Kidney Health: రెండు కిడ్నీలు శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తాన్ని శుభ్రపరిచి, వ్యర్థాలను, అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. కిడ్నీల ఆరోగ్యం ఆహారంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా.. కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల కిడ్నీలపై భారం పడుతుంది. ఫలితంగా వాటి పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. మనం ఏ ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీల ఆరోగ్యానికి దూరంగా ఉండాల్సిన ఆహారాలు:
అధిక సోడియం (ఉప్పు ఎక్కువగా) ఉన్న ఆహారాలు:
అధిక ఉప్పు ఉన్న ఆహారాలు కిడ్నీలకు మొదటి శత్రువులు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది కాలక్రమేణా కిడ్నీలను దెబ్బతీస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్, క్యాన్డ్ సూప్స్, ఉప్పు వేసిన ఊరగాయల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది. వీటికి బదులుగా.. ఇంట్లో తయారు చేసుకున్న ఆహారాన్ని తక్కువ ఉప్పుతో తినడం అలవాటు చేసుకోవాలి.
పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారాలు:
సాధారణంగా పొటాషియం శరీరానికి అవసరమే. కానీ, కిడ్నీల పనితీరు సరిగా లేనప్పుడు.. శరీరంలో పొటాషియం స్థాయిలు పెరిగిపోతాయి. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. అరటిపండ్లు, బంగాళదుంపలు, టమాటోలు, కివీ, ఎండు ద్రాక్ష వంటి వాటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ ఆహారాలను తినే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి.
పాస్ఫరస్ అధికంగా ఉన్న ఆహారాలు:
కిడ్నీలు బలహీనపడితే శరీరంలోని ఫాస్ఫరస్ స్థాయిలు పెరుగుతాయి. ఇది ఎముకలను బలహీనపరిచి, గుండె సమస్యలకు దారితీస్తుంది. పాల ఉత్పత్తులు, ప్యాకేజ్డ్ మీట్, సోడా, కోలా పానీయాలు, కొన్ని రకాల తృణధాన్యాలలో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది.
అధిక ప్రోటీన్ ఉన్న ఆహారాలు:
మాంసం, ముఖ్యంగా ఎర్ర మాంసం , ప్రోటీన్ కు మంచి వనరు. కానీ అధిక మోతాదులో ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీలపై భారం పడుతుంది. కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు, ప్రోటీన్‌ను జీర్ణం చేయడం కష్టమవుతుంది. అయితే.. ఆరోగ్యకరమైన కిడ్నీలు ఉన్నవారు ప్రోటీన్‌ను తీసుకోవచ్చు. కానీ మితంగా తీసుకోవాలి.
Also Read: జిమ్‌కు వెళ్లడానికి సమయం లేదా ? ఇలా చేస్తే ఫుల్ ఫిట్ నెస్
కృత్రిమ స్వీటెనర్లు, సాఫ్ట్ డ్రింక్స్:
కృత్రిమ స్వీటెనర్లు, ఎనర్జీ డ్రింక్స్, సోడా వంటివి కిడ్నీలకు హానికరం. ఇవి అధిక ఫాస్ఫరస్, కృత్రిమ రసాయనాలను కలిగి ఉంటాయి. వాటికి బదులుగా.. నీరు, కొబ్బరి నీళ్ళు, హెర్బల్ టీ వంటి వాటిని తీసుకోవడం మంచిది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
కిడ్నీల ఆరోగ్యం కోసం సమతుల్యమైన, తక్కువ ఉప్పు, తక్కువ చక్కెర ఉన్న ఆహారం తీసుకోవడం ఉత్తమం. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు , పుష్కలంగా నీరు తాగడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే.. డాక్టర్ సలహా మేరకు ఆహార ప్రణాళికను మార్చుకోవడం చాలా ముఖ్యం.