Venezuela Oil Imports Trump Tariff| అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ప్రపంచ దేశాలను ఆర్థికంగా దెబ్బతీసేలా ఉన్నాయి. ఇందులో ఆయన మిత్రదేశమైనప్పటికీ భారతదేశానికి కూడా మినహాయింపు ఇవ్వడం లేదు. ఇండియా తరచూ అమెరికా ఎగుమతులపై అధిక సుంకాలు విధిస్తోందని ట్రంప్ విమర్శిస్తూ.. ఇకపై భారతదేశం విధించే సుంకాలకు సమానమైన “రెసిప్రోకల్ టారిఫ్లు” (ప్రతిసుంకాలు) విధిస్తామని హెచ్చరించారు. ఇప్పుడు వారు భారతదేశాన్ని పరోక్షంగా ఎదుర్కొనేందుకు కొత్త చర్యలు ప్రకటించారు.
వెనుజులా నుండి చమురు దిగుమతిదారులపై 25 శాతం టారిఫ్
ఏప్రిల్ 2 నుంచి వెనుజులా దేశం నుంచి చమురు దిగుమతి చేసే దేశాలు, చమురు బిజినెస్ చేసే కంపెనీలపై 25 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. వెనుజులా నుంచి అక్రమ వలసదారులు, నేరగాళ్లు అమెరికాలో చొరబడుతున్నారని.. వారిని అడ్డుకునేందుకు వెనెజులా ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే వెనెజులా దేశాన్ని ఆర్థికంగా శిక్షించడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చర్య ద్వారా ఆ దేశంపై ఒత్తిడి పెరుగుతుందన్నారు.
“ఏ దేశమైనా వెనుజులా నుండి చమురు లేదా గ్యాస్ కొనుగోలు చేస్తే, మేము ఆ దేశంతో జరిపే ఏదైనా వ్యాపారంపై 25 శాతం టారిఫ్ విధిస్తాము. ఈ నియమం ఏప్రిల్ 2 నుంచి అమలులోకి వస్తుంది” అని ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పోస్ట్ చేశారు. అయితే భారతదేశంపై కూడా ఏప్రిల్ 2 నుంచే ప్రతీకార సుంకాలు అమలు అవుతాయని ఆయన ఇటీవలే పలుమార్లు ప్రకటించడం గమనార్హం.
భారత కంపెనీలకు నష్టం
వెనుజులా నుండి అధిక ముడిచమురు దిగుమతి చేసే దేశాలలో భారతదేశం ముఖ్యమైనది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు ఈ నిర్ణయంతో ఆర్థికంగా తీవ్ర నష్టాలు ఎదుర్కోవచ్చు. 2023లో అమెరికా పరిమితులు సడలించిన తర్వాత రిలయన్స్ తాజాగా వెనుజులా నుండి చమురు దిగుమతిని తిరిగి ప్రారంభించింది. ట్రంప్ ఈ కొత్త టారిఫ్ విధానం వల్ల ఈ కంపెనీల వ్యాపారానికి తీవ్ర అడ్డంకులు ఎదురవుతాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారతదేశంతో పాటు, అమెరికా, స్పెయిన్ దేశాలు వెనెజులా నుంచి అధికంగా చమురు దిగుమతి చేసుకుంటున్నాయి.
Also Read: అమెరికా యుద్ధ ప్రణాళికలు మీడియాకు లీక్.. ట్రంప్ యంత్రాంగం నిర్లక్ష్యమే కారణం
డిసెంబర్ 2023 నుంచి జనవరి 2024 మధ్య వెనెజులా నుంచి అధికంగా చమురు దిగుమతి చేసుకున్న దేశంగా భారత్ టాప్ లో నిలిచింది. ఒక్క రోజులోనే దాదాపు 1,91,600 బ్యారెల్స్ చమురు దిగుమతి చేసుకుంది. 2024 సంవత్సరంలో మొత్తం 22 మిలియన్ బ్యారెల్స్ చమురు వెనెజులా నుంచి ఇండియా దిగుమతి చేసుకోవడం గమనార్హం.
ట్రంప్ నిర్ణయంతో సోమవారం చమురు ధరలు భారీగా పెరిగపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 84 సెంట్లు పెరిగి ఒక బ్యారెల్ 73 డాలర్లు పలికింది.
అయితే ట్రంప్ విధించిన ఈ సుంకాలు ఒక సంవత్సరం తరువాత వాటి గడువు ముగిసిపోతుంది. లేదా వెనిజులా ప్రభుత్వం అమెరికా చెప్పినట్లు చేస్తే త్వరగానే ముగిసిపోయే అవకాశమూ ఉంది. ఇప్పటికే వెనెజులా, అమెరికా మధ్య ఉన్న చమురు పైప్ లైన్ ని గత నెల సస్పెండ్ చేసింది ట్రంప్ యంత్రాంగం.