థాయ్‌లాండ్ (Thailand) రాజధాని బ్యాంగ్‌కాక్(Bangkok)లో దుండగుడు గన్‌తో రెచ్చిపోయాడు. విచక్షణరహితంగా జనాలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. దుండగుడు జనాలపై కాల్పులు జరుపుతున్న దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాల్పుల మోత విని అక్కడి జనాలు బెంబేలెత్తిపోయారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు పెట్టారు.
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోన్న వీడియోల ప్రకారం.. బ్లాక్ టీషర్ట్, షార్ట్ ధరించిన ఓ దుండగుడు.. బ్యాగ్‌ను ముందుకు ధరించి.. రద్దీగా ఉన్న మార్కెట్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత తన వద్ద గన్‌తో జనాలపైకి కాల్పులు జరిపాడు. బుల్లెట్ తగిలి కొందరు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. మరికొందరు గాయాలతోనే సురక్షిత ప్రాంతాలకు పరిగెట్టారు. కాల్పుల తర్వాత దుండగుడు తనని తానే కాల్చుకుని చనిపోయాడు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. కానీ, అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. చనిపోయినవారిల్లో సాధారణ పౌరలతోపాటు మార్కెట్లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఈ ఘటన బ్యాంగ్‌కాక్ సమీపంలోని ఛాతుచక్ జిల్లా ఓర్ తార్ కర్ మార్కెట్లో జరిగినట్లు తెలిసింది. కాల్పుల తర్వాత ఆత్మహత్య చేసుకున్ని దుండగుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ప్రస్తుతం అతడి ఆచూకీ తెలుసుకొనే ప్రయత్నంలో ఉన్నారు. ఇటీవల థాయ్‌లాండ్, కాంబోడియాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు దానితో సంబంధం ఉందనే అనుమానాలు నెలకొన్నాయి.
Also Read: శివుడి కోసం యుద్ధం.. థాయ్, కాంబోడియాల గొడవకు కారణాలు ఇవేనా?
🚨#Bangkok Mass Shooting –
Gunman opened fire at Or Tor Kor Market on Monday.
5 killed: 4 security guards & 1 woman.
Shooter took his own life.
Total deaths: 6 (including gunman).#Thailand #กราดยิง #BORSA pic.twitter.com/FZbGcgwrx4
— Eyes on the Globe (@eyes_globe) July 28, 2025
థాయ్, కాంబోడియాల గొడవేంటీ?
గత కొద్ది రోజులుగా థాయ్-కాంబోడియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరిపై ఒకరు బాంబు దాడులు చేసుకుంటున్నారు. ప్రసాత్ టా ముయెన్ థామ్ ప్రాంతంలో ఉన్న ప్రాచీన శివాలయం భూమి తమది అంటే.. తమది అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వీరి ఘర్షణలో ఇరుదేశాలకు చెందిన సైనికులు కూడా చనిపోయారు.
ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో ఖేమర్ వంశ రాజు ఉదయాదిత్య వర్మన్ II నిర్మించారు. ప్రస్తుతం థాయ్‌లాండ్, కాంబోడియాకు సరిహద్దుల్లో ఉన్న డాంగ్రెక్ పర్వతాల్లోని ఒక కొండపై ఈ ఆలయం ఉంది. దీనిపై తమకే హక్కు ఉందంటూ కొన్ని దశబ్దాల నుంచి పోట్లాడుకుంటున్నాయి. వాస్తవానికి ఈ ఆలయం ప్రవేశద్వారం, మెట్లు కాంబోడియా వైపు ఉన్నాయి. దీంతో అది మాకే చెందుతుందని ఆ దేశం వాదిస్తోంది. థాయ్ మాత్రం ఖేమార్ వంశరాజులు పాలించిన పరిపాలన ప్రాంతమంతా తమదేనని.. వారు నిర్మించిన ఆలయం కూడా న్యాయంగా తమకే దక్కుతుందని పేర్కొంది.
ఆ ఆలయం కాంబోడియాదేనా?
1962లో అంతర్జాతీయ న్యాయస్థానం దీనిపై తీర్పు ఇస్తూ.. ఆ ప్రాంతం కాంబోడియాదేనని పేర్కొంది. ఇందుకు థాయ్‌లాండ్ కూడా తమ అంగీకారం తెలిపింది. ప్రభుత్వాలు ఒప్పకున్నా.. ప్రజలు మాత్రం ఆ తీర్పును స్వాగతించలేదు. ఇప్పటికీ ఇరుదేశాల ప్రజలు ఈ విషయంపై గొడవపడుతూనే ఉన్నారు. ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన తర్వాత గొడవ మరింత ముదిరింది. 2011లో జరిగిన ఘర్షణల్లో సుమారు 10 మందికి పైగా చనిపోయారు. తాజాగా కాంబోడియా ఈ ఆలయంపై డ్రోన్లతో నిఘా పెట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన థాయ్.. వైమానిక దాడులు జరిపింది. కాంబోడియా కూడా థాయ్‌కు ఎదురు తిరిగింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి.
భారతీయులూ.. జర భద్రం
థాయ్‌లాండ్‌ను సందర్శించే పర్యటకులు ఎక్కువ మంది భారతీయులే ఉంటారు. బ్యాంగ్‌కాక్ కాల్పుల నేపథ్యంలో భారతీయుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. కొద్ది రోజులు అక్కడికి వెళ్లకపోవడమే సేఫ్. ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగినా.. ఆ వేడి తగ్గేందుకు మాత్రం మరికొన్ని ఏళ్లు పట్టవచ్చు. లేదా మరింత ఉద్రిక్తంగా మారవచ్చు.