శనివారం, ఏప్రిల్ 12న భారతదేశంలోని పలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవలు నిలిచిపోయాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి ప్రముఖ డిజిటల్ చెల్లింపు యాప్‌ల ద్వారా లావాదేవీలు నిర్వహించడంలో వినియోగదారులు సమస్యలు ఎదుర్కొన్నారు.
డౌన్‌డిటెక్టర్ అందించిన సమాచారం ప్రకారం, మధ్యాహ్నం 12 గంటల సమయానికి యూపీఐ సేవలలో అంతరాయం గురించి సుమారు 1200 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ ఫిర్యాదులు.. ఎక్కువగా గూగుల్ పే (Google pay), పేటీఎం (Paytm) యాప్‌ల యూజర్లు చేశారు. మొత్తం ఫిర్యాదులలో గూగుల్ పే పనిచేయడం లేదని 96 మంది అసహనం వ్యక్తం చేయగా.. పేటిఎం నిలిచిపోయిందని 23 మంది ఫిర్యాదు చేశారు.
కేవలం వ్యక్తిగత వినియోగదారులే కాకుండా, షాపు యజమానులు, కస్టమర్లు కూడా ఫండ్ ట్రాన్స్‌ఫర్, ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్ర అసౌకర్యాన్ని వ్యక్తం చేశారు.
దేశంలో రోజురోజుకీ యుపిఐ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో తరుచూ యుపిఐ సేవలు నిలిచిపోతున్నాయి. ఇటీవలే మార్చి 26 2025న దేశవ్యాప్తంగా అన్ని యుపిఐ యాప్‌లు (UPI Apps) పనిచేయడం లేదని యూజర్లు గగ్గోలు పెట్టారు. దాదాపు 3 గంటల వరకు యుపిఐ సేవలు నిలచిపోయాయి. ఈ కారణంగా దేశంలోని ప్రధాన బ్యాంకులైన హెచ్ డిఎఫ్‌సి బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటాక్ మహింద్రా బ్యాంకు మొదలగు బ్యాంకులననీ భారీ ఆర్థిక లావాదేవీలు ఆలస్యమవడంతో వాటి కార్యకలాపాలకు విఘాతం కలిగింది.
Also Read: భారత్‌లో తగ్గనున్న సెల్ ఫోన్లు, ఇతర ఎలెక్ట్రానిక్స్ ధరలు.. కారణం అదే
ఇలా తరుచూ యుపిఐ సర్వీసులు ఎందుకు నిలిచిపోతున్నాయో ఇంతవరకూ దేశంలో యుపిఐ సేవల నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అధికారికంగా వివరణ ఇవ్వలేదు. సర్వర్ల పై ఓవర్ లోడ్, మెయిటెనెన్స్, సైబర్ సెక్యూరిటీ అప్ గ్రేడ్స్ వంటి టెక్నికల్ కారణాలు కావచ్చుననే అంచనాలతో జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది.
మరోవైపు యుపిఐ (UPI) సేవలు ఇతరదేశాల్లోనూ ఎన్‌పిసిఐ విస్తరించింది. తాజాగా ఏప్రిల్ 8 2025న దీని గురించి ఒక అప్డేట్ వచ్చింది. యుపిఐ యాప్‌ల లో ఉన్న క్యూఆర్ కోడ్ ఫీచర్లను అంతర్జాతీయ చెల్లింపుల కోసం తొలగించారు. చెల్లింపుదారుడు సరైన రిసీవర్ ను గుర్తించడానికే ఈ ఆప్షన్ తొలగించామని ఎన్‌పిసిఐ తెలిపింది. అయితే పేమెంట్ లిమిట్ లో కూడా మార్పు ఉంటుందని వస్తున్న ప్రచారం తప్పు అని వెల్లడించింది. అంతర్జాతీయ చెల్లింపులు లేదా దేశీయ పేమెంట్లకు ఉన్న లిమిట్ లో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది.