Vijayawada Horror: డబ్బు, బంగారం కోసం యజమానిని పనిమనిషి దారుణంగా చంపేసింది. ఈ ఘటన విజయవాడలో జరిగింది. ఎన్టీఆర్ కాలనీలోని వెంకటరామారావు ఇంట్లో మూడు రోజుల క్రితం పనిమనిషిగా చేరింది అనూష. తన తల్లి బాగోగులు చూసుకుంటుందని.. అనూషను కేర్‌టేకర్‌గా పెట్టుకున్నాడు. కానీ ఆమే వెంకటరామారావు పాలిట మృత్యువు అయింది.
మూడు రోజులకే మృత్యుదూతగా మారిన అనూష
విజయవాడ ఎన్టీఆర్ కాలనీలో నివసిస్తున్న వెంకటరామారావు ఇంట్లో.. అనూష అనే మహిళ కేర్‌టేకర్‌గా చేరింది. తన తల్లి అనారోగ్యంతో ఉండడంతో ఆమెను చూసుకోవడం కోసం అనూషను నియమించాడు. కానీ కొద్దిరోజుల్లోనే ఆమె అసలు రూపం బయటపడింది. లక్ష్యం డబ్బు, బంగారం కావడంతో క్రూరతకు పాల్పడింది.
అర్ధరాత్రి నేరానికి పాల్పడిన అనూష
ఘటన జరిగిన రోజు అర్ధరాత్రి అనూష.. నిద్రలో ఉన్న వెంకటరామారావు గదిలోకి సైలెంట్‌గా ప్రవేశించింది. అతడి ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ఈ సమయంలో ఆమె భర్త కూడా తనకు సాయం చేశాడు. అనంతరం ఇంట్లో ఉన్న బీరువా బద్దలుకొట్టి.. అందులో ఉన్న డబ్బు, బంగారాన్ని అపహరించి పరారయ్యారు.
ఆధారాలు మాయం చేసేందుకు
హత్య అనంతరం ఆధారాలు మిగలకుండా చూసేందుకు.. అనూష మరో ఘోర చర్యకు పాల్పడింది. వెంకటరామారావు శరీరంపై కారం చల్లి ఆధారాలను తుడిచివేయాలని యత్నించింది. దీనివల్ల మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయింది. మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉన్న వెంకటరామారావును.. చూసిన ఆయన తల్లి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.
పోలీసుల దర్యాప్తుతో నిజాలు బయటకు
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్థానిక సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ ఆధారాలతో అనూషపై అనుమానాలు బలపడ్డాయి. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, నిజాన్ని ఒప్పుకుంది. ఆమె భర్త కూడా ఈ కుట్రలో భాగమై ఉండటాన్ని పోలీసులు ధ్రువీకరించారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also Read: సైబర్ నేరగాళ్లకు బలైన మహిళ.. KPHB లో దారుణం
సంఘటనపై తీవ్ర ఆగ్రహం
ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. సమాజంలో విశ్వాసం అనేది మంటగలిసిపోతుంది. రోజురోజుకూ ఇలాంటివి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నమ్మకంగా ఇంట్లోకి తీసుకున్న వ్యక్తులే.. ప్రాణాల మీదకు వస్తే, భద్రత ఎక్కడ అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు విచారణ పూర్తి చేసి.. న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.