చాలా వివాహాలు మధ్యలోనే విడాకులకు దారితీస్తాయి. భార్యాభర్తలిద్దరూ తమ వివాహంపై కాస్త శ్రద్ధ చూపిస్తే చాలు, సర్దుకుంటే చాలు.. ఆ వివాహం వందేళ్లు కొనసాగుతుంది. కానీ ఆ చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోవడానికి కూడా కొంతమంది సిద్ధంగా లేరు. అందుకే వందలో యాభై పెళ్లిళ్లు పెటాకులుగా మారుతున్నాయి. భార్యాభర్తలు ఏ విషయాల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే వారి వివాహం కలకాలం సాగుతుందో తెలుసుకోండి.
కలిసి నడవండి
భార్యాభర్తలిద్దరూ కలిసి కాసేపు అలా వాకింగ్ కు వెళ్ళండి. ఆ సమయంలో ఒకరి ఆలోచనలను మరొకరితో పంచుకోండి. ఒకరి మనసులో ఉన్న బాధను ఎదుటివారికి చెప్పుకోండి. మీరు కలిసి వేసే ప్రతి అడుగు మిమ్మల్ని మరింతగా దగ్గర చేస్తుంది. మీలో ఒకరిపై ఒకరికి ప్రేమను పెంచుతుంది. స్వచ్ఛమైన గాలిలో మీ మధ్య స్వచ్ఛమైన ప్రేమ కూడా పెరుగుతూ వస్తుంది. ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడంతో పాటు రిలాక్స్ గా ఉంటారు. మీ బంధం పునజ్జీవం పొందుతుంది.
ఉత్తరాలు రాయండి
ఒకప్పుడు ప్రేమలేఖలు రాసే అలవాటు ఉండేది. కానీ ఇప్పుడు ఈమెయిల్స్, మెసేజులు తప్ప మనసులోని మాటను ప్రేమలేఖ రూపంలో రాయడం తగ్గిపోయింది. మీ బంధం చిరకాలం ఫ్రెష్ గా ఉండాలంటే అప్పుడప్పుడు చిన్నచిన్న రంగుల పేపర్ల పై మీ ప్రేమను వ్యక్తీకరుస్తూ ఉండండి. ఆ ప్రేమలేఖలను మీ జీవిత భాగస్వామికి అందేలా చూడండి. ఇది వారిలో భావోద్వేగాలను పెంచుతుంది. మీపై సానుకూల అనుబంధాలను పెరిగేలా చేస్తుంది. ప్రతిరోజు రాయడం వల్ల మీకు మీ జీవిత భాగస్వామిపై ఎంతో కొంత శ్రద్ధ కూడా పెరుగుతూనే ఉంటుంది.
డిన్నర్లకు వెళ్ళండి
పెళ్లికి ముందే కాదు, పెళ్లి తర్వాత కూడా డేటింగ్ చేయవచ్చు. రాత్రిపూట డేట్ లకు వెళ్ళవచ్చు, వారానికి ఒక్కసారి అయినా ఒక రెస్టారెంట్ కు వెళ్లి ఇద్దరూ కలిసి నచ్చినవి భోజనం చేయండి. ఇద్దరూ కలిసి సినిమా చూడండి. కొత్త జ్ఞాపకాలను పోగేసుకోవడానికి కృషి చేయండి. వారానికి ఒక్కసారి ఇలా చేసినా చాలు… ఆ ఇద్దరు భార్యాభర్తలు ఎంతో ఆనందంగా వైవాహిక జీవితాన్ని గడపగలుగుతారు.
కలిసి పని చేయండి
ఉదయం నుంచి ఒక్కరే ఇంట్లో పని చేయాల్సిన అవసరం లేదు. భార్య కిచెన్‌లో పనిచేస్తున్నప్పుడు భర్త కూడా వెళ్లి సాయం చేయవచ్చు. ఇది ఒకరిపై ఒకరికి అవగాహనను పెంచుతుంది. అలాగే వారికున్న శ్రద్ధను కూడా బయటపెడుతుంది. ఇవన్నీ కూడా భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేస్తాయి. మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా కాసేపైనా భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు సాయం చేసుకోవడంలో ముందుండండి.
డిజిటల్ డీటెయిల్స్
ఇది డిజిటల్ యుగం. మనుషులు నేరుగా కాకుండా ఫోన్లలోనే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. వీడియోలో చాటింగ్ చేసుకుంటున్నారు. అందుకే డిజిటల్ డిటాక్సిఫికేషన్ నేటి జంటలకు చాలా అవసరం. వారంలో ఒక్క సాయంత్రం అయినా పూర్తిగా ఫోన్లకు, టీవీలకు, లాప్ టాప్‌లకు దూరంగా ఉండండి. ఇద్దరు ఒకరితో ఒకరు కలిసి కాసేపు సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించండి. ఇది ఒకరిపై ఒకరికి ఆసక్తిని పెంచుతుంది. తిరిగి మీరు ఒకరితో ఒకరు ప్రేమగా కనెక్ట్ అవుతారు.
Also Read: జిమ్‌లో ఆంటీతో ప్రేమ.. ఆమె భర్త కిల్లర్ అని తెలిస్తే? మరి.. ఆ రిలేషన్ నుంచి అతడు ఎలా భయటపడ్డాడు?
పెళ్లయి పదేళ్లయిన భార్యాభర్తలు ఒకరిపై ఒకరు విసిగిపోతూ ఉంటారు. అలాంటి వారు పై చిట్కాలను పాటించడం ద్వారా తిరిగి ఒక్కటి కావచ్చు. కొత్తగా ప్రేమలో పడొచ్చు. జీవితాన్ని మరింత అందంగా మార్చుకోవచ్చు. ఒక్కసారి ఇవన్నీ ప్రయత్నించి చూడండి. మీకు ఎంతో ఉపకరిస్తాయి. ముఖ్యంగా ఒకరిని ఒకరు ఇంప్రెస్ చేసేలా అందంగా తయారవడం కూడా చాలా ముఖ్యం.