Maldives ministers Resignation| మాల్దీవ్స్ దేశానికి చెందిన ఇద్దరు మంత్రులు మాల్షా షరీఫ్, మరియమ్ షియూనా తమ పదవులకు మంగళవారం (సెప్టెంబర్ 10, 2024) సాయంత్రం రాజీనామా చేశారు. వీరిద్దరూ జనవరి 2024లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై అవమానకర వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో మాల్దీవుల ప్రభుత్వం నష్ట నివారణ చర్యల్లో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులను సస్పెండ్ చేసింది.
అయితే దాదాపు 9 నెలలుగా సస్పెన్షన్ లో ఉన్న ఈ ఇద్దరు మంత్రులు ప్రస్తుతం రాజీనామా చేశారు. మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు అధికారికంగా భారత దేశ పర్యటనకు త్వరలో బయలుదేరబోతున్న సమయంలో ఇద్దరు జూనియర్ మంత్రులు రాజీనామా చేయడం గమనార్హం. అయితే సస్పెన్షన్ లో ఉన్న ఇద్దరు మంత్రుల తమ పదవులకు ఎందుకు రాజీనామా చేశారో కారణం వెల్లడించలేదు. మాల్దీవ్స్ అధ్యక్ష భవనం ప్రతినిధి హీనా వలీద్.. మంగళవారం చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జు త్వరలోనే భారతదేశానికి పర్యటించనున్నారు. పర్యటన తేదీ భారత ప్రధాన మంత్రి అందుబాటులో ఉన్న సమయం చూసి ప్రకటిస్తామని ఆమె తెలిపారు.
భారత వ్యతిరేక నినాదాలతో అధికారంలోకి వచ్చిన మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జు.. అధ్యక్ష పదవి చేపట్టగానే తరతరాలుగా వస్తున్న మాల్దీవ్స్ ఆనవాయితీని అతిక్రమించారు. మాల్దీవ్స్ లో కొత్త అధ్యక్షుడు ఎన్నిక కాగానే ఆ కొత్త ప్రెసిడెంట్ తొలి అధికారక పర్యటన మీద భారత దేశానికి విచ్చేస్తారు. భారత ప్రధానితో కలిసి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేస్తామని హామీ ఇస్తారు. కానీ మొయిజ్జు అలా చేయలేదు. తన తొలి అధికారిక పర్యటనపై ఆయన టర్కీ దేశం వెళ్లి.. ఆ తరువాత చైనా పర్యటనకు వెళ్లారు.
Also Read: కేవలం రూ.20 లంచం తీసుకున్న పోలీస్.. 34 ఏళ్ల తరువాత మండిపడిన కోర్టు!
అయితే మొయిజ్జు అధికారంలోకి వచ్చిన తరువాత భారత్ తో మాల్దీవ్స్ సంబంధాలు క్షీణించాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ జనవరి నెలలో దేశంలోని లక్ష్యద్వీప్ దీవులకు పర్యటించి.. దేశంలో లక్ష్యద్వీప్ మంచి పర్యాటక కేంద్రమని.. దాన్ని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ప్రధాని మోదీ లక్ష్యద్వీప్ లో అండర్ వాటర్ డైవింగ్ విన్యాసాలు కూడా చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ క్రమంలో ప్రధాని మోదీ లక్ష్యద్వీప్ పర్యటనపై, ఆయన ఫొటోలపై మాల్దీవ్స్ కు చెందిన ముగ్గురు మంత్రులు అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళా మంత్రి అయితే భారత ప్రధాని ఒక జోకర్ గా కనిపిస్తున్నాడని కామెంట్ చేయగా.. మరొక మంత్రి అయితే ”మాల్దీవ్స్ కు పోటీగా లక్ష్యద్వీప్ పర్యాటక కేంద్రంగా రూపొందించాలని చూస్తున్నారు. అది జరగనిపని.. భారతీయులు పరిశుభ్రతను పాటించరు” అని చెప్పాడు.
Also Read: సహజీవనం చేసిన వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన యువతి.. ఈజీగా బెయిల్ తెచ్చుకున్న నిందితుడు.. ఎలాగంటే?
ఈ ఇద్దరి వ్యాఖ్యలపై భారతదేశంలోని ప్రజలు మండిపడ్డారు. మాల్దీవ్స్ పర్యటనలను రద్దు చేసుకున్నారు. బాయ్ కాట్ మాల్దీవ్స్ అని ట్రెండ్ కూడా సాగింది. ఇదంతా జరుగుతుండగా.. మాల్దీవ్స్ ప్రభుత్వం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురునీ సస్పెండ్ చేసింది. ప్రభుత్వానికి ఆ సస్పెండ్ అయిన మంత్రుల వ్యాఖ్యలకు ఎటువంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది.
అయితే తాజాగా ఈ ఇద్దరు సస్పెండ్ అయిన మంత్రులు రాజీనామా చేయడంతో మాల్దీవ్స్ రాజకీయాల్లో కీలక మార్పు జరగబోతోందనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.