Ananthapur Real Estate Businessmen Robbery | అనంతపురంలోని సవేరా హాస్పిటల్ సమీపంలోని రాజహంసా విల్లాస్‌లో భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శివారెడ్డి ఇంట్లో కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు.
శివారెడ్డి ఇంట్లో దాచి ఉంచిన 3.50 కోట్ల రూపాయల బంగారు ఆభరణాలు, 25 లక్షల రూపాయల నగదు దోచుకున్నారు. వీటిని ఫిబ్రవరి 7న తన కూతురు వివాహం కోసం దాచి ఉంచినట్లు శివారెడ్డి తెలిపారు. దుండగుల కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మొత్తం మూడు ఇళ్లల్లో దొంగతనాలు జరిగాయని సమాచారం. పొరుగునే ఉన్న ప్రభుత్వ ఉన్నతాధికారులు, మిస్టర్ చాయ్ నిర్వాహకుడి ఇళ్లలోనూ దోపిడీ జరిగింది.
ఓ ఇంట్లో దొరక్కపోవడంతో దుండగులు వెనక్కి వెళ్లిపోయారు. ఘటనపై పోలీసులు క్లూస్ టీమ్‌తో విచారణ చేపట్టారు.
చోరీ ఘటనపై బిజినెస్‌మెన్ శివారెడ్డి మాట్లాడుతూ, “నా కూతురి పెళ్లి కోసం ఉంచిన బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. మా ఇంటితో పాటు పక్కింటిలో కూడా దొంగతనం జరిగిందని సెక్యూరిటీ ద్వారా సమాచారం అందింది. కూతురి వివాహం కోసం పెళ్లి పత్రికలు ఆహ్వానం ఇచ్చేందుకు బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు ఈ దొంగతనం జరిగింది. పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వరంగల్, రాయచోటిలోనూ సంక్రాంతి దోపిడీలు
ఇలాంటి చోరీలు వరంగల్ జిల్లాలో సంక్రాంతి పండుగ సమయంలోనూ జరిగాయి. ఎనుమాముల, గీసుకొండ, దామెరబొడ్డు, చింతలపల్లి గ్రామాల్లో వరుసగా దోపిడీలు జరిగాయి. పండుగ కోసం స్వగ్రామాలకు వెళ్లిన ఇంటి యజమానుల గైర్హాజరీని దుండగులు టార్గెట్ చేశారు. కట్టర్లతో ఇంటి తాళాలు పగలగొట్టి.. బంగారు, నగదు దోచుకెళ్లారు.
కడప సమీపంలోని రాయచోటిలో అయితే దొంగలు నాలుగు ఇళ్లలో భారీగా దోచుకున్నారు. ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న రాజీవ్ స్వగృహ కాలనీలో నాలుగు ఇళ్లను టార్గెట్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇళ్లకు తాళం వేసి స్వగ్రామాలకు వెళ్లిన ఉపాధ్యాయుడు రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ వెంకటరమణ, రిటైర్డ్ టీచర్ రహమత్‌బీ, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇర్షాద్ నివాసాల్లో చోరీలు జరిగాయి. జనవరి 14 మంగళవారం రాత్రి దొంగలు ఇళ్లలోకి చొరబడి.. మొత్తం ఐదు తులాల బంగారం, 10 తులాల వెండి, రూ. 20 వేల నగదు దోచుకెళ్లారు.
బుధవారం మధ్యాహ్నం ఇళ్లకు వచ్చిన యజమానులు ఇంట్లోదొంగతనం జరిగిందని తెలిసి షాకయ్యారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇంతవరకూ విచారణ కొనసాగుతూనే ఉంది. పండుగ సీజన్‌లో ఇలాంటి చోరీలు వరుసగా జరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.
Also Read: అత్యాచారం ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలు.. నిందితుడితో పెళ్లిచేసుకోమని చెప్పిన పోలీసులు
దొంగతనాలను నివారించడానికి ఈ జాగ్రత్తలు పాటించండి
దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తాళాలు కనపడకుండా వేయాలి.
సమీప బంధువుల్ని ఇంటి దగ్గర ఉండేలా చూడాలి.
విలువైన వస్తువులు బ్యాంక్ లాకర్‌లో భద్రపరచాలి.
రాత్రిపూట ఇంట్లో లైట్లు వెలిగేలా చూడాలి.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, నోటిఫికేషన్లు పొందడం మంచిది.
అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వండి.