Ministers Pressure: స్వేచ్ఛ బ్యూరో: దక్షిణ తెలంగాణలోని ముగ్గురు మంత్రులు ఉండే ఓ కీలక జిల్లాలో ఆఫీసర్లు సతమతమవుతున్నారే ప్రచారం ఊపందుకున్నది. ఆ త్రీ మినిస్టర్ల ప్రెజర్ ను కొందరు అధికారులు తట్టుకోలేకపోతున్నారు. ప్రోటోకాల్ నుంచి పరిపాలన అంశాల వరకు అవస్థలు పడుతున్నారు. పైగా ఈ ముగ్గురి మినిస్టర్ల మధ్య నెలకొన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ తో తాము తలలు పట్టుకోవాల్సి వస్తుందని ఓ శాఖకు చెందిన అధికారి తెలిపారు.
ముగ్గురు మినిస్టర్ల ఒత్తిళ్లను తట్టుకోలేకే..
కొందరైతే ఏకంగా ఈ ముగ్గురు మినిస్టర్ల ఒత్తిళ్లను తట్టుకోలేక డిప్యూటేషన్లు, ట్రాన్స్ ఫర్లకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాఫిక్ గా మారింది. అన్ని శాఖల అధికారులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఆ ముగ్గురు మంత్రులు ఉమ్మడి జిల్లాకు చెందినవారే కావడంతో అధికారులకు రెస్ట్ లభించని పరిస్థితి నెలకొన్నదట. పైగా ప్రొటోకాల్‌తో పాటు, అభివృద్ధి కార్యక్రమాలు, రివ్యూ మీటింగ్‌ల విషయంలో ఈ ముగ్గురి శైలి వేర్వేరుగా ఉండటంతో చిక్కులు ఏర్పడుతున్నాయని ఆఫీసర్లు చెప్తున్నారు. ఒకే రోజు, వరుస రోజుల్లో ముగ్గురు మంత్రులు వేర్వేరు ప్రాధాన్యతలతో రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేస్తుండటంతో, ఏ రికార్డులు పట్టుకెళ్లాలో తెలియక జిల్లా స్థాయి అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తుందని టాక్.
ప్రాజెక్టుల అమలుపై ప్రభావం..
పైగా ముగ్గురు ముఖ్య నేతల మధ్య అంతర్గతంగా సరిగ్గా సమన్వయం లేకపోవడం వల్ల ఆ ప్రభావం నేరుగా ప్రొటోకాల్, ప్రాజెక్టుల అమలుపై పడుతోందనే చర్చ ఆ జిల్లాలో విస్తృతంగా జరుగుతుంది. ఏ మంత్రి పర్యటనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో తెలియక ప్రోటోకాల్ విభాగం తీవ్ర గందరగోళానికి గురవుతోందట.అంతేగాక ఒకే అభివృద్ధి వర్క్, వివాదాలకు చెక్, సమస్యల పరిష్కరానికి సొల్యుషల్స్ వచ్చే సమయంలో ముగ్గురి నుంచి మూడు వేర్వేరు ఆదేశాలు వస్తుండటంతో, ఎవరి మాట వింటే ఎవరికి ఆగ్రహం వస్తుందోనని అధికారులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ టెన్షన్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్లలోనూ నెలకొన్నదని ఆ క్రింది స్థాయి అధికారులు ఆఫ్ ది రికార్డులో చెబుతున్నారు.
కీలక శాఖల్లో స్తంభించిన పాలన..
ప్రధానంగా ప్రజా సమస్యలతో నేరుగా ముడిపడి ఉన్న అగ్రికల్చర్, విద్య, వైద్యారోగ్య శాఖల ఉద్యోగులు ఈ పరిస్థితితో తీవ్రంగా సతమతమవుతున్నారు. వ్యవసాయ శాఖకు అదే జిల్లాకు చెందిన సీనియర్ నేత మంత్రి అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో మిగతా మంత్రుల పర్యటనలు, పనుల సమన్వయం అధికారులపై అదనపు భారాన్ని మోపుతోంది. ఇక వైద్య, విద్యా శాఖల అధికారులకు మంత్రుల నుంచి నిరంతరం వస్తున్న పిలుపులు, జవాబుదారీతనం పేరిట జరుగుతున్న తనిఖీలతో పనిభారం ఆకాశాన్ని తాకింది. ముగ్గురు అదే జిల్లాకు చెందిన నేతలు కావడంతో పర్యటనల్లో అన్ని సబ్జక్ట్ లపైనా రివ్యూలు పెడుతున్నారట.
ఒక్కో మంత్రి ఒక్కోలా..
