Modi To Jinping: చైనాతో సానుకూల సంబంధాలు కొనసాగించేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. త్వరలో రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నట్లు తెలిపారు. సరిహద్దుల్లో శాంతి-స్థిరత్వం నెలకొందని, కైలాస మానససరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమైన విషయాన్ని గుర్తు చేశారు.
దాదాపు ఏడేళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. తియాజింగ్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ-SCO వార్షిక శిఖరాగ్ర సదస్సులో హాజరయ్యారు. సదస్సు ప్రారంభానికి ముందు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. పరస్పర నమ్మకంతో ఇరు దేశాల మధ్య సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలు, 2.8 బిలియన్ ప్రజలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లనున్నారు. మానవత్వానికి చాలా అవసరమని చైనా అధ్యక్షుడికి చెప్పారు. ఈ ఏడాది చైనా-భారత్ దౌత్య సంబంధాలకు 75వ వార్షికోత్సవాన్ని సూచిస్తుందన్నారు.
గతేడాది రష్యాలోని కజన్‌లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో జిన్‌పింగ్‌తో జరిగిన సమావేశం గురించి ప్రస్తావించారు. ఆనాడు తమ భేటీ ఇరుదేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు బాటలు వేసిందని మనసులోని మాట బయటపెట్టారు ప్రధాని.
ALSO READ: మోదీ దెబ్బ.. అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ అవుట్
ప్రపంచం పరివర్తన వైపు పయనిస్తోందన్నారు చైనా అధ్యక్షుడు. ఇరు దేశాలు అత్యంత నాగరిక దేశాలని అన్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలని, గ్లోబల్ సౌత్‌లో భాగమన్నారు. డ్రాగన్-ఏనుగు కలిసి రావడం చాలా ముఖ్యమన్నారు. ఆసియా, ప్రపంచ వ్యాప్తంగా శాంతి, శ్రేయస్సుకు ఈ రెండు దేశాలు దోహదపడాలన్నారు.
రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఆగ్రహించిన డొనాల్డ్ ట్రంప్.. భారత్‌పై సుంకాలు పెంచారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల నేతలు భేటీ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జపాన్ నుంచి నేరుగా షాంఘై సహకార సంస్థ-SCO వార్షిక సదస్సు కోసం చైనాలోని తియాంజిన్ సిటీకి చేరుకున్నారు ప్రధాని మోదీ.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తోపాటు అనేక మంది నాయకులతో సమావేశం కానున్నారు. సరిగ్గా ఐదేళ్ల కిందట అంటే 2020 ఏడాది గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలు మళ్లీ మామూలు స్థితికి రానున్నట్లు అంచనా వేస్తున్నారు.
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత్‌ని సందర్శించిన రెండు వారాల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటిస్తున్నారు. 10 దేశాల షాంఘై సహకార సంస్థ-SCO వార్షిక శిఖరాగ్ర సదస్సు ఈసారి చైనా ఆతిథ్యం ఇస్తోంది. ఈ సమావేశానికి ఇరవై మంది విదేశీ నాయకులు హాజరవుతున్నారు. చైనా, భారత్, రష్యాతోపాటు, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, పాకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, బెలారస్ వంటి దేశాలున్నాయి.