Ambanis At Trump Swearing In | అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ వేడుకకు ప్రముఖ భారత పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani), ఆయన సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) హాజరయ్యారు. భారత కాలమానం ప్రకారం 2025 జనవరి 20న రాత్రి వాషింగ్టన్ డీసీలో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం జరుగనుంది. ఇందులో ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ట్రంప్ కుటుంబంతో అంబానీ దంపతులు
ట్రంప్ కుటుంబంతో సుదీర్ఘమైన అనుబంధం ఉన్న అంబానీ దంపతులు ఈ ప్రత్యేక వేడుక కోసం ఆహ్వానం అందుకున్నారు. ప్రపంచంలోని అతికొద్ది మంది ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానం పొందగా, అంబానీ దంపతులు కూడా వారిలో ఉన్నారు. అంబానీ ఆధ్వర్యంలోని అనేక వ్యాపారాలు అమెరికాలో వ్యాపించి ఉండడంతో, భారత్ – అమెరికా మధ్య ఉన్న బలమైన వ్యాపార, ఆర్థిక సంబంధాలకు ఇది చిహ్నంగా మారింది.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు జనవరి 19న ఏర్పాటు చేసిన క్యాండిల్ లైట్ డిన్నర్‌లో అంబానీ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌తో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియా వైరల్‌గా అవుతోంది.
Also Read: టిక్ టాక్ ఇక మస్క్ చేతికి?.. విక్రయించే యోచనలో చైనా
కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడిగా ప్రమాణం చేసే జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్‌తో పాటు టెక్ దిగ్గజాలు ఎలన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్, మాజీ అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్ తదితరులు పాల్గొన్నారు.
ఆనవాయితీ విరుద్ధంగా ట్రంప్ ప్రమాణ స్వీకారం
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో 2024లో గడ్డకట్టే చలిలో డొనాల్డ్ ట్రంప్ 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 78 ఏళ్ల ట్రంప్ సోమవారం (జనవరి 20) జో బైడెన్ నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో ట్రంప్ తొలిసారిగా 2016లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వేల మంది హాజరయ్యారు, ఎప్పుడూ యుఎస్ క్యాపిటోల్ బయట జరిగే ఈ కార్యక్రమం ఈసారి ఆనవాయితీ విరుద్ధంగా.. తీవ్ర చలికారణంగా ఇండోర్ లో (లోపల హాలులో) జరుగనుంది. ఈ కారణంగానే ప్రత్యక్షంగా హాజరయ్యే ప్రజల సంఖ్య కూడా పరిమితంగా ఉంటుందని సమాచారం.
భద్రతా ఏర్పాట్లు
వాషింగ్టన్‌లో ట్రంప్ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. భారత కాలామానం ప్రకారం.. సోమవారం జనవరి 20, 2025న రాత్రి 10.30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమవుతుంది. చలి కారణంగా, క్యాపిటల్ హిల్‌లోని రోటుండా ఇండోర్ ఆవరణలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇప్పటికే శనివారమే దేశం నలుమూలల నుంచి రిపబ్లికన్ పార్టీ అభిమానులు వాషింగ్టన్‌కు చేరుకున్నారు. కానీ ఈసారి, ముందుగా నిర్వహించిన బహిరంగ ప్రదేశంలోని ప్రమాణ స్వీకారానికి భిన్నంగా, ఆవరణ లోపల ప్రసంగం కొనసాగుతుంది.
ట్రంప్ యొక్క ప్రమాణ స్వీకారం కార్యక్రమం సోమవారం సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ప్రార్థనలతో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ట్రంప్ శ్వేత సౌధానికి వెళ్లి, అక్కడ బైడెన్, ఆయన సతీమణి ఇచ్చే తేనీటి విందులో పాల్గొంటారు. అనంతరం, ట్రంప్ క్యాపిటల్ హిల్‌లో అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తారు.
భారత్, చైనా పర్యటనలకు ప్రెసిడెంట్ ట్రంప్
ప్రమాణ స్వీకారం తరువాత ట్రంప్.. అధ్యక్షుడి హోదాలో భారత్, చైనా పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే పలు ఆంగ్లపత్రికలకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో తెలిపారు. చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం తాను కృషి చేస్తానని అలాగే భారత దేశాన్ని ఒకసారి అధికారికంగా పర్యటిస్తానని ఆయన చెప్పారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ట్రంప్ ఇటీవల ఫోన్ లో మాట్లాడారు. ఆ తరువాతే ప్రపంచ శాంతి కోసం కలిసి పనిచేస్తామని ట్రంప్ తెలిపారు. కాగా, ట్రంప్ ప్రమాణ స్వీకారానికి చైనా నుంచి ప్రతినిధిగా వైస్ ప్రెసిడెంట్ హాన్ జెంగ్ హాజరుకానున్నారు.