Fish Seed: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం, జలవనరుల్లో చేపల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో చేపట్టిన చేపపిల్లల పంపిణీ కార్యక్రమం ఈ ఏడాది ప్రారంభంలోనే టెండర్ల ప్రక్రియ వద్ద అడ్డంకులను ఎదుర్కొంటోంది. కాంట్రాక్టర్ల కుమ్మక్కు రాజకీయం, మరోవైపు బకాయిల విడుదల చేయకపోవడంతో ఎవరు ముందుకు రావడం లేదు. రాష్ట్రంలోని మొత్తం 32 జిల్లాలకు మత్స్యశాఖ టెండర్లు పిలిస్తే, కాంట్రాక్టర్ల నుంచి ఆశించిన స్పందన లభించలేదు. కేవలం సగం జిల్లాలకే పరిమితమైన ఈ స్పందనపై ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది.దీంతో అసలు ఈసారి చెరువుల్లో చేపపిల్లల పంపిణీ నిర్ణీత సమయానికి జరుగుతుందా లేదా అన్న ఆందోళన మత్స్యకారుల్లో మొదలైంది. పంపిణీ ప్రక్రియ టెండర్ల దశలోనే ఉండటంతో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది.
32 జిల్లాల్లో 17 జిల్లాల్లో మాత్రమే..
తెలంగాణలోని 32 జిల్లాల్లో ఉచిత చేప పిల్లల పంపిణీకి మత్స్యశాఖ టెండర్లు పిలిచింది. గడువు సైతం ముగిసింది. కానీ కేవలం 17 జిల్లాల్లో మాత్రమే కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. క్క నల్లగొండ జిల్లాలోనే కేవలం రెండు టెండర్లు రాగా, మిగిలిన 16 జిల్లాల్లోనూ కాంట్రాక్టర్ల కుమ్మక్కు (సిండికేట్) జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు, ఏకంగా 15 జిల్లాల్లో టెండర్లు వేసేందుకు అసలు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో మత్స్యశాఖ టెండర్ల గడువును మరో మూడు రోజులు పొడిగించింది. ఈ పరిణామాలన్నింటితో ఈసారైనా చేపపిల్లల పంపిణీ సకాలంలో జరుగుతుందా లేదా అనే దానిపై తీవ్ర సందిగ్ధత నెలకొంది.
సిండికేట్ ప్రభావమా? నిరాసక్తతా?
మత్స్యశాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ టెండర్ల ప్రక్రియలో కాంట్రాక్టర్ల వైఖరి పలు సందేహాలకు తావిస్తోంది.కేవలం కొన్ని జిల్లాల్లోనే నామమాత్రంగా టెండర్లు దాఖలు కావడం, నల్లగొండ జిల్లాలో కేవలం రెండే టెండర్లు రావడాన్ని పరిశీలిస్తే.. మిగిలిన జిల్లాల్లో కాంట్రాక్టర్లు అంతర్గతంగా కుమ్మక్కై ధరలను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు పోటీ లేకుండా ముందే మాట్లాడుకుని, ఒక్కో జిల్లాను ఒక్కో కాంట్రాక్టర్ పంచుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన పోటీ ధరలు దక్కకపోగా, నాణ్యత విషయంలో కాంట్రాక్టర్లు చెప్పిందే వేదంగా మారే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
15 జిల్లాల్లో నిరాసక్తత
మరో 15 జిల్లాల్లో అసలు ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాతో పాటు 14 జిల్లాల్లో ఒక్కరు కూడా టెండర్ వేయలేదు. గతంలో చేపపిల్లల సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి బకాయిలు సకాలంలో విడుదల కాకపోవడం, 120 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోవం, ప్రతి ఏటా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పాటు పెరిగిన రవాణా, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయించిన ధరలు గిట్టుబాటు కాకపోవడమే ఈ నిరాసక్తతకు ప్రధాన కారణమా? అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది.
పెరిగిన గడువు.. కొనసాగుతున్న సందిగ్ధత
టెండర్లకు స్పందన కరువైన నేపథ్యంలో, మత్స్యశాఖ అధికారులు అప్రమత్తమై గడువును మరో మూడు రోజులు పొడిగించారు. పొడిగించిన ఈ గడువైనా కాంట్రాక్టర్లను ముందుకు నడిపిస్తుందా? లేదా పరిస్థితి మొదటికే వస్తుందా? అనేదానిపై ఉద్యోగుల్లోనూ, ఇటు మత్స్యకారుల్లోనూ ఆసక్తికర చర్చజరుగుతుంది. ఈ జాప్యం కారణంగా సకాలంలో టెండర్ల ప్రక్రియ ముగిసి, చేపపిల్లల కొనుగోలు, సరఫరా సజావుగా సాగుతుందా లేక ప్రణాళిక అమలు ఆలస్యమై మత్స్యకారులకు నిరాశ మిగులుతుందా అనే దానిపై సర్వత్రా సందిగ్ధం కొనసాగుతోంది.
Also Read: సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ.. సీఎం రేవంత్ కీలక ప్రకటనలు!