Indian Mangoes: భారతదేశం నుంచి ఎగుమతి చేయబడిన 15 కంటైనర్ల మామిడి పండ్లను అమెరికా అధికారులు రద్దు చేశారు. ఎగుమతి చేసే సమయంలో డాక్యుమెంటేషన్ ప్రాసెస్‌తో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ.. అక్కడి అధికారులు మామిడి పండ్ల నౌకలను రద్దు చేశారు.
ఖర్చు ఎక్కువ- పండ్లు అక్కడే ధ్వంసం
మామిడి పండ్లకు సంబంధించి అమెరికా దేశం, భారతదేశానికి అతిపెద్ద ఎగుమతి మార్కెట్. ఈ పండ్లను భారతీయ వ్యాపారులు వాయు మార్గం ద్వారా ఎగుమతి చేశారు. అయితే అమెరికాకు చేరుకున్న తర్వాత అధికారులు ఈ మామిడి పండ్ల షిప్‌మెంట్లను తిరస్కరించారు. మామిడి పండ్ల సరుకు మే 8, 9 తేదీల్లో ముంబైలో ఇరేడియేషన్ ప్రాసెస్‌కి గురైనప్పటికి.. లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటాతో సహా పలు విమానాశ్రయాల్లో అధికారులు తిరస్కరించారు. ఈ కారణంగా భారత ఎగుమతిదారులకు గణనీయమైన ఆర్థిక నష్టం ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. మామిడి పండ్లను మళ్లీ భారతదేశానికి ఎగుమతి చేసేందుకు ఖర్చు ఎక్కువగా అయ్యే అవకాశం ఉండడంతో.. వ్యాపారులు పండ్లను అక్కడే ధ్వంసం చేశారు.
ఇరేడియేషన్ అంటే..?
ఇరేడియేషన్ అంటే పండ్లను గామా కిరణాలు, ఎక్స్-రేలు లేదా ఎలక్ట్రాన్ కిరణాల వంటి అయానైజింగ్ రేడియేషన్‌కు గురిచేసే ప్రక్రియ. ఇరేడియేషన్ చేయడం వల్ల ఆహార సంరక్షణ, నాణ్యతను మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. పండ్లు చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఇరేడియేషన్ ప్రాసెస ను ఉపయోగిస్తారు. బ్యాక్టీరియా, ఈస్ట్, ఫంగస్ వంటి సూక్ష్మజీవులను తొలగించవచ్చు. ఈ ప్రక్రియలో రసాయనాలు ఉపయోగించకుండా ఆహారాన్ని సంరక్షించవచ్చు. అందుకే పండ్లను ఇరేడియేషన్‌కు గురిచేస్తుంటారు.
ఇరేడియేషన్ ప్రక్రియకు సంబంధించిన డాక్యుమెంటేషన్‌లో వ్యత్యాసాలను యూఎస్ఏ అధికారులు ఎత్తిచూపారు. ఇరేడియేషన్ ప్రాసెస్ సరిగ్గా లేదని.. మామిడిపండ్లను అధికారులు తిరస్కరించడంతో.. ఇద్దరు భారతీయ ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పండ్లకు సంబంధించిన ఈ రేడియేషన్ ప్రక్రియ యూఎస్ వ్యవసాయ శాఖ (యూఎస్‌డీఏ) అధికారి పర్యవేక్షణలో ముంబైలో జరిగిందని మీడియాతో చెప్పారు. ఈ అధికారి పీపీక్యూ203 ఫారమ్‌ను ధృవీకరించడానికి బాధ్యత వహిస్తారు. ఇది అమెరికాకు మామిడిపండ్లను ఎగుమతి చేసేందుకు అనుమతి తీసుకునే పత్రం. అయితే.. రేడియేషన్ ప్రాసెస్‌లో తాము చేసిన కొన్ని తప్పుల వల్ల ఇలా జరిగిందతని ఓ ఎగుమతిదారుడు మీడియాతో చెప్పాడు. అమెరికా అధికారులు మామిడిపండ్ల షిప్‌మెంట్లను రద్దు చేయడం వల్ల సుమారు దాదాపు 5లక్షల డాలర్లు నష్టపోయినట్టు సమాచారం.
Also Read: Vizianagaram District: అయ్యో దేవుడా ఎంత పనిచేశావ్? పాపం చిన్నారులు
USDA ఎగుమతిదారులలో ఒకరికి పంపిన నోటిఫికేషన్‌లో.. ‘తప్పుగా జారీ చేయబడిన పీపీక్యూ203 కారణంగా యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ ఈ షిప్‌మెంట్‌కు ప్రవేశం నిరాకరించినట్టు తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వ ఈ షిప్‌మెంట్‌కు సంబంధించిన సమస్యలకు పరిష్కారం చూపించలేదని తెలిపింది. సోషల్ మీడియాలో దీనిపై మిశ్రమ స్పందనలను వస్తున్నాయి. కొందరు దీనిని భారత ప్రభుత్వ వైఫల్యంగా విమర్శిస్తుండగా.. మరికొందరు అమెరికా వాణిజ్య విధానాలను తప్పుబడుతున్నారు. దీని కారణంగా భారత మామిడి ఎగుమతిదారులకు ఆర్థికంగా నష్టం కలిగించినప్పటికీ, దీనిని విస్తృత వాణిజ్య వివాదంగా లేదా రాజకీయ చర్యగా భావించకూడదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై జరుగుతున్న చర్చలు ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది.
Also Read: Terrorist Saifullah Khalid: మోస్ట్ డేంజర్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హతం.. ఎట్ల చంపారంటే?