Breakfast: మీరు ఉదయం తొందరగా లేచి ఆఫీసు లేదా స్కూల్‌కి వెళ్లడానికి సిద్ధమవుతున్నప్పుడు, మీకు బ్రేక్‌ఫాస్ట్ చేసే సమయం దొరకకపోవచ్చు. కానీ, ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం వల్ల కలిగే నష్టాలు చాలా ఉన్నాయి. ఉదయం టిఫిన్ చేయడం వల్ల మన శరీరానికి, మన మెదడుకి శక్తి లభిస్తుంది. అంతేకాకుండా.. రోజంతా చురుకుగా ఉండేందుకు బ్రేక్‌ఫాస్ట్ చాలా ముఖ్యం. మీరు బ్రేక్‌ఫాస్ట్ ఎందుకు మిస్ చేయకూడదో 5 ముఖ్యమైన కారణాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. శరీరానికి శక్తినిస్తుంది:
రాత్రి మొత్తం నిద్ర తర్వాత మన శరీరంలో శక్తి నిల్వలు తక్కువగా ఉంటాయి. ఉదయం టిఫిన్ చేయడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు లభిస్తాయి. ఇవి శరీరానికి కొత్త శక్తిని అందిస్తాయి. ఉదయం టిఫిన్ చేయకపోతే, శరీరం బలహీనంగా మారి, అలసటగా అనిపిస్తుంది. ఫలితంగా మీరు పని మీద సరిగా దృష్టి పెట్టలేరు.
2. మెదడు చురుకుగా పనిచేస్తుంది:
బ్రేక్‌ఫాస్ట్ మెదడు పనితీరుకు చాలా అవసరం. గ్లూకోజ్ మెదడుకు ప్రధాన ఇంధనం. టిఫిన్ తినడం వల్ల మెదడుకు అవసరమైన గ్లూకోజ్ లభిస్తుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అంతే కాకుండా ఏకాగ్రత మెరుగవుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఆఫీసు ఉద్యోగులు ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ చేస్తే పనిలో, చదువులో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తే, మెదడు చురుకుదనం తగ్గి, ఆలోచించే సామర్థ్యం తగ్గుతుంది.
3. బరువు నియంత్రణలో సహాయపడుతుంది:
టిఫిన్ చేయకపోతే.. మధ్యాహ్నం భోజనం సమయంలో అతిగా తినే అవకాశం ఉంది. ఉదయం టిఫిన్ చేయడం వల్ల రోజంతా ఆకలిని నియంత్రించుకోవచ్చు. దీనివల్ల అనవసరమైన స్నాక్స్ తినడం తగ్గుతుంది. పరిశోధనల ప్రకారం.. క్రమం తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్ చేసేవారిలో స్థూలకాయం వచ్చే ప్రమాదం తక్కువ. ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ జీవక్రియ (మెటబాలిజం) రేటును పెంచుతుంది. దీనివల్ల కేలరీలు త్వరగా ఖర్చు అవుతాయి.
Also Read: వావ్, అవకాడో తింటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా ?
4. పోషకాహార లోపం నివారిస్తుంది:
బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేయడం వల్ల మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలు అందవు. బ్రేక్‌ఫాస్ట్‌లో సాధారణంగా పాలు, గుడ్లు, పండ్లు, ధాన్యాలు వంటివి ఉంటాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ మరియు ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. టిఫిన్ చేయకపోవడం వల్ల దీర్ఘకాలంలో పోషకాహార లోపాలు వచ్చే ప్రమాదం ఉంది.
5. మానసిక ఆరోగ్యం మెరుగుపరుస్తుంది:
బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేయడం వల్ల చిరాకు, అలసట, ఒత్తిడి పెరుగుతాయి. ఉదయం సరైన ఆహారం తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంటుంది. దీనివల్ల రోజంతా సానుకూలమైన ఆలోచనలతో ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి, బ్రేక్‌ఫాస్ట్ వాళ్ళ మానసిక ఆరోగ్యం, శారీరక ఎదుగుదలకు చాలా అవసరం.