China Manja Kills Constable | గాలిపటాలు ఎగరేయడానికి ఉపయోగించే ‘చైనీస్ మాంజా’ ప్రమాదకరమని చెప్తున్నా.. కొందరు ఇంకా ఆ దారాలు వాడుతూనే ఉంటారు. దీని వల్ల పక్షులు, జంతువులతోపాటు మనుషులు కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నా వినరు. అలా కొందరు ఆకతాయిలు వాడిన ‘చైనీస్ మాంజా’.. తాజాగా ఒక పోలీసు కానిస్టేబుల్ ప్రాణాలు బలితీసుకుంది.
సంక్రాంతి వచ్చిందంటే అందరూ పతంగులు ఎగరేయడానికి రెడీ అయిపోతారు. అయితే ఇలా చెయ్యడంలో కొన్నిసార్లు ప్రమాదకరమైన ‘చైనీస్ మాంజా’ వంటి దారాలు వాడుతారు. ఇలాంటి దారాలు వాడటం జంతువులతోపాటు మనుషుల ప్రాణాలు తీస్తుందనే హెచ్చరికలను పెడచెవిన పెడుతుంటారు. ఈ కారణంగా ఏటా ఎంతోమంది ‘చైనీస్ మాంజా’కు బలవుతుంటారు. ఇలాంటి ఘటనే తాజాగా యూపీలోని షాజహాన్‌పూర్‌లో వెలుగు చూసింది.
28 ఏళ్ల షారుఖ్ హసన్ అనే వ్యక్తి.. యూపీలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. శనివారం నాడు ఎప్పట్లాగే ఉద్యోగానికి షారుఖ్ బయలుదేరాడు. బైక్‌పై వెళ్తుండగా చౌక్ కొత్వాలి ప్రాంతంలో వేలాడుతున్న ‘చైనీస్ మాంజా’ దారం అతని మెడకు చుట్టుకుంది. ఆ దారంతో గాలిపటం ఎగరేస్తున్న వ్యక్తి ాలా వేగంగా ఆ దారాన్ని లాగుతుండటంతో.. షారుఖ్‌కు కనీసం బండి ఆపే అవకాశం కూడా దొరకలేదు. చూస్తుండగానే ఆ ప్రమాదకరమైన దారం.. షారుఖ్ పీకను కోసేసింది. దీంతో స్పాట్‌లోనే అతను ప్రాణాలు విడిచాడు.
Also Read: సంతానం లేని మహిళలను గర్భవతి చేస్తే రూ.10 లక్షలు.. బిహార్‌లో బంపర్ స్కామ్
ఈ ప్రమాదాన్ని చూసిన స్థానికులు వెంటనే.. షారుఖ్‌ను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతను మరణించాడని డాక్టర్లు ప్రకటించారు. ఈ ప్రమాదాన్ని కళ్లారా చూసిన కొందరు.. మరణించిన కానిస్టేబుల్ ఒక బ్రిడ్జి దిగుతున్న సమయంలో మాంజా అతని మెడకు చుట్టుకుందని గుర్తుచేసుకున్నారు. ఈ విషయం తెలిసిన అధికారులు.. చైనీస్ మాంజాపై నిషేధం విధించామని, దాన్ని వాడొద్దని ప్రజలను వేడుకున్నారు. ఇంతకుముందు కూడా చైనీస్ మాంజా వాడిన వారిపై చర్యలు తీసుకున్నామని, అయినా కొందరు ఈ దారాన్ని వాడుతూనే ఉన్నారని వాళ్లు చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు ఎవరికైనా జరిగే అవకాశం ఉందని, ఆ విషయం గుర్తుంచుకొని ప్రజలు ఈ దారాన్ని ఉపయోగించడం మానేయాలని కోరారు.
పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ ప్రమాదంపై స్పందించారు. కానిస్టేబుల్ మరణంపై విషాదం వ్యక్తం చేసిన ఎస్పీ రాజేష్.. మెడికల్ ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత షారుఖ్ భౌతికకాయాన్ని అతని కుటుంబానికి అందజేస్తామని తెలిపారు. కాగా, కొన్ని సంవత్సరాల క్రితం నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) దేశవ్యాప్తంగా ‘చైనీస్ మాంజా’పై నిషేధం విధించింది. ఇలాంటి ప్రమాదకరమైన దారాలు జంతువులు, పక్షులతోపాటు మనుషులకు కూడా హాని కలుగజేస్తుందని ఎన్జీటీ పేర్కొంది.
అయినా కొందరు ఆకతాయిలు ‘చైనీస్ మాంజా’ను తమ ఇళ్లలో భద్రంగా దాచుకొని, సంక్రాంతి సమయంలో బయటకు తీసి ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో పక్షులు, జంతువులతోపాటు మనుషుల ప్రాణాలు పోవడానికి కూడా కారణం అవుతున్నారు. ఇంతజరుగుతున్నా వీరి ప్రవర్తనలో మార్పురాకపోవడం నిజంగా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మేల్కొని, గాలిపటాలు ఎగరేసే సమయంలో ‘చైనీస్ మాంజా’ వంటి ప్రమాదకరమైన దారాలకు దూరంగా ఉండటం మంచిది.