Chicken Eggs Price Trump| అమెరికాలో కోడి గుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో గుడ్లు డజను రూ. 603 (ఏడు అమెరికన్ డాలర్లు) వరకు అమ్ముడవుతున్నాయి. ప్రజల అల్పాహారంలో గుడ్లు ప్రధాన భాగం కావడంతో ప్రతిరోజూ కోట్లాది మంది వీటిని కొనుగోలు చేస్తుంటారు. అయితే గుడ్ల ధరలు భారీగా పెరగడంతో, రోజువారీ ఖర్చులను నిర్వహించడం కష్టంగా మారిందని వారు చెబుతున్నారు.
గుడ్ల ధరల పెరుగుదలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమని డెమోక్రటిక్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. గుడ్ల ధరలను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్నారు. కమోడిటీ ప్రైస్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ట్రేడింగ్ ఎకనామిక్స్ ప్రకారం, కొన్ని నగరాల్లో గుడ్ల ధరలు ఏడు డాలర్ల రికార్డు స్థాయికి చేరాయి. ట్రంప్ హామీ ఇచ్చినప్పటికీ, బైడెన్ పరిపాలనలో ఉన్న ధరల కంటే 40 శాతం మేరకు గుడ్ల ధరలు పెరిగాయి.
గుడ్ల కొరతకు బర్డ్ ఫ్లూ కారణం
అమెరికాలో బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా) వ్యాప్తి చెందడంతో కోళ్లను పెద్ద సంఖ్యలో చంపవలసి వచ్చింది. ఇప్పటివరకు 30 మిలియన్లకు పైగా కోళ్లను హతమార్చారు. ఈ కారణంగా గుడ్ల ఉత్పత్తి తగ్గి, ధరలు పెరిగాయి. అయితే, ట్రంప్ తీసుకున్న ఆహార దిగుమతుల పరిమితి నిర్ణయాల వల్ల కూడా గుడ్ల కొరత మరింత తీవ్రంగా మారిందని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. గుడ్ల ధరల పెరుగుదలపై మిన్నెసోటా సెనేటర్ అమీ క్లోబుచార్ మాట్లాడుతూ, ట్రంప్ హామీలు ఇచ్చినా, వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని వ్యాఖ్యానించారు.
బిల్ క్లింటన్ మాజీ క్యాబినెట్ కార్యదర్శి రాబర్ట్ రీచ్ మాట్లాడుతూ, “ట్రంప్ నిర్ణయాలు అమెరికా ప్రజల ఆరోగ్యానికి, ఆర్థిక స్థితికి ముప్పు కలిగిస్తున్నాయి” అని విమర్శించారు.
ఇతర డెమొక్రాట్స్ నాయకులు కూడా ట్రంప్ నిర్ణయాల వల్లే ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని చెబుతున్నారు. అమెరికా పొరుగు దేశాల్లో ఏవియన్ ఫ్లూ కేసులు పెరిగిపోతుండడంతో అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్య శాఖకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఇతర దేశాల నుంచి గుడ్లు, చికెన్ కొనుగోలు చేయడం నిలిపివేయాలని చెప్పారు. ఈ ఆదేశాల వల్ల కోడి గుడ్ల సరఫరా నిలిచిపోయి.. మార్కెట్లో కొరత ఏర్పడింది. ఏవియన్ ఫ్లూ లేద బర్డ్ ఫ్లూ కేసులు 2022 నుంచి అమెరికాలో నమోదవుతున్నాయి. దీని వల్ల ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల్లో 3 కోట్ల కోళ్లును సజీవ దహనం చేసింది. ఇందులో పది శాతం గత మూడు నెలల్లోనే జరగడం పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో తెలియజేస్తోంది.
Also Read: గల్ఫ్ ఆఫ్ అమెరికా పేరు అఫీషియల్.. గ్రీన్‌లాండ్ కోసం డెన్మార్క్ ప్రధానికి ట్రంప్ బెదిరింపులు
చమురు ధరలపై ట్రంప్ విజ్ఞప్తి
ఇకపోతే, పెట్రోలియం ఉత్పత్తుల ధరల విషయంలో ఒపెక్ దేశాలకు ట్రంప్ విజ్ఞప్తి చేశారు. చమురు ధరలు తగ్గించడం ద్వారా రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలిపేందుకు మార్గం సుగమం అవుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. దావోస్ సదస్సులో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించిన ట్రంప్, రష్యా-ఉక్రెయిన్ ఘర్షణకు ఒపెక్ దేశాల కూటమి విధానాలే ప్రధాన కారణమని నిందించారు.
ఈ అంశాలపై ప్రజలు, రాజకీయ నాయకులు విస్తృతంగా చర్చిస్తున్నారు. గుడ్ల ధరల అంశం, చమురు ధరల పెరుగుదల ఇరువర్గాల మధ్య రాజకీయ వివాదాలకు దారితీస్తోంది.