Germany Accident : జర్మనీలోని మ్యూనిచ్‌లో ఫిబ్రవరి 13న జనాలపై వేగంగా ఓ కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో దాదాపు 28 మందికి పైగా తీవ్రంగా గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం 10:30 గంటల సమయంలో మ్యూనిచ్ డౌన్‌టౌన్ సమీపంలో సర్వీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ఆందోనళనకారులంతా ఓ చోటకి చేరుకుని నిరసన తెలుపుతున్న సమయంలో.. అటుగా వచ్చిన ఓ కారు.. నేరుగా నిరసనకారులపైకి దూసుకెళ్లింది. దీంతో.. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయాలపాలైయ్యారు. ఘటన జరిగిన వెంటనే స్పందించి పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను.. అఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన జర్మనీలో ఆశ్రయం పొందుతున్న 24 ఏళ్ల యువకుడిగా వ్యక్తిగా గుర్తించారు. ఈ దాడి ఉద్దేశ్యపూర్వకంగా చేసినట్లుగా కనిపిస్తుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వచ్చే వారంలో జర్మనీలో సమాఖ్య ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన జరగడంతో.. అక్కడి భద్రతపై ఆందోళనలు పెరిగిపోతున్నాయి.
మ్యూనిచ్ నగరంలో అంతర్జాతీయంగా కీలకమైన సమావేశం నిర్వహిస్తున్నరు. ఇందులో పాల్గొనేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ వంటి అంతర్జాతీయ నాయకులు హజరుకానున్నారు. ఇలాంటి కీలక సందర్భంలో.. కొన్ని గంటల ముందు అనుమానిత దాడి జరిగడంతో.. భద్రతా ఏజెన్సీలు అప్రమత్తం అయ్యాయి. ప్రస్తుతానికి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించి వైద్య సహాయం అందిస్తున్నారు. కాగా.. సమ్మె చేస్తున్న కార్మికుల ప్రదర్శన దగ్గర పోలీసు వాహనాలు ఉన్నాయి. వాటిని నెమ్మదిగానే సమీపించిన యువకుడు.. ఒక్కసారిగా కారు వేగం పెంచి జనాలను ఢీట్టించాడని పోలీసులు తెలిపారు. వెంటనే తేరుకున్న పోలీసులు.. నిందితుడిపై ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఆ వెంటనే అతను లొంగిపోవడంతో.. పోలీసులు కాల్పులు జరపలేదని వెల్లడించారు.
మ్యూనిచ్‌లోని పురాతన బీర్ హాళ్లలో ఒకటైన లోవెన్ బ్రౌకెల్లర్‌లో ప్రత్యక్ష సాక్షుల కోసం పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు. పొరుగున ఉన్న కార్యాలయ భవనం కిటికీలోంచి ఈ సంఘటనను చూశానని తెలిపిన ఓ వ్యక్తి.. తెల్లటి మినీ కూపర్ కారు పోలీసు వాహనాల మధ్యకు వెళ్లి, ఆపై వేగం పెంచుకుని వెళ్లిందని తెలిపారు. మరో ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ..కారు వేగంగా వెళ్లి జనసమూహంలో ఉన్న అనేక మందిని ఢీకొట్టిందని వెల్లడించారు. వెర్డి ప్రభుత్వ రంగ కార్మికుల సంఘం నిర్వహించిన సమ్మెలో జనసమూహంలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సంఘ నాయకుడు ఫ్రాంక్ వెర్నెకే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ సమ్మెపై ఇలాంటి దుర్మార్గపు చర్య జరుగుతుందని అనుకోలేదని అన్నారు.
ఇది దాడి కావచ్చంటూ బవేరియా స్టేట్ ప్రీమియర్ మార్కస్ సోడర్ అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడికి మాదకద్రవ్యాలతో పాటు దొంగతనాలు చేసిన నేర చరిత్ర ఉన్నట్లు తర్వాత విచారణలో కనుక్కున్నారు. ఫిబ్రవరి 23 ఎన్నికలకు ముందు ప్రచారంలో వలస, భద్రతా సమస్యలు తీవ్ర ప్రభావం చూపించాయి. ముఖ్యంగా ఇటీవలి కొన్ని రోజుల క్రితం జరిగిన హింసాత్మక సంఘటనల తర్వాత.. వామపక్షాల నుంచి సెంటర్-రైట్ కన్జర్వేటివ్‌లకు గెలుపు అవకాశాలు పెరిగాయి.
గతేడాది డిసెంబర్‌లో మాగ్డేబర్గ్‌లోని క్రిస్మస్ మార్కెట్‌పై ఇలానే వేగంగా వచ్చిన కారు ప్రజల్ని ఢీకొట్టింది. ఇందులో.. ఆరుగురు మరణించారు. గత నెలలో బవేరియన్ పట్టణం అస్చాఫెన్‌బర్గ్‌లో జరిగిన దాడిలో.. ఓ పసిబిడ్డ ప్రాణాలు కోల్పోగా, అతన్ని పట్టుకుని ఉన్న పెద్దాయన సైతం ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలకు వలసదారులే కారణం కావడం అక్కడ భద్రతా పరిస్థితులపై ఆందోళనలను పెంచేస్తున్నాయి. ఇతర దేశాల్లోనూ వలసదారుల నేరాలు పెరిగిపోతుండడం, జర్మనీలోనూ వరుస ఘటనలతో.. దేశ భద్రతే తనకు అత్యంత ముఖ్యమంటూ జర్మనీ తదుపరి ఛాన్సలర్‌గా రేసులో ముందున్న కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి ఫ్రెడరిక్ మెర్జ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
Also read : బంగ్లా అల్లర్లల్లో రహస్య అజెండా – ఆ వర్గమే లక్ష్యం, 1400 మంది మృతి
దేశంలో శాంతి భద్రతలను కఠినంగా అమలు చేస్తామని, దేశంలో అందరూ మళ్ళీ సురక్షితంగా ఉండాలని, అలా జరగాలంటే జర్మనీలో ఏదో మార్పు రావాలి.. అంటూ మెర్జ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సోషల్ డెమోక్రాట్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ వలసల విషయంలో మృదువుగా వ్యవహరిస్తున్నారని మెర్జ్ ఆరోపించారు. గత నెలలో.. తీవ్రవాద ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (AfD) మద్దతుతో అధికారాన్ని చేపట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.