మనుషులు ఒకేసారి ఒక బిడ్డను మాత్రమే కనగలరు. కొంతమంది ఇద్దరు, ముగ్గురిని కూడా కంటారు. అంతకంటే ఎక్కువమందిని ఒకేసారి కంటే.. అది తప్పకుండా రికార్డే అవుతుంది. అయితే, మనిషి కంటే చిన్న జీవి కుక్క మరికొన్ని జీవులు ఒకేసారి పదుల సంఖ్యలో పిల్లలను కనేస్తాయి. అలాంటి సమయంలో అవి అన్నేసి పిల్లలను కడుపులో ఎలా మోస్తాయి? వాటికి పోషకాలు ఎలా? గర్భంలో ఎలా ఉండగలుగుతాయి.. ఇలా ఎన్నో సందేహాలు వెంటాడతాయి. సోషల్ మీడియాలో తాజాగా.. గర్భంతో ఉన్న ఓ కుక్క ఎక్స్‌రే ఒకటి చక్కర్లు కొడుతోంది. అందులో దాదాపు 12 పిల్లలు ఉన్నాయి. ఆ ఫొటో చూసిన నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు. అసలు కుక్క కడుపులో అన్ని పిల్లలు ఎలా పెరుగుతాయని ఆశ్చర్యపోతున్నారు. అందుకే.. కుక్కల గర్భానికి సంబంధించిన కొన్ని ఆసక్తిక విషయాలను ఇక్కడ అందిస్తున్నాం.
కుక్క గర్భంలో అన్ని పిల్లలు ఎలా?
కుక్కల గర్భధారణ అనేది ఒక అద్భుతమైన జీవశాస్త్ర ప్రక్రియ. ఒక కుక్క ఒకేసారి అనేక కుక్క పిల్లలకు జన్మనివ్వగలదు. మనుషులతో పోల్చితే కుక్కల గర్భాశయం చాలా భిన్నంగా ఉంటుంది. Y ఆకారంలో కొమ్ముల తరహాలో ఉంటుంది. దీన్నే వైద్యులు తమ పరిభాషలో Uterine Horns అని పిలుస్తారు. సంభోగం తర్వాత ఫలదీకరణం చెందిన గుడ్లు (embryos) ఈ రెండు కొమ్ముల్లోకి వెళ్లి స్థిరపడతాయి. ప్రతి కుక్క పిల్ల(శిశువు) వేర్వేరు అమ్నియోటిక్ సాక్‌లో ఉంటాయి. అది పూర్తిగా ద్రవంతో నిండి ఉంటుంది. ఆ దవ్రమే పిల్లలకు రక్షణ ఇస్తుంది. ఆ పిల్లలకు ప్లాసెంటా ద్వారా తల్లి నుంచి పోషకాలు, ఆక్సిజన్, రక్తం అందుతుంది.
ప్రసవానికి ఎంత టైమ్ పడుతుంది?
ఫలదీకరణం తర్వాత మొదటి 2-3 వారాలు గర్భాశయంలో దశలవారీగా పెద్దవి అవుతుంటాయి. అప్పటికి వాటికి ఎలాంటి షేపు ఉండదు. 4 నుంచి 5 వారాల్లో వాటికి క్రమేనా అవయవాలు ఏర్పడతాయి. ఈ దశలో అల్ట్రాసౌండ్ ద్వారా వాటిని గుర్తించవచ్చు. 6 నుంచి 9 వారాల్లో పిల్లలకు ఒక రూపం వస్తుంది. పుట్టేందుకు సిద్ధమవుతాయి. అంటే కుక్క దాదాపు రెండు నెలల లోపే బిడ్డలను ప్రసవిస్తుంది.
ఒకేసారి అన్ని పిల్లలు ఎలా సాధ్యం?
సంభోగం సమయంలో కుక్కలు ఎక్కువ సంఖ్యలో అండాలను విడుదల చేస్తాయి. దీన్నే ఓవ్యులేట్ అంటారు. స్పెర్మ్ ఎక్కువ అండాలతో ఫలదీకరణ చెందడం వల్ల.. ఎక్కువ పిల్లలు పుట్టేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే, అన్ని కుక్కలు ఒకే సంఖ్యలో పిల్లలను కంటాయనే గ్యారంటీ లేదు. ఆ జాతి, పరిస్థితులు, శరీర స్థితిగతులు, పోషకాలు… ఇలా ఎన్నో అంశాలపై ఫలితం ఆధారపడి ఉంటుంది. ఒకేసారి ఎక్కువ పిల్లలనును కనే ప్రక్రియను వైద్య పరిభాషలో లిట్టర్(గర్భాశయం) అని పిలుస్తారు. ఆ కుక్క ఎన్ని పిల్లలను కనగలదు అనేది ఆ లిట్టర్ సైజు మీద ఆధారపడి ఉంటుంది. ప్రసవ సమయంలో కుక్కలు నిమిషాల వ్యవధిలో పిల్లలను కంటాయి. కొన్నిసార్లు ఈ ప్రక్రియ గంటల సేపు సాగవచ్చు.
ఒకేసారి ఎన్ని పిల్లలను కనగలవు?
కుక్కలన్నీ బహుళ సంఖ్యలో పిల్లలను కంటాయని అనుకుంటే పొరపాటే. కొన్ని జాతుల కుక్కలు ఒకేసారి 1 లేదా 4 పిల్లల వరకు మాత్రమే కంటాయి. లాబ్రడార్ రిట్రీవర్, జర్మన్ షెపర్డ్, గోల్డెన్ రిట్రీవర్, గ్రేట్ డేన్ వంటివి 6 నుంచి 12 వరకు పిల్లలను కంటాయి. ఎందుకంటే పెద్ద కుక్కలు ఎక్కువ గుడ్లను ఓవ్యులేట్ చేయగలవు. దీనివల్ల లిట్టర్ సైజు పెరుగుతుంది. అలాగే యవ్వనంలో ఉండే కుక్కలు కూడా ఎక్కువ పిల్లలను కనొచ్చు. వయస్సు మీదపడిన కుక్కల్లో లిట్టర్ సైజు తగ్గుతుంది. అవి ఎక్కువ పిల్లలను కనలేకపోవచ్చు. ఈ పిల్లల సంఖ్య జన్యుపరంగా కూడా మారుతుంటాయి. బీగల్, కాకర్ స్పానియల్ వంటి మధ్యస్థ జాతులు 4 నుంచి 8 పిల్లలు కనగలవు. 2004లో నీపోలిటన్ మాస్టిఫ్ అనే ఒక పెద్ద కుక్క 24 పిల్లలకు జన్మనిచ్చిన రికార్డులకు ఎక్కింది. అయితే, ఒకేసారి అన్ని పిల్లలను కనడం ఆరోగ్యకరం కాదని, వాటిలో కొన్ని పిల్లలు చాలా బలహీనంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
Also Read: ఇదిగో ఈ వయస్సుకు చేరాకే త్వరగా ముసలోళ్లు అయిపోతారు
ఇదే గర్భంతో ఉన్న కుక్క ఎక్స్‌రే. ఇందులో పిల్లలను స్పష్టంగా చూడవచ్చు: