Vinnaithaandi Varuvaayaa: ఈరోజుల్లో సినిమాల రీ రిలీజ్‌లు అనేవి ట్రెండ్ అయిపోతున్నాయి. ఒకప్పుడు ఫ్లాప్ అనిపించుకున్న సినిమాలు కూడా మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకుంటున్నాయి. కొత్తగా విడుదల అవుతున్న సినిమాలకు ఈ రీ రిలీజ్ చిత్రాలు గట్టి పోటీ ఇస్తున్నాయి. కలెక్షన్స్ కూడా అదే రేంజ్‌లో రాబడుతున్నాయి. అలా ఇప్పటివరకు తెలుగు, హిందీ, తమిళంలో రీ రిలీజ్ అయిన ఎన్నో సినిమాలు బుకింగ్స్, కలెక్షన్స్ విషయంలో రీ రికార్డులు క్రియేట్ చేశాయి. కానీ ఒక తమిళ చిత్రం మాత్రం అంతకు మించి రికార్డే సెట్ చేసింది. రీ రిలీజ్ అయ్యి 1000 రోజులు అవుతున్నా ఇంకా ఒక తమిళ మూవీ మాత్రం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
అందరూ షాక్
కొన్ని సినిమాలు కేవలం ఒక్కసారి మాత్రమే కాదు.. పదేపదే కూడా రీ రిలీజ్ అవుతున్నాయి. అలా ఎన్నిసార్లు రీ రిలీజ్ అయినా వాటిని ఆదరించే ప్రేక్షకులు ఉన్నారు. అలా తెలుగులో కూడా పదేపదే రీ రిలీజ్ అయిన సినిమాలను ఆదరించే మూవీ లవర్స్ ఉన్నారు. అలాంటి వారు తమిళంలో కూడా ఉన్నారని మరోసారి ప్రూవ్ అయ్యింది. శింబు, త్రిష హీరోహీరోయిన్లుగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘వినైతాండి వరువాయా’ మూవీ చెన్నైలోని పీవీఆర్‌లో విడుదలయ్యి దాదాపు 1000 రోజులు ఆడుతూనే ఉంది అంటే తమిళ ప్రేక్షకులకు ఈ సినిమా అంటే ఎంత ప్రేమ, అభిమానమో అర్థమవుతోంది. ఇతర భాషా మూవీ లవర్స్ ఈ రికార్డును చూసి ఆశ్చర్యపోక తప్పడం లేదు.
బీట్ చేయలేని రికార్డ్
ప్రతీ ఏడాది ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా ‘వినైతాండి వరువాయా’ సినిమాను రీ రిలీజ్ చేయడం మేకర్స్‌కు అలవాటుగా మారింది. అలా చెన్నైలోని పీవీఆర్‌లో ఈ మూవీ రీ రిలీజ్ అయ్యింది. ఇప్పటికీ అక్కడ థియేటర్‌లో ఈ మూవీ రన్ అవ్వడం విశేషం. మామూలుగా ఇప్పటివరకు ఏ రీ రిలీజ్ సినిమా కూడా కనీసం 50 రోజులు థియేటర్లలో ఆడలేదు. అలాంటిది ఏకంగా 1000 రోజులుగా థియేటర్లలో రన్ అవుతూ ఉన్నా ‘వినైతాండి వరువాయా’ మూవీ రికార్డ్‌ను బీట్ చేయడం ఇంకే ఇతర సినిమా వల్ల కాదని ఇండస్ట్రీ నిపుణులు తేల్చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ మూవీ అంటే ప్రేక్షకులకు ఎంత ఇష్టమో అర్థమవుతోంది.
Also Read: పెళ్లయిన ఐదేళ్లకే విడాకులకు సిద్ధమయిన టాలీవుడ్ హీరోయిన్.. ఇదిగో ప్రూఫ్!
తెలుగులో కూడా
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినైతాండి వరువాయా’ (Vinnaithaandi Varuvaayaa) తెలుగులో కూడా రీమేక్ అయ్యింది. తెలుగులో నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా ‘ఏమాయ చేశావే’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు గౌతమ్ మీనన్. ఈ మూవీతోనే సమంత తెలుగులో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఇందులో జెస్సీ పాత్రలో కనిపించి ప్రేక్షకులకు క్రష్‌గా మారిపోయింది. అంతే కాకుండా ఈ మూవీ సమయంలోనే నాగచైతన్య, సమంత ప్రేమలో కూడా పడ్డారనే రూమర్ ఇప్పటికీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంటుంది. అలా తమిళంలోనే కాదు.. తెలుగులో కూడా ఒక మర్చిపోలేని క్లాసిక్ ప్రేమకథను ప్రేక్షకులకు అందించారు గౌతమ్ మీనన్.