Benguluru Fire Accident : బెంగళూరులోని రాజాజీ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్ రాజకుమార్ రోడ్ నవరంగ్ జంక్షన్ వద్ద ఉన్న మై ఈవీ ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లో అగ్నికీలలు వ్యాపించాయి. ఈ ఘటనతో బైక్స్ అన్నీ మంటల్లో కాలి బూడిదైపోయాయి. అక్కడున్న ఫర్నిచర్ తో సహా అన్నీ కాలిపోగా.. ఈ ప్రమాదంలో 20 ఏళ్ల యువతి సజీవ దహనమయ్యింది. కాగా మృతురాలు ప్రియ అనే యువతిగా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ఆమె ఈ బైక్ షోరూంలో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక బైక్ బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో షోరూంలో ఎనిమిది మంది వరకూ సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. మంటలు చెలరేగిన వెంటనే ప్రతీ ఒక్కరూ ప్రమాదం నుంచి బయటపడేందుకు పరుగులు తీయగా.. రిసెప్షన్ లో ఉన్న ప్రియ మాత్రం మంటల్లో చిక్కుకుపోయింది. ఆమెను కాపాడటానికి అక్కడున్న సిబ్బంది శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఎలక్ట్రిక్ బైక్ షోరూం కావడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని, పరిస్థితులు చేయి దాటి పోయిందని తెలుపుతున్నారు.
Also Read : విశాఖలో దారుణం, లా స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం
ప్రమాదం జరిగిన సమయంలో ఆ షోరూంలో 20 నుంచి 25 వరకు ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నట్టు తెలుస్తోంది. వాటన్నిటికీ ఒకేసారి మంటలు అంటుకోవటంతో కొన్ని అకస్మాత్తుగా పేలిపోయాయి. దీంతో తీవ్ర స్థాయిలో మంటలు రోడ్డు మీదకు ఎగిసిపడ్డాయి. బస్ స్టేషన్ కు వెళ్లే ప్రధాన రహదారిలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ ప్రాంతంలో భారీగా వాహన రాకపోకలు సైతం నిలిచిపోయాయి.