దీంతో అంతకముందే ఒక మంత్రి ఓ అదేశం ఇస్తే, మరో మంత్రి మరోలా సూచనలు చేయడంతో వర్క్ ప్రాసెస్ లో ఆఫీసర్లకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పైకి చెబితే ఎలా రియాక్ట్ అవుతారోనని అధికారులు కూడా చెప్పలేని సిచ్వేషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. వర్క్ ప్రెజర్ తట్టుకోలేక, రాజకీయ ఒత్తిళ్ల మధ్య నలగలేక జిల్లాలోని పలు కీలక శాఖల ఆఫీసర్లు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. డిపార్ట్‌మెంటల్ బదిలీల కోసం ప్రభుత్వ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బదిలీలు సాధ్యం కాకపోతే, పొరుగు జిల్లాలకో లేదా హైదరాబాద్‌లోని హెచ్‌ఓడీ ఆఫీసులకో డిప్యూటేషన్‌పై వెళ్లేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు అధికారులు అనారోగ్య కారణాలు చూపుతూ సుదీర్ఘమైన సెలవులపై వెళ్లేందుకు కూడా సిద్ధపడుతుండటం గమనార్హం.
ప్రభుత్వంలో ముగ్గురూ పవర్ పుల్.. అనుచరుల హాడావిడి..
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ముగ్గురు మంత్రులూ పవర్ పుల్ గానే ఉన్నారు. సీఎంకు అతి దగ్గర మంత్రులుగా గుర్తింపు నెలకొన్న నేపథ్యంలో అధికారులు కూడా నీళ్లు మింగాల్సి వస్తుంది. ముగ్గురు పవర్ ఫుల్ మంత్రుల హవా నడుస్తున్న ఆ ఉమ్మడి జిల్లాలో అధికారుల పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’లా తయారైంది. జిల్లాల సమర్థవంతమైన పాలన సాగాలంటే మంత్రుల మధ్య కమ్యూనికేషన్ సరికావడంతో పాటు అధికారులపై ఉన్న ఈ మానసిక ఒత్తిడి తగ్గేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అయితే వీరి ముగ్గురి మధ్య పనిచేసేందుకు ఆఫీసర్లు జంకుతున్నారు.ఇక ఆ ముగ్గురు మంత్రుల అనుచరుల హాడావిడి అంతా ఇంతా కాదు. మండల కార్యాలయం నుంచి సెక్రటేరియట్ వరకు అంతా తమ బాస్ చెప్పిందే వేదం అంటూ ఆఫీసర్లపై నేరుగానే ప్రెజర్ తెస్తున్నారట. అధికారులు ఆ దిశగా అడుగులు వేయకపోతే, మంత్రుల ఆగ్రహానికి , ఆవేశానికి బలి కావాల్సి వస్తుందని ఉద్యోగుల్లో చర్చ జరుగుతుంది. ఈ విచిత్ర పరిస్థితి మరేజిల్లాలోనూ లేదంటూ వైద్యారోగ్యశాఖకు చెందిన ఓ ఉద్యోగి తెలిపారు.
పార్టీ కార్యకర్తల్లోనూ చీలికలు..?
ముగ్గురు మంత్రులు కలిగిన ఈ జిల్లాల్లో అడ్మినిస్ట్రేషన్ సమస్యలతో పాటు క్షేత్రస్థాయి కార్యకర్తల మధ్య చీలికలూ ఏర్పడ్డాయి. ముగ్గురు మంత్రులకు వేర్వేరు ఫాలోవర్స్, టీమ్స్, ఉన్నాయి. దీంతో మంత్రుల పర్యటనలు, మీటింగ్ ల సమయంలో తమ బాస్ టాప్ లో ఉండాలని పోటాపోటీగా ఆ జిల్లాల్లో ప్లెక్సీలు, హోర్డింగ్ లు, స్వాగతం పలకడం వంటివి నిర్వహిస్తున్నారు. ఒక మంత్రి విజిట్ సమయంలో మరో టీమ్ వెళ్లడం లేదట. ఇది చూసి అధికారులు కూడా అవాక్కాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక పదవులు, పోస్టింగ్ ల విషయంలోనూ ముగ్గురు మంత్రులకు ఉన్న వేర్వేరు కేడర్లను సర్దుబాటు చేయడం పార్టీకీ సవాల్ గా మారింది. ఇలాంటి సందర్భాల్లో ఆయా కేడర్ల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి.
Also Read: తెలంగాణ స్త్రీనిధిలో ఆంధ్ర పెత్తనం? హెచ్‌ఆర్ అర్హతే లేదు.. కానీ అడ్మిన్ సీటు ఆమెదే!