AR Rahman:ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రెహమాన్(AR Rahman:) గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈయన కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా సుపరిచితులు. అయితే అలాంటి ఏఆర్ రెహమాన్ తాజాగా ఓ గ్రామానికి వెళ్ళగా అక్కడి విద్యార్థుల అద్భుత ప్రదర్శన చూసి ఫిదా అయిపోయారు. వీరిలో ఇంత టాలెంట్ ఉందా అని తెగ మురిసిపోయారు. మరి ఇంతకీ ఏ.ఆర్. రెహమాన్ ఎక్కడికి వెళ్లారు? అనే విషయానికి వస్తే..ఏ ఆర్ రెహమాన్ తాజాగా సత్యసాయి గ్రామం (Sathya Sai Village)లో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గ్లోబల్ హ్యుమానిటేరియన్ మధుసూదన్ సాయి నేతృత్వంలో జరిగిన ‘వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక అక్కడ విద్యార్థుల ఆర్కెస్ట్రా ప్రదర్శనకి ఏ.ఆర్. రెహమాన్ ఆశ్చర్యపోయారు. వీళ్ళ టాలెంట్ అమోఘం అని మెచ్చుకున్నారు.
సత్యసాయి గ్రామాన్ని సందర్శించిన ఏ ఆర్ రెహమాన్..
ఇక విషయంలోకి వెళ్తే.. వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్(One World One Family Mission) అనే కార్యక్రమంలో పైరేట్స్ ఆఫ్ కరేబియన్, మిషన్ ఇంపాజిబుల్ వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొన్ని గీతాలను అద్భుతంగా ప్రదర్శించారు అక్కడ విద్యార్థులు..సత్యసాయి గ్రామంలోని గురుకుల విద్యార్థులు గ్రీకు- అమెరికన్ మల్టీ ఇన్స్ట్రుమెంటలిస్ట్ డిమిట్రిస్ లాంబ్రియానోస్ ఆధ్వర్యంలో గత కొద్ది రోజుల నుండి శిక్షణ పొందుతూ.. ఏఆర్ రెహమాన్ విచ్చేసిన ఈ కార్యక్రమంలో అద్భుతంగా ఆర్కెస్ట్రా ప్రదర్శించారు.అయితే ఈ గురుకుల విద్యార్థుల అమోఘమైన ప్రతిభని చూసి ఏఆర్ రెహమాన్ ఫిదా అయిపోయారు. నేను ఇప్పటివరకు చూసినటువంటి అత్యంత అద్భుతమైన ప్రదర్శనలో మీరు ప్రదర్శించిన ఈ ప్రదర్శన కూడా ఒకటి అంటూ ఆ విద్యార్థులను మెచ్చుకున్నారు. భవిష్యత్ కాలంలో ఈ సింఫనీ భారతదేశంలో అద్భుతమైన సింఫనీ గా పేరు తెచ్చుకుంటుందని కొనియాడారు.. ఇక్కడి విద్యార్థులకు భవిష్యత్ లో ఇంకా మరెన్నో అవకాశాలు వస్తాయని కూడా అభినందించారు.
ఇండియాలోనే అతిపెద్ద స్వదేశీ ఆర్కెస్ట్రా..
అంతేకాకుండా ఆ గురుకుల విద్యార్థులకు అత్యంత ఖరీదైన వాయిద్య పరికరాలను అందించి, వారి కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి శిక్షణ అందించి, వారిలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసిన వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ ని కొనియాడారు.. ఇక ఈ సింఫనీ ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాల నుండి వచ్చిన దాదాపు 170 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు శిక్షణ అందించారు.అంతేకాదు మన ఇండియాలోనే అతిపెద్ద స్వదేశీ ఆర్కెస్ట్రా ఇదే కావడం గమనార్హం. ఇక 2014 నుండి సాయి సింఫనీ ఆర్కెస్ట్రా(Sai Symphony Orchestra) స్టార్ట్ చేశారట.అప్పటినుండి ఇప్పటివరకు ఎంతో మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు.
రోగుల కోసం ఏ ఆర్ రెహమాన్ వినూత్న ప్రయోగం..
ఇక ఈ కార్యక్రమంలో ఏఆర్ రెహమాన్ మాట్లాడిన అనంతరం ఆధ్యాత్మికవేత్త మధుసూదన్ సాయి (Madhusudhan Sai) మాట్లాడుతూ.. “ఏ ఆర్ రెహమాన్ తను సంపాదించిన డబ్బులతో ఎంతోమంది పేదవాళ్ళకి సంగీతంలో శిక్షణ ఇప్పిస్తూ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ కోసం కూడా ఒక ప్రత్యేకమైన గీతాన్ని కంపోజ్ చేస్తున్నారు. అలాగే మధుసూదన్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్పిటల్లోని రోగులకు ఓదార్పునిచ్చేలా ఒక స్పెషల్ మ్యూజిక్ హీలింగ్ ని సైతం ఆయన కంపోజ్ చేస్తున్నారు” అంటూ ఏఆర్ రెహమాన్ గురించి గొప్పగా మాట్లాడారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం రెహమాన్ తో సహా అక్కడికి వచ్చిన ఎంతోమంది ప్రముఖులకు ఘనంగా సన్మానం చేశారు.
ALSO READ:Priyanka Jain: ప్రియాంక జైన్ తల్లి ప్రెగ్నెంట్.. నేనెప్పుడు కంటానో అంటూ పరి ఆవేదన!