆలస్యమైన ప్రాజెక్టుల కాంట్రాక్ట్ సంస్థలపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం. ఇకపై ఏ రహదారి నిర్మాణమూ ఆలస్యం కాకూడదని స్పష్టం చేశారు. భూసేకరణ, అటవీ, వన్యప్రాణి క్లియరెన్స్ సమస్యలు జూలై నెలాఖరుకు పరిష్కరించాలన్నారు. మరోవైపు NHAI, MORTH కింద 11 వేల 325 కోట్లతో 770 కి.మీ రహదారులు గత ఆర్థిక సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులు సీఎంకి తెలిపారు.
11-06-2025 ( బుధవారం) సీఎం సీరియస్
పొదిలి ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు పరామర్శ పేరుతో ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. అయితే ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడంపై సీఎం సీరియస్ అయ్యారు. రైతుల పేరుతో పర్యటనకు వెళ్లి ఈ అరాచకాలు ఏంటి? మహిళలపై, పోలీసులపై రాళ్లు వేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడిన వాళ్లపై ఆధారాలు సేకరించి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాని ఆదేశించారు. పొగాకు రైతులకు పరామర్శ పేరుతో జగన్ చేసిన రాజకీయ యాత్రలో వైఎస్సార్సీపీ శ్రేణులు దాడులకు దిగాడంపై మండిపడ్డారు. పర్యటనలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా పోలీసులు అనుమతులు ఇస్తుంటే ఇష్టారాజ్యం గా ప్రవర్తిస్తున్నారన్నారు సీఎం.
11-06-2025 ( బుధవారం) విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ
విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖకు సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల నుంచి దేశంలోని వివిధ నగరాలకు, అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ విషయంలోనూ శ్రద్ధ పెట్టాలని కోరారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాల పనుల పురోగతిపై వెలగపూడి సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. దీనికి కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు.
11-06-2025 ( బుధవారం) సీఎం దిశానిర్దేశం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవన నిర్మాణం డిజైన్లు అత్యంత ఆకర్షణీయంగా, విభిన్నంగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. రివ్యూ మీటింగ్‌లో ఈ అంశాలపై ఎయిర్ పోర్టు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం, జాతీయ రహదారిని అనుసంధానించేలా ర్యాంప్ నిర్మాణంతో పాటు ఇతర అంశాలపై సీఎం కీలక సూచనలు ఇచ్చారు. టెర్మినల్ భవనం ఎలివేషన్, డిపార్చర్, అరైవల్ బ్లాక్ లు, ప్రయాణికుల లాంజ్‌లు ఇలా వేర్వేరు ప్రాంతాల్లో ఏపీ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా డిజైన్లు ఉండాలన్నారు సీఎం.
11-06-2025 ( బుధవారం) కీలక జీవో విడుదల
సూపర్ సిక్స్ హామీలలో భాగంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నారు. తల్లికి వందనం పథకానికి నిధులు విడుదల చేస్తూ జీవో విడుదల చేసింది. 67,27,164 మంది విద్యార్థులకు పథకం వర్తించేలా జీవో ఎంఎస్ నెంబర్ 27ను రిలీజ్ చేశారు.
12-06-2025 ( గురువారం) కూటమి పాలనకు ఏడాది
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుందన్నారు సీఎం చంద్రబాబు. ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చామని.. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఆయన. తొలి అడుగు ప్రజల్లో భరోసాను కలిగించిందని.. మలి అడుగు కూడా విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు.
12-06-2025 ( గురువారం) తల్లికి వందనానికి శ్రీకారం
కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని అమల్లోకి తీసుకొచ్చింది. సూపర్‌సిక్స్ హామీల్లో ఒకటైన తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం కింద చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం అందుతుంది. 67 లక్షల 27 వేల 164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద, తల్లుల ఖాతాల్లో 8 వేల 745 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం అందనుంది.
12-06-2025 ( గురువారం) తల్లికి వందనానికి శ్రీకారం
ఒకే బిడ్డ ఉన్న తల్లులు 18 లక్షల 55 వేల 760 మంది.. ఇద్దరు బిడ్డలు ఉన్న తల్లులు 14 లక్షల 55 వేల 322 మంది.. ముగ్గురు పిల్లలు ఉన్న తల్లులు 2 లక్షల 10 వేల 684 మంది.. నలుగురు పిల్లలు ఉన్న తల్లులు 20 వేల 53 మంది తల్లులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు అధఙకారులు తెలిపారు.
12-06-2025 ( గురువారం) అన్నదాత సుఖీభవ
అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ఏపీ ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. రైతులకు ఏడాదిలో కేంద్రం ఇచ్చే ఆరు వేలతో కలిపి మూడు విడతల్లో మొత్తం 20 వేలు ఖాతాల్లో వేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకం కూడా ఈనెల 20న అమలు చేస్తామన్నారు.
13-06-2025 (శుక్రవారం) CRDA సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థపై సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1,450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు 1,052 కోట్లతో టెండర్లు పిలవడానికి ఆమోదించింది. సీడ్ యాక్సెస్ రోడ్‌ను నేషనల్ హైవేకు కలిపేందుకు 682 కోట్లతో టెండరు పిలవాలని నిర్ణయించారు. ప్రపంచంలోనే టాప్-5 సిటీల్లో అమరావతి కూడా ఒకటి కావాలన్నదే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు చంద్రబాబు. గ్రీన్ అండ్ బ్లూ సిటీ నిర్మాణంపై నిపుణులతో మాట్లాడామని మంత్రి నారాయణ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అమరావతిలోని 217 కిలోమీటర్ల పరిధిలో గ్రీన్ అండ్ బ్లూ సిటీలో 30 శాతం గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
13-06-2025 (శుక్రవారం) రాజధాని నిర్మాణంపై కీలక నిర్ణయాలు
శాసనసభ, హైకోర్టు భవనాలు, సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాలు, మంత్రులు, న్యాయమూర్తుల నివాసాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉద్యోగుల నివాస భవనాల నిర్మాణాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇప్పటికే ఈ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అక్కడ రహదారులు, డ్రెయిన్లు, నీటి సరఫరా, విద్యుత్, ఐటీసీ కనెక్షన్లు వంటి ప్రధాన మౌలిక వసతుల కల్పన కోసం టెండర్లు పిలవనున్నారు.
14-06-2025 ( శనివారం) జీరో కరప్షన్
అవినీతిపై యుద్ధాన్ని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఏ శాఖనైనా, ఏ స్థాయి అధికారి అయినా చట్టానికి లోబడి ఉండాల్సిందేననన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అవినీతి జరుగుతుందనే సమాచారం ఉన్న చోట దృష్టి పెట్టి విచారణ జరపాలని, అవినీతికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐవీఆర్ఎస్ ప్రజాభిప్రాయ సేకరణపై సమీక్ష నిర్వహించిన సందర్భంలో ఈ ఆదేశౄలు జారీ చేశారు చంద్రబాబు.
14-06-2025 ( శనివారం) ఏడాది పాలనపై రివ్యూ
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై రివ్యూ నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల సంతృప్తి స్థాయిలను పరిశీలించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ముఖ్యంగా సంక్షేమం, ఉద్యోగాల కల్పన, రహదారులు వంటి 10 ముఖ్యమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
14-06-2025 ( శనివారం) 10 అంశాలపై ప్రత్యేక ఫోకస్
ఉద్యోగాల కల్పన, దివ్యాంగులు, వృద్ధులపై ప్రత్యేక దృష్టి, ఉచిత ఇసుక విధానం, ప్రజల అభిప్రాయాలు సేకరించడం, ఆసుపత్రుల్లో అందుతున్న సేవలు, మున్సిపల్, ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. రేషన్ సరుకులు ఎలా అందుతున్నాయి.. ఎరువుల లభ్యమవుతున్నాయా? డ్రగ్స్ సమస్యలు, మహిళలపై హింస, రిజిస్ట్రేషన్, ఎలక్ట్రిసిటీ సేవలు ఎలా అందుతున్నాయనే విషయాలపై రివ్యూ నిర్వహించారు చంద్రబాబు.
15-06-2025 ( ఆదివారం) కేంద్రమంత్రితో భేటీ
కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రితో లంచ్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధి, కేంద్ర సహకారంపై ప్రధానంగా చర్చించారు. రైతులు ఎదుర్కొంటున్న మార్కెట్ సమస్యలు, ఎగుమతి సమస్యలు వంటి అంశాలపై పీయూష్ గోయల్ ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
Story By vamsi krishna, Bigtv Live