Paneer Side Effects: పనీర్ అనేది పాల నుంచి తయారుచేసే ఒక రుచికరమైన, పోషక విలువలున్న ఆహార పదార్థం. దీనిలో ప్రోటీన్లు, కాల్షియం అధికంగా ఉంటాయి. అందుకే దీనిని తినడం వల్ల శరీరానికి అవసరం అయిన పోషకాలు లభిస్తాయని చెబుతారు. ముఖ్యంగా శాఖాహారులు ప్రస్తుతం ఎక్కువగా పనీర్ తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే తరచుగా పన్నీర్ తినడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ ఎక్కువగా తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్:
అధిక కొవ్వు, బరువు పెరగడం:
పనీర్‌ను పాల నుంచి తయారు చేస్తారు కాబట్టి.. ఇందులో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. ఒక 100 గ్రాముల పనీర్ లో దాదాపు 20 గ్రాముల కొవ్వు ఉంటుంది. అధిక కొవ్వు తీసుకోవడం వల్ల బరువు పెరిగి.. స్థూలకాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా అధిక మొత్తంలో పనీర్ తినేవారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.
జీర్ణ సమస్యలు:
కొంతమందికి పనీర్ జీర్ణం కావడం కష్టం. ముఖ్యంగా లాక్టోస్ ఇష్టం లేని వారికి ఇది మరింత సమస్యగా మారుతుంది. పనీర్‌లో అధికంగా ఉండే ప్రోటీన్లు, కొవ్వుల వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడి, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా పనీర్ తీసుకుంటే ఈ సమస్యలు మరింత తీవ్రమవుతాయి.
కొలెస్ట్రాల్ పెరగడం:
పనీర్ లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను పెంచుతాయి. అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు, రక్తపోటుకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి గుండె జబ్బులు ఉన్నవారు పనీర్‌ను మితంగా తీసుకోవడం మంచిది.
కిడ్నీలో రాళ్ల సమస్య:
పనీర్‌లో ఆక్సలేట్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. ఇది అధికంగా తీసుకున్నప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణం కావచ్చు. ఇది అన్నింటిలోనూ ఉండకపోయినా.. కిడ్నీ సమస్యలు లేదా కిడ్నీలో రాళ్లు ఉన్నవారు పనీర్‌ను అధికంగా తీసుకోవడం తగ్గించాలి.
Also Read: నోటి దుర్వాసనకు చెక్ పెట్టే.. హోం రెమెడీస్ ఇవే !
హార్మోన్ల సమస్యలు:
పనీర్ వంటి పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. పాలలో ఉండే హార్మోన్లు శరీరంలోకి ప్రవేశించి, హార్మోన్ల అసమతుల్యతకు దారితీసే అవకాశం ఉంది. ఇది అండశయ తిత్తుల (PCOS) వంటి సమస్యలను కూడా పెంచవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
పనీర్ ఆరోగ్యకరమైనది అయినప్పటికీ.. దానిని మితంగా తీసుకుంటేనే మంచిది. పనీర్ ను నూనెలో వేయించి లేదా అధిక మసాలాలతో వండకుండా, ఉడకబెట్టిన పనీర్ తీసుకోవడం వల్ల దానిలోని పోషకాలను పూర్తిగా పొందవచ్చు. పనీర్ ను పచ్చిగా లేదా కూరలలో తక్కువగా ఉపయోగించడం వల్ల దాని వల్ల కలిగే ప్రతికూలతలను తగ్గించుకోవచ్చు. ఏ ఆహారమైనా సమతుల్యంగా.. సరైన మోతాదులో తీసుకున్నప్పుడు మాత్రమే ప్రయోజనాలు అధికంగా పొందవచ్చు.