Ram Gopal Varma: మామూలుగా పూర్తిస్థాయి కథ లేనిదే ఏ దర్శకుడు సినిమా స్టార్ట్ చేయలేడు. హీరోలు కూడా అలాంటి దర్శకులకు ఛాన్స్ ఇవ్వడానికి ఇష్టపడరు. అలాంటిది పూర్తిస్థాయి కథలను సిద్ధం చేసుకోకుండానే బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడితే ఎలా ఉంటుంది.? అది అసాధ్యమని అనిపిస్తుంది కదా.. కానీ దీనినే సాధ్యం చేసి చూపించాడు టాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అందరు దర్శకుల్లో ఈ డైరెక్టర్ స్టైలే వేరు అని ఫ్యాన్స్ అంటుంటారు. ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ మాత్రమే కాదు.. ఫిల్మ్ మేకింగ్ విషయంలో కూడా రామ్ గోపాల్ వర్మ చాలా డిఫరెంట్‌గా ఆలోచిస్తారని చాలామందికి తెలుసు. కానీ ఆయన అసలు కథ లేకుండానే ఒక సినిమా తెరకెక్కించి బ్లాక్‌బస్టర్ కొట్టిన విషయం మీకు తెలుసా.?
స్క్రిప్ట్‌ను నమ్మను
తాజాగా ఒక పోడ్కాస్ట్‌లో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ తన ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. అదే విషయంగా సినిమాలు తెరకెక్కించే విషయంలో తను అప్పటికప్పుడు ఆలోచనలను మార్చేస్తూ ఉంటానని బయటపెట్టాడు. ‘‘సత్య సినిమానే ఉదాహరణగా తీసుకుంటే అసలు దానికి ఒక స్క్రిప్ట్ అనేది లేదు. ఏదో ఒక మొండి ధైర్యంతో సినిమాను ప్రారంభించేసి షూటింగ్ మధ్యలో సీన్స్‌ను మారుస్తూ వచ్చాము’’ అని బయటపెట్టాడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma). అసలు కథను ఎందుకు పూర్తిగా సిద్ధం చేసుకోరు అని అడగగా తను స్క్రిప్ట్ అనే కాన్సెప్ట్‌నే నమ్మను అనేశాడు వర్మ. ఈ సమాధానం విన్న తర్వాత ఆయన స్టైలే వేరు అని మరోసారి ప్రూవ్ అయ్యింది అనుకుంటున్నారు ఫ్యాన్స్.
కథ మారింది
‘‘సత్య సినిమా విషయంలో ఏదైనా తప్పు జరిగి ఉండొచ్చు. కానీ అన్నీ సరిగ్గా జరిగాయి కాబట్టే సినిమా హిట్ అయ్యింది. కథ మారిపోయింది. సత్య సినిమాలోని ఒక సీన్‌లో పరిగెత్తుకుంటూ వస్తున్న సత్యను చూసి కళ్లు మామ గన్ గురిపెడతాడు. ఆ సీన్ తెరకెక్కిస్తున్నప్పుడు మకరంద్ దేశ్‌పాండే క్యారెక్టర్ అయిన చంద్రకాంత్ ములేను చంపేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. అప్పుడే మకరంద్‌కు ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగాను. నేను ఇంట్లో ఉన్నాను అన్నాడు. ఒకసారి సెట్‌కు రా. నీ పాత్రను చంపేయాలనే ఆలోచనలో ఉన్నాను అన్నాను. తను వచ్చాడు. సీన్ షూట్ చేశాం’’ అని అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ.
Also Read: హత్య ఎవరు చేశారన్నది ముఖ్యం కాదు.. ‘హిట్ 3’ స్టోరీని లీక్ చేసేసిన నాని
చేసేవాడిని కాదేమో
‘‘ఒక సరైన స్క్రిప్ట్ లేకుండా సినిమా తెరకెక్కిస్తే ఎన్నో తప్పులు జరిగే అవకాశం ఉంది. లక్ అనేది కలిసి రాకపోయింటే సత్య హిట్ అయ్యేది కాదేమో. ఒకవేళ మకరంద్ అదే రోజు వేరే సినిమా షూటింగ్‌లో ఉండుంటే.. నేను ఆరోజు ఆ సీన్ తీసేవాడిని కాదు. మరుసటి రోజు మనసు మార్చుకునేవాడినేమో’’ అని చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. అలా సరైన స్క్రిప్ట్ లేకపోయినా ‘సత్య’ (Satya) లాంటి ల్యాండ్‌మార్క్ సినిమాను తెరకెక్కించడం రామ్ గోపాల్ వర్మ వల్లే సాధ్యమవుతుంది అంటూ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. మళ్లీ తను అలాంటి సినిమాలు చేస్తే చూడాలని ఉందంటూ కోరికను బయటపెడుతున్నారు.