BigTV English

Nalgonda DCC President: నల్గొండ డీసీసీ అధ్యక్షుడు ఎవరంటే?

Nalgonda DCC President: నల్గొండ డీసీసీ అధ్యక్షుడు ఎవరంటే?

Nalgonda DCC President: ఆ జిల్లా కాంగ్రెస్‌కు కంచుచోట. అందుకే ఆ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి తమకు అనుకూలమైన వారి చేతుల్లో ఉండాలనేది ఆ పార్టీ సీనియర్ నేతల ఆరాటం. అందుకే ఇప్పుడు ఆ పదవి కోసం నేతలు పోటీ పడుతున్నట్టు కనిపిస్తోంది. అనుచరుడు ఉంటేనే ఆధిపత్యం కొనసాగుతోందనే ఆశ కావొచ్చు. ప్రస్తుతం ఆ జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవి కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు రాజేస్తోందా..? కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఆ జిల్లా డీసీసీగా ఎవరు కాబోతున్నారు?


కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లా

కాంగ్రెస్ అంటేనే మొదట గుర్తుకు వచ్చేది ఉమ్మడి నల్లగొండ జిల్లా. రాష్ట్ర కాంగ్రెస్‌లో హేమాహేమీలుగా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి ఈ జిల్లాలోనే తమ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత రాష్ట్రంలోనే పెద్ద జిల్లాగా నల్లగొండ అవతరించింది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నేత జానారె రెడ్డి వంటి నేతలు ఉన్నారు. ఇప్పుడు కొత్త జిల్లా రాజకీయాల్లోనూ కీరోల్ వీరిదే. మరి అలాంటి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఎవరన్నది తేల్చాలంటే అంత సామాన్య విషయమైతే అస్సలు కాదు. అందుకే తమ అనుచరులకు ఆ పదవి దక్కించుకోవాలని కీలక నేతలంతా తమ మంతనాలు కొనసాగిస్తున్నారు.


రెండు, మూడేళ్లకోసారి డీసీసీ కార్యవర్గ మార్పు

సాధారణంగా రెండు మూడేళ్లకోసారి డీసీసీ కార్యవర్గం మార్పు చేయాల్సి ఉన్నప్పటికీ.. సామాజిక సమీకరణాలు కుదరక కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం నల్లగొండ ఎస్టీ, సూర్యాపేట బీసీ, యాదాద్రి భువనగిరి జిల్లా జనరల్‌ కోటాలో డీసీసీ అధ్యక్షులు కొనసాగుతున్నారు. మధ్యలో సూర్యాపేట జిల్లాలో మార్పులు చేయాలని భావించినప్పటికీ పార్టీలో అంతర్గత విభేదాల వల్ల దాని జోలికి పోలేదు. సూర్యాపేట డిసీసీ అధ్యక్షుడు వెంకన్నకు రైతు కమిషన్‌ సభ్యుడిగా అవకాశం ఇవ్వడం, తాజాగా నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో ఆశావహుల దృష్టి డీసీసీ అధ్యక్ష పదవులపై పడింది.

గుమ్మల మోహన్ రెడ్డి, కొండేటి మల్లయ్య

ప్రస్తుతం నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వ్యవహరిస్తున్నారు. సీనియర్ నేత జానారెడ్డి ప్రధాన అనుచరుడిగా పేరున్న శంకర్ నాయక్‌కు.. ఇటీవల ఎమ్మెల్సీ పదవి వరించింది. దీంతో శంకర్ నాయక్ స్థానంలో కొత్తగా డిసిసి అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. పార్టీలో కీలక నేతలున్న జిల్లా కావడంతో ఇక్కడ పార్టీకి సారథ్యం వహించే బాధ్యతలు దక్కించుకునేందుకు కీలక నేతలు ప్రయత్నిస్తున్నారు. పార్టీకి మొదటి నుంచి విధేయుడిగా ఉంటూ సేవలందిస్తున్న నాయకులకు పదవులిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. దీంతో కీలకమైన నల్లగొండ డీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకునే నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న కొండేటి మల్లయ్య

డీసీసీ పదవికి గుమ్ముల మోహన్ రెడ్డి, కొండేటి మల్లయ్య, రామలింగం గౌడ్, పున్నా కైలాష్ నేత వంటి నాయకులు పోటీ పడుతున్నారు. మంత్రి, మాజీ మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకునేందుకు ఆశావాహులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉన్న గుమ్ముల మోహన్ రెడ్డి బలమైన పోటీదారుగా నిలిచారు. NSUI, యూత్ కాంగ్రెస్ నుంచి పార్టీలో అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చిన మోహన్ రెడ్డికి జిల్లా వ్యాప్తంగా పార్టీ అగ్ర నేతలందరితో సాన్నిహిత్యం ఉంది. గుమ్ముల మోహన్ రెడ్డి కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్పొరేషన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఉమ్మడి జిల్లాకు ఎక్కువ కార్పొరేషన్ పదవులు వరించడంతోపాటు సామాజిక సమీకరణాలు మోహన్ రెడ్డికి అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో డిసిసి అధ్యక్ష పదవినైనా తన అనుచరుడు మోహన్ రెడ్డికి ఇప్పించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట.

నకిరేల్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ మల్లయ్య

జిల్లాకు చెందిన సీనియర్ నేత జానారెడ్డి అనుచరుడు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య డిసిసి అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. 20 ఏళ్లుగా పార్టీలో క్రియాశీలకంగా పని చేయడంతో పాటు గతంలో జడ్పీటీసీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో నకిరేకల్ నుండి కాంగ్రెస్ టికెట్ ఆశించారు కానీ జరగలేదు. దీంతో అధిష్టానం రానున్న రోజుల్లో సముచితమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చిందట. ఈ నేపథ్యంలో సీనియర్ నేత జానారెడ్డి ఆశీస్సులతో డిసిసి అధ్యక్ష పదవి కోసం మల్లయ్య తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. డీసీసీ అధ్యక్ష పదవిని ఎస్సీ వర్గానికి కేటాయిస్తే.. తనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. జిల్లాలో తన వర్గానికి చెందిన మల్లయ్యకు డిసిసి అధ్యక్ష పదవి ఇచ్చేందుకు సీనియర్ నేత జానారెడ్డి పావులు కదుపుతున్నారట.

విద్యార్థి నాయకుడిగా కైలాష్‌ నేత

మరోవైపు డీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలని కోరుతున్న బీసీ నేతలు ఆ పదవి దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న కైలాష్ నేత ఈ పదవిని బలంగా ఆశిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఓయూ జేఏసీ నేతగా, విద్యార్థి నాయకుడిగా కైలాష్‌ నేత క్రీయాశీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో కాంగ్రెస్‌లో చేరిన ఆయన వరస ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నించారు. పార్టీ ఇతర అవకాశాలు కల్పిస్తామని నచ్చజెప్పిందని, డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే పార్టీని సమర్థవంతంగా నడిపిస్తానని తన వాదనను అధిష్టానం ముందుంచారు. మిర్యాలగూడ నుంచి మరో సీనియర్ నేత రామలింగం గౌడ్ కూడా డిసిసి అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు.

అనుచరులకు పదవిని కట్టబెట్టందుకు తీవ్రంగా ప్రయత్నాలు

ఓవరాల్‌గా చూస్తే జిల్లా రాజకీయాల్లో తమ ఆధిపత్యం కోసం నేతలు అనుచరులకు డిసిసి అధ్యక్ష పదవిని కట్టబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. పోయినసారి సీనియర్ నేత జానారెడ్డి అనుచరుడు శంకర్ నాయక్ డిసిసిగా ఎంపిక కావడానికి సహకరించామని, కాబట్టి ఈసారి తన అనుచరుడు గుమ్ముల మోహన్ రెడ్డి కోసం మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేస్తున్నారని టాక్. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానా రెడ్డిలు తమ అనుచరులకు డిసిసి పదవి ఇప్పించుకునేందుకు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారట. అనుచరుల పదవుల కోసం నేతలు పోటీ పడుతున్నారట.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మైనార్టీ వర్గాలకు చెందిన

పార్టీ ముఖ్య నేతల సిఫారసులతో పాటు, పార్టీకి అందించిన సేవలను ఆశావాహులు గుర్తు చేస్తున్నారు. ప్రతీ జిల్లా నుంచి డీసీసీ అధ్యక్ష పదవికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మైనార్టీ వర్గాలకు చెందిన ఒక్కో పేరును పరిశీలిస్తున్న అధిష్టానం ఆ మేరకు ఆయా వర్గాల నాయకుల పేర్లపై ఆరా తీస్తోంది. ముఖ్య నేతల సిఫారసులను, ఇతర సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అధ్యక్ష పదవికి నేతను ఎంపిక చేయనున్నారు. కీలక నేతలు పోటీ పడుతుండడంతో ఈ పదవి ఎవరిని వరిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×