US Military Secrets Elon Musk| అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అత్యంత విశ్వాసపాత్రుడిగా వ్యవహరిస్తున్న ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. అమెరికా పాలనా వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఆయన నేతృత్వం వహిస్తున్న డోజె (DOGE) విభాగానికి విస్తృత అధికారాలు కల్పించడంపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల మధ్య.. పెంటగాన్ (Pentagon)లో అమెరికా మిలిటరీ వివరాలు తెలుసుకునేందుకు మస్క్ (Elon Musk) వెళ్లనున్నారనే వార్తలు మరింత చర్చనీయాంశంగా మారాయి. అంతేకాకుండా, అమెరికా రక్షణశాఖ రూపొందించిన కొన్ని రహస్య ప్రణాళికలను టెస్లా అధినేతకు వివరించనున్నట్లు సమాచారం వెల్లడైంది. చైనా (China)తో యుద్ధం వస్తే అమెరికా ఎలా వ్యవహరించాలో తెలిపే సైనిక ప్రణాళికను మస్క్‌కు తెలియజేయనున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనం ప్రచురించింది.
యుద్ధం లాంటి పరిస్థితి ఎదురైతే చైనాతో ఎలా పోరాడాలన్న దానిపై అమెరికా (USA) సైన్యం 20 నుంచి 30 స్లైడ్స్ రూపొందించింది. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అమెరికాలో చైనా ఏయే లక్ష్యాలను దాడి చేస్తుంది, ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తుంది అన్న వివరాలు ఈ ప్రణాళికలో ఉన్నాయి. యుద్ధంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలన్న ప్రణాళికలను కూడా రూపొందించారు. ఈ ప్రణాళికను త్వరలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు పెంటగాన్ అందించనుంది. అయితే.. ఆ వివరాలను ముందుగా మస్క్‌కు తెలియజేయనున్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనంలో వెల్లడైంది.
Also Read: భారత్ సుంకాలు తగ్గించాలి లేకుంటే.. ట్రంప్ వార్నింగ్
అమెరికా కాలమానం ప్రకారం ఎలాన్ మస్క్ శుక్రవారం పెంటగాన్‌ను సందర్శించనున్నారు. ఈ విషయాన్ని పెంటగాన్ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. అయితే.. న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని తప్పుడు వార్తగా అభివర్ణిస్తూ రక్షణ శాఖ చీఫ్ పీట్ హెగ్‌సెత్ ఖండించారు. ‘‘మస్క్ పెంటగాన్ కు పర్యటిస్తున్న వార్త వాస్తవమే కానీ.. ఆయన కేవలం ఈ విభాగం పనితీరు గురించి తెలుసుకోవడానికి మాత్రమే వస్తున్నారు. చైనాతో యుద్ధం గురించి లేదా ఇతర దేశాలతో యుద్ధ ప్రణాళికల గురించి చర్చలు జరిగే ప్రస్తావనే లేదు ’’ అని హెగ్ సెత్ చెప్పారు. అమెరికా ప్రెసిడెంట్ కూడా ఈ వార్తను ఖండిస్తూ ట్రూత్ సోషల్ లో ఓ పోస్ట్ చేశారు.
అంతా అబద్ధం.. ట్రూత్ సోషల్‌లో ఖండించిన ట్రంప్
అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ కథనాలను తీవ్రంగా ఖండించారు. ‘‘న్యూయార్క్ టైమ్స్ మరోసారి అసత్య వార్తలు ప్రచారం చేస్తోంది. మస్క్ పెంటగాన్‌కు వెళ్తున్నారు. చైనాతో యుద్ధ ప్రణాళికల గురించి చర్చిస్తారు అని రాసింది. ఎంత హాస్యాస్పదం ఇది..! మస్క్ తన పర్యటనలో చైనా పేరును కూడా ప్రస్తావించలేదు. మీడియా ఇలాంటి అబద్ధాలను సృష్టించడం ఎంత అవమానకరం. ఏదేమైనా ఇది పూర్తిగా అవాస్తవం’’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో స్పష్టం చేశారు.
చైనాలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థలు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాయి. ఈ నేపథ్యంలో అమెరికా, చైనా యుద్ధం ప్రణాళికల గురించి ఆయనతో చర్చించే అవకాశం లేదని తెలుస్తోంది.
సుంకాలు, సైబర్ దాడులు, తైవాన్, హాంకాంగ్‌తో చైనా ఘర్షణలు, మానవ హక్కుల ఉల్లంఘన తదితర అంశాలపై అమెరికా-చైనా మధ్య కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. చైనాతో యుద్ధ ప్రణాళికలు, మిలిటరీ రహస్య సమాచారం ఎలాన్ మస్క్‌కు వెల్లడించబడుతున్నాయనే వార్తలు వివాదాలను రేకెత్తించాయి.