Putin Trump Ukraine War| రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా శాంతి ప్రయత్నాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో.. మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఫోన్‌లో అత్యంత కీలక చర్చలు ..రిగాయి. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సంభాషణలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా కాల్పుల విరమణపై సంప్రదింపులు జరిపినట్లు ట్రంప్ వెల్లడించారు. శాంతియుత ఒప్పందం సాధించేందుకు రష్యా సిద్ధంగా ఉందని, అయితే దానికి కొన్ని నిబంధనలు ఉంటాయని పుతిన్ స్పష్టం చేశారు.
పుతిన్ మీడియాతో మాట్లాడుతూ.. “ఉక్రెయిన్‌తో కలిసి శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి రష్యా సిద్ధంగా ఉంది. ఈ ప్రక్రియలో అమెరికా మద్దతు కీలకం. ట్రంప్‌తో ఈ అంశంపై మేం అంగీకరించాం. కానీ శాంతి కోసం ఒక నిర్మిత రూపం ఉండాలి. కాల్పుల విరమణకు సరైన గడువు, స్పష్టమైన నిబంధనలు అవసరం” అని పేర్కొన్నారు. ఉక్రెయిన్, దాని మిత్రదేశాలవైపు నుంచి 30 రోజుల కాల్పుల విరమణకు రష్యాను కోరిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.
ఈ చర్చల అనంతరం ట్రంప్ స్పందిస్తూ.. “రష్యా అధ్యక్షుడితో ఫోన్ కాల్ అద్భుతంగా సాగింది. త్వరలోనే రష్యా-ఉక్రెయిన్‌లు కాల్పుల విరమణ చర్చలు ప్రారంభిస్తారన్న నమ్మకం ఉంది. ఈ చర్చలు ఆయా దేశాల మధ్యే జరగాలి. వారు తమ పరిస్థితులను బాగా తెలుసుకుంటారు” అని తెలిపారు. ఆ తరువాత వెంటనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీతో పాటు యూరోపియన్ యూనియన్ నేతలతో కూడా ట్రంప్ మాట్లాడారు. శాంతి ప్రక్రియ పురోగతిపై వారితో సమాలోచనలు చేశారు.
మరోవైపు.. పుతిన్‌తో ట్రంప్ చర్చలు జరిపిన నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ నేతలు మాత్రం కొంత అనుమానంగా ఉన్నారు. పుతిన్‌పై నమ్మకం లేకపోవడం, బలవంతంగా శాంతి ఒప్పందం కోసం రష్యా ముందు తలవంచాల్సి వస్తుందన్న ఆందోళనల్లో యూరోప్ దేశాలు కనిపిస్తున్నాయి. గత మూడేళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధం 2022 ఫిబ్రవరిలో రష్యా సైనిక దాడితో ప్రారంభమైంది. అప్పటి నుంచి వేలాది మంది మరణించగా, అనేక నగరాలు ధ్వంసమయ్యాయి.
Also Read: ఏఐ ఉందిగా అని ఉద్యోగులను తొలగించిన కంపెనీ.. నిండా మునిగింది
అయితే ఇటీవల టర్కీలో ప్రత్యక్షంగా రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధులు కాల్పుల విరమణకు చర్చలు ప్రారంభించడం, యుద్ధం ముగించేందుకు ట్రంప్ రీ ఎంట్రీ ఇవ్వడం వంటి పరిణామాలు శాంతి ప్రక్రియకు కొత్త ఊపునిస్తాయా అనే ఆశను కలిగిస్తున్నాయి. కానీ శాంతి స్థాపన అనేది కేవలం ఒక ఒప్పందంతో కాదు, మౌలిక సమస్యల పరిష్కారంతోనే సాధ్యమవుతుందని పుతిన్ పేర్కొనడం గమనార్హం.
ఈ నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు ఎంతవరకూ కొనసాగుతాయో, శాంతి కోసం ఇరు దేశాలూ విధించే షరతులు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి వేచి చూడాల్సిందే